Maestro: ఇకపై రీమేక్‌ చేసే ఉద్దేశం లేదు: మేర్లపాక గాంధీ - telugu news director merlapaka gandhi interview about maestro
close
Published : 13/09/2021 23:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Maestro: ఇకపై రీమేక్‌ చేసే ఉద్దేశం లేదు: మేర్లపాక గాంధీ

ఇంటర్నెట్ డెస్క్‌: ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా తన వేగం ఏంటో చూపించారు మేర్లపాక గాంధీ. ఆ తర్వాత ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’, ‘కృష్ణార్జున్‌ యుద్ధం’ సినిమాలతో మెప్పించారు. ఇప్పుడు ఓ రీమేక్‌ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అదే ‘మాస్ట్రో’. హిందీలో ఘన విజయం అందుకున్న ‘అందాధున్’కి రీమేక్‌. నితిన్‌, నభా నటేశ్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సెప్టెంబరు 17 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కానుంది. ఈ సందర్భంగా గాంధీ.. మీడియాతో ముచ్చటించారు.

రీమేక్‌ చేయాలంటే అదే సమస్య..

అరకు దగ్గర్లోని టైడా అనే గ్రామంలో ‘అందాధున్‌’ చిత్రాన్ని చూశా. ఇందులోని థ్రిల్లింగ్‌ అంశాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా చూస్తున్నంత సేపూ కొత్త అనుభూతి కలిగింది. రీమేక్‌ చేస్తే ఇలాంటి సినిమానే చేయాలని అప్పుడే అనుకున్నా. కొంతకాలం తర్వాత ఈ స్క్రిప్టుపై దృష్టి పెట్టా. దాన్ని నటుడు నితిన్‌, నిర్మాత సుధాకర్‌కి వినిపించా. వారికి నచ్చడంతో వెంటనే ఓకే చేశారు. మాతృకలోని ప్రేమకథ, పతాక సన్నివేశాలకి సంబంధించి కొన్ని మార్పులు చేశాం. ఏది ఏమైనా రీమేక్‌ సినిమా చేయడం కొంచెం కష్టమైన పనే. ఒరిజినల్‌ కంటెంట్‌నే చూపిస్తే కాపీ పేస్ట్‌ అంటారు. నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేస్తే సరిగా తీయలేదు, కథని పాడుచేశారు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. రీమేక్‌ల విషయంలో ప్రధాన సమస్య ఇదే. ఇకపై రీమేక్‌ సినిమాలు తీయాలనుకోవడం లేదు. భవిష్యత్తులో నితిన్‌తో ఓ స్ట్రయిట్‌ ఫిల్మ్‌ చేస్తా. ‘మాస్ట్రో’ విషయానికొస్తే..  ‘అందాధున్‌’ ఫీల్ ఎక్కడా మిస్‌ అవ్వకుండా ఉండేలా జాగ్రత్త తీసుకున్నాం. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని కొన్ని సీన్లు మార్చాం. ఈ చిత్రానికి ఎన్నో టైటిళ్లు అనుకున్నాం. చివరికి ‘మాస్ట్రో’ పేరు ఖరారు చేశాం. మాస్ట్రో అంటే మాస్టర్ ఆఫ్ మ్యూజిక్. 42 రోజుల్లో చిత్రీకరణ పూర్తయింది.

ఆమె నటనని చూసి షాకయ్యా..

ఈ సినిమాలో కథానాయకుడు నితిన్‌ అంధుడిగా కనిపిస్తాడు. నితిన్‌ పాత్రలో ఎంతగా లీనమయ్యాడో తొలి సన్నివేశం తెరకెక్కించేటప్పుడే అర్థమైంది. ముందుగా క్లైమాక్స్‌ని చిత్రీకరించాం. దుబాయ్‌లో ఈ షెడ్యూల్‌ జరిగింది. ఈ సీన్‌లో నితిన్‌ నటన చూడగానే నేను ఈ సినిమా చేయగలననే ధైర్యం వచ్చింది. కీలక పాత్ర కోసం తమన్నాని నేనే ఎంపిక చేశా. టబు (అందాధున్‌) పాత్రకి తమన్నా అయితేనే న్యాయం చేయగలదని అనిపించింది. ఇందులో ఆమె నటనని చూసి నేను షాకయ్యా. అంతగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసిందామె. నభా నటేశ్‌ అందం, అభినయంతో అందరినీ ఆకట్టుంకుంటుంది. హర్ష, మంగ్లీ, రచ్చ రవి, నరేష్ తమ తమ పాత్రల్లో బాగా నటించారు. మహతి స్వర సాగర్ అందించిన సంగీతం అద్భుతంగా నిలిచింది. నాలుగు పాటల్ని చాలా విభిన్నంగా ఇచ్చారు. పాటల చిత్రీకరణలోనూ వైవిధ్యం చూపించాం.

వేగంగా తీస్తా..

ఈ సినిమాని జూన్‌ 11న థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నాం. కానీ, కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ని దృష్టిలో పెట్టుకుని ఓటీటీలో రిలీజ్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. నా విషయంలో.. స్క్రిప్టు సిద్ధంగా ఉన్నా అనివార్య కారణంగా దాన్ని పట్టాలెక్కించడం ఆలస్యమవుతుంటుంది. నా తర్వాతి ప్రాజెక్టుని మరికొన్ని రోజుల్లోనే ప్రకటిస్తా. మా నాన్న రొమాంటిక్‌ నవలలు రాస్తుంటారు. నాకేమో అవి నచ్చవు. ఈ విషయంలో మేమిద్దరం గొడవ పడుతుంటాం (నవ్వుతూ).  కథలు రాయడంలో నాకు ఆలస్యమవుతుందేమో కానీ వాటిని తెరకెక్కించడంలో కాదు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని