Oxygen: ఆక్సిజన్‌ కొరత వల్లే ఆంధ్రాలో మరణాలు : కేంద్రం - telugu news center conforms some deaths due to oxygen shortage in andhra
close
Updated : 11/08/2021 13:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oxygen: ఆక్సిజన్‌ కొరత వల్లే ఆంధ్రాలో మరణాలు : కేంద్రం

(ప్రతీకాత్మక చిత్రం)

దిల్లీ: కరోనా మహమ్మారి రెండో దశ ఉద్ధృతి సమయంలో ఆక్సిజన్‌ కొరత కారణంగా కొన్ని మరణాలు సంభవించాయని కేంద్రం ఎట్టకేలకు ధ్రువీకరించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆక్సిజన్‌ సరిపడా లేక కొందరు కొవిడ్‌ బాధితులు మరణించినట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి డా. భారతి ప్రవీణ్‌ పవార్‌ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

రెండో దశ ఉద్ధృతి వేళ ఆక్సిజన్‌ కొరతతో మరణాలపై తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కేంద్రమంత్రి ఈ వివరాలను తెలియజేశారు. ‘‘కేంద్రం వద్ద ఉన్న ప్రాథమిక నివేదిక ప్రకారం.. వైరస్‌ రెండో ఉద్ధృతి సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో గల ఆసుపత్రిలో కొందరు కరోనా బాధితులు మరణించినట్లు తెలుస్తోంది. 10కేఎల్‌ ఆక్సిజన్‌ ట్యాంక్‌ను లెవలింగ్‌ చేయడం, ఆసుపత్రిలో బ్యాకప్‌ సిస్టమ్‌ను ఆన్‌ చేయడం మధ్య విరామం ఫలితంగా వెంటిలేటర్‌ సపోర్ట్‌పై ఉన్న రోగులకు ప్రాణవాయువు కొరత ఏర్పడినట్లు తెలిసింది’’ అని ఆమె వెల్లడించారు.

కాగా.. దేశంలో రెండో దశ ఉద్ధృతి సమయంలో ఆక్సిజన్‌ కొరత కారణంగా ఒక్క కొవిడ్‌ బాధితుడు కూడా ప్రాణాలు కోల్పోలేదని గత నెల కేంద్ర ఆరోగ్యశాఖ రాజ్యసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రాణవాయువు కొరతతో ఎంతమంది మరణించారనే సమాచారాన్ని నివేదించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఇప్పటివరకు 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దీనిపై స్పందించగా.. పంజాబ్‌లో నలుగురు కొవిడ్‌ బాధితులు ఆక్సిజన్‌ అందక చనిపోయి ఉంటారని ఆ రాష్ట్రం సందేహాన్ని వ్యక్తం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పడం గమనార్హం.

ఈ ఏడాది ఏప్రిల్‌ - మే నెలల్లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దిల్లీ, సహా పలు రాష్ట్రాల్లో ప్రాణవాయువు సరఫరా సరిపడా లేక అనేక మంది కొవిడ్‌ బాధితులు మరణించినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. మే 10న తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరా నిలిచి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఆసుపత్రిలో 45 నిమిషాల పాటు ప్రాణవాయువు సరఫరా నిలిచిపోయిందని బాధితుల కుటుంబసభ్యులు ఆరోపించగా.. అధికారులు మాత్రం 5 నిమిషాలే అంతరాయం కలిగినట్లు తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని