Supreme Court: అలాంటి అధికారులు జైలుకు వెళ్లాల్సిందే : సుప్రీం కోర్టు - telugu news chief justice nv ramana on ips officer case
close
Published : 27/09/2021 17:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Supreme Court: అలాంటి అధికారులు జైలుకు వెళ్లాల్సిందే : సుప్రీం కోర్టు

అక్రమార్జన చేసిన వారికి రక్షణ ఉండదన్న అత్యున్నత న్యాయస్థానం

దిల్లీ: మునుపటి ప్రభుత్వాలతో సన్నిహితంగా మెలిగి అక్రమార్జనకు పాల్పడే అధికారులు.. ప్రభుత్వం మారిన తర్వాత వాటిని తిరిగి చెల్లించే పరిస్థితులను ఎదుర్కొంటారని భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అలాంటి పోలీసు అధికారులకు రక్షణ కల్పించలేమని.. వారిని తప్పకుండా జైలుకు పంపించాల్సిందేనని స్పష్టం చేసింది. అక్రమాస్తుల కేసులో సస్పెండైన ఐపీఎస్‌ అధికారి గుర్జీందర్‌పాల్‌ సింగ్‌.. తనను అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

‘మీరు ప్రతి కేసులో రక్షణ పొందలేరు. ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ.. దోపిడికి పాల్పడ్డారు. ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండి ఇలాంటి పనులు చేస్తే ఇదే విధంగా జరుగుతుంది. ఏదో ఒకరోజు మూల్యం చెల్లించాల్సిందే. దేశంలో ఇదో కొత్త ధోరణి కనిపిస్తోంది. అలాంటి అధికారులకు రక్షణ ఎందుకు కల్పించాలి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. ఇదే సమయంలో తనలాంటి అధికారులకు రక్షణ అవసరమని సింగ్‌ తరపున న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేయగా.. అందుకు చీఫ్ జస్టిస్‌ తిరస్కరించారు. అలాంటివారు తప్పకుండా జైలుకు వెళ్లాల్సిందేనని చీఫ్‌ జస్టిస్‌  స్పష్టం చేశారు.

1994 బ్యాచ్‌ IPS అధికారి అయిన గుర్జీందర్‌ పాల్‌ సింగ్‌ ఛత్తీస్‌గఢ్‌లో భాజపా అధికారంలో ఉన్నప్పుడు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. అనంతరం పోలీసు అకాడమీ డైరెక్టర్‌ (అదనపు డీజీపీ హోదా)గా నియమితులయ్యారు. ప్రభుత్వం మారిన అనంతరం అవినీతి నిరోధక శాఖ, ఆర్థిక నేరాల విభాగం సోదాలు జరిపి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ కేసుల కారణంగా గుర్జీందర్‌ పాల్‌ సస్పెండయ్యారు. వివిధ వర్గాల మధ్య విభేదాలు కలిగేలా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారంటూ రాజద్రోహం కేసు కూడా నమోదయింది. రాజద్రోహం కేసును కొట్టివేయాలంటూ తొలుత ఆయన హైకోర్టును ఆశ్రయించగా అనుకూలంగా ఉత్తర్వులు రాలేదు. దాంతో సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా రెండు కేసుల్లోనూ నాలుగు వారాల పాటు ఎలాంటి అరెస్టు చేయకూడదంటూ ఆగస్టు 26న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని సింగ్‌కు సుప్రీం కోర్టు సూచించింది. తాజాగా దోపిడికి సంబంధించి నమోదైన మరో కేసులోనూ రక్షణ కల్పించాలంటూ సింగ్‌ సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. అన్ని కేసుల్లో రక్షణ పొందలేరని.. అక్రమార్జనకు పాల్పడే అధికారులు జైలుకు వెళ్లాల్సిందేనని వ్యాఖ్యనించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని