Covid Endemic: భారత్‌లో కరోనా.. 6 నెలల్లో ఎండెమిక్‌ దశలోకి..? - telugu news does covid become endemic in india within months
close
Published : 16/09/2021 02:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid Endemic: భారత్‌లో కరోనా.. 6 నెలల్లో ఎండెమిక్‌ దశలోకి..?

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి ఇంకా కొనసాగుతున్నప్పటికీ.. రానున్న రోజుల్లో ఇది స్థానికంగా ఎప్పటికీ ఉండిపోయే (Endemic) దశలోకి మారే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న 6 నెలల్లోనే కొవిడ్‌-19 ఎండెమిక్‌గా మారే అవకాశాలు ఉన్నట్లు ప్రజారోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా కేవలం కొత్త వేరియంట్లు వెలుగు చూసినంత మాత్రాన అవి థర్డ్‌ వేవ్‌కు కారణమవుతాయని కచ్చితంగా చెప్పలేమని చెబుతున్నారు.

‘‘కరోనా వైరస్‌ మహమ్మారి మన అంచనాలకు అందని విధంగా విజృంభించింది. కానీ, రానున్న ఆరు నెలల్లోనే ఇది స్థానికంగా ఉండిపోయే ‘ఎండెమిక్‌’ దశకు చేరుకుంటుంది. ముఖ్యంగా మరణాల సంఖ్య, సంక్రమణ రేటు నియంత్రణలో ఉన్నట్లయితే వ్యాధిని కట్టడి చేసుకోవచ్చు’ అని ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (NCDC) డైరెక్టర్‌ సుజీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇక కొవిడ్‌ ఉద్ధృతి అత్యధికంగా ఉన్న కేరళ కూడా ఇప్పుడిప్పుడే ఆ సంక్షోభం నుంచి బయటపడుతోందన్నారు.

టీకాతోనే రక్షణ..

కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో వ్యాక్సినేషన్‌ అత్యంత కీలకమని ఎన్‌సీడీసీ డైరెక్టర్‌ సుజీత్‌ సింగ్‌ పునరుద్ఘాటించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 75కోట్ల డోసులు పంపిణీ చేశారని గుర్తుచేశారు. ఒకవేళ వ్యాక్సిన్‌ సమర్థత 70 శాతంగా ఉన్నట్లయితే ఇప్పటికే దేశంలో దాదాపు 50 కోట్ల మందికి ఇమ్యూనిటీ వచ్చినట్లేనని అభిప్రాయపడ్డారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

ముఖ్యంగా వ్యాక్సిన్‌ పొందిన వారికి కూడా (Breakthrough) ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం 20 నుంచి 30శాతం ఉన్నందున అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొత్త వేరియంట్ల కారణంగా బ్రేక్‌త్రూ వచ్చే అవకాశం ఉందని.. వీటితో పాటు వ్యాక్సినేషన్‌ వల్ల కలిగే రోగనిరోధక శక్తి 70 నుంచి 100రోజుల తర్వాత క్రమంగా క్షీణిస్తుందని నిపుణులు చెబుతున్న విషయాన్ని సుజీత్‌ సింగ్‌ గుర్తుచేశారు. అయితే, ప్రస్తుతం దేశంలో కొత్త వేరియంట్లు వెలుగు చూడలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా Mu, C.1.2 వేరియంట్‌ల ప్రభావం ఇప్పటివరకు భారత్‌లో లేదని ఎన్‌సీడీసీ చీఫ్‌ స్పష్టం చేశారు. కేవలం కొత్త వేరియంట్‌ వెలుగు చూసినంత మాత్రాన అది థర్డ్‌ వేవ్‌కు కారణం కాదని సుజీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. వేరియంట్ల ప్రవర్తనతో పాటు యాంటీబాడీల పనితీరుపై అది ఆధారపడి ఉంటుందని.. ప్రస్తుతం పండగల సీజన్‌ కావడం కాస్త ఆందోళనకరంగా కనిపిస్తోందని చెప్పారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థదీ ఇదే అంచనా..

భారత్‌లో ఇక ఓ మోస్తరు స్థాయిలో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి కొవిడ్‌-19 మారుతున్నట్లు కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ ఈమధ్యే వెల్లడించారు. భారత్‌లో జనాభా, రోగనిరోధక శక్తిలో వైవిధ్యాలను బట్టి చూస్తే.. కొద్దిపాటి హెచ్చుతగ్గులతో కొవిడ్‌ ప్రస్తుత తరహాలోనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. 2022 ఆఖరు నాటికి.. 70% వ్యాక్సినేషన్‌ పూర్తయి, కొవిడ్‌కు ముందునాటి పరిస్థితులు తిరిగి వస్తాయన్న ఆశాభావాన్ని సౌమ్య స్వామినాథన్‌ వ్యక్తం చేశారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని