BiggBoss Telugu 5: నామినేషన్స్‌తో హీటెక్కిన హౌస్‌.. కూల్‌ చేసేందుకు నయా టాస్క్‌ - telugu news bigg boss telugu5 third week nominations
close
Updated : 22/09/2021 12:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

BiggBoss Telugu 5: నామినేషన్స్‌తో హీటెక్కిన హౌస్‌.. కూల్‌ చేసేందుకు నయా టాస్క్‌

మూడోవారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే

ఇంటర్నెట్‌డెస్క్‌: కింగ్‌ నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న షో ‘బిగ్‌బాస్‌’. ప్రస్తుతం ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ ప్రసారమవుతోంది. తాజాగా మూడోవారానికి సంబంధించిన నామినేషన్స్‌ ప్రక్రియ మంగళవారంతో పూర్తైంది. ఈ సందర్భంగా కంటెస్టెంట్‌ల మధ్య వాడీవేడీగా వాదనలు జరిగాయి. హౌస్‌లో ఉండేందుకు అర్హత లేని, తమకు ఇష్టంలేని పోటీదారుల పేర్లను బోర్డుపై ముద్రించి.. అందుకు తగిన కారణాలు చెప్పి.. ఆ బోర్డును సుత్తితో బద్దలు కొట్టాల్సిందిగా బిగ్‌బాస్‌ సూచించారు.

నామినేషన్‌లో భాగంగా ప్రియ-లహరి-రవిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వీరి వాదనలతో హౌస్‌ హీటెక్కింది. దాంతో సోమవారంతో ముగిసిపోవాల్సిన నామినేషన్‌ ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగింది. మొదటివారంలో జరిగిన వివాదాన్ని కారణంగా చూపించి నటరాజ్‌ మాస్టర్‌ని జస్వంత్‌ నామినేట్‌ చేశాడు. దీంతో అసహనానికి గురైన నటరాజ్‌ మాస్టర్‌.. ‘ఇన్ని రోజుల తర్వాత ఆ విషయం గుర్తుకు వచ్చిందా? నువ్వింకా చిన్నపిల్లాడిలానే వ్యవహరిస్తున్నావు. పోయి హౌస్‌లో ఆడుకో. యూ ఆర్‌ ఏ కిడ్‌’ అంటూ జస్వంత్‌ని హేళన చేసి మాట్లాడారు. ప్రియ చేసిన వ్యాఖ్యలపై అసహనానికి గురైన  షణ్ముఖ్‌, కాజల్‌ కూడా ఆమెను నామినేట్‌ చేశారు. ‘నీకు సర్జరీ జరిగిందా?’ అంటూ ప్రియ తనని అడగడం బాడీ షెమింగ్‌లా అనిపించిందని చెబుతూ హమీదా సైతం ఆమెనే నామినేట్‌ చేసింది. అలా, తీవ్ర వాదోపవాదాలు, ఘాటైన విమర్శలు, సుదీర్ఘ వివరణలతో మూడోవారం బిగ్‌బాస్‌ నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. శ్రీరామచంద్ర, ప్రియలను అత్యధిక మంది నామినేట్‌ చేయగా.. లహరి, ప్రియంక, మానస్‌లు కూడా నామినేషన్స్‌లో చేరారు.

నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన అనంతరం.. ఒకరిని మరొకరు ఎందుకు నామినేట్‌ చేశారో వివరణ ఇచ్చే కార్యక్రమం కొనసాగింది. ప్రియ-లహరి-రవిల మధ్య నామినేషన్స్‌లో ఏ చర్చ అయితే జరిగిందే అదే చర్చ మళ్లీ కొనసాగింది. అయితే, ఈసారి కాస్త తీవ్రత తక్కువ స్థాయిలో జరిగింది. తాను చూసిందే చెప్పానని.. కావాలని కల్పించి ఏదీ చెప్పలేదని.. దానిని తప్పుగా అర్థం చేసుకున్నారని ప్రియ పదే పదే చెప్పే ప్రయత్నం చేసింది. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన లహరి, రవి.. ‘ప్రియ.. తాను చేసిన తప్పును ఏ మాత్రం మనస్ఫూర్తిగా అంగీకరించడం లేదు’ అని అనుకున్నారు. మరోవైపు, ప్రియాంక.. తనతో లోబో అసభ్యంగా ప్రవర్తించాడని.. కాజల్‌, అనీ మాస్టర్లతో చెప్పడం గమానార్హం. వెంటనే స్పందించిన కాజల్‌.. ‘ఈ వ్యవహారాన్ని అప్పుడే కడిగేయాల్సింది కదా’ అంటూ ప్రియాంకతో చెప్పింది. నటరాజ్‌ మాస్టర్‌ జస్వంత్‌ల మధ్య కూడా వివరణలు ఇచ్చుకునే ప్రయత్నం జరిగింది. అయితే, జస్వంత్‌ తనని నామినేట్‌ చేయడాన్ని నటరాజ్‌ జీర్ణించుకోలేకపోయారు. ‘ఇలాంటి రియాల్టీ షోలు నా జీవితంలో చాలా చూశా’ అంటూ జస్వంత్‌తో అసహనానికి గురయ్యాడు. అందరూ వెళ్లిపోయిన తర్వాత ప్రియ ఒంటరిగా కూర్చొని.. ‘నేను చూసిందే చెప్పానమ్మా.. నువ్వు నమ్మితే చాలు.. దయచేసి అర్థం చేసుకో’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. మరుసటి రోజు ఉదయం అందరూ కాఫీలు తాగుతుండగా ప్రియ హౌస్‌మేట్స్ మధ్యలోకి వచ్చి ‘నిన్న నా వల్ల జరిగిన గొడవకు నన్ను క్షమించండి’ అని కోరింది.

బిగ్‌బాస్‌.. కొత్త కెప్టెన్సీ టాస్క్‌..
తీవ్ర వాదోపదాలతో హీట్టెక్కిన హౌస్‌ని చల్లబరిచే ప్రయత్నం చేశాడు బిగ్‌బాస్‌. ఇందులో భాగంగా హైదరాబాద్‌ అమ్మాయి- అమెరికా అబ్బాయి పేరుతో కొత్త కెప్టెన్సీ టాస్క్‌ని ప్రారంభించాడు. ఇందులో హైదరాబాద్‌ అమ్మాయిగా లహరి.. అమెరికా అబ్బాయిగా శ్రీరామచంద్రను ఖరారు చేశారు. మిగిలిన హౌస్‌మెట్స్‌కు వివిధ రకాల పాత్రలు ఇచ్చారు. మరి, ఈ కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరు అలరిస్తారు? కెప్టెన్‌ పోటీదారులుగా ఎవరెవరు నిలబడతారు? చూడాల్సింది ఉంది..!


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని