PV Sindhu: ఈ గెలుపు ఆనందమే.. కానీ అప్పుడే అయిపోలేదు! - telugu news happy but its not over say pv sindhu after quarter win
close
Updated : 30/07/2021 17:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PV Sindhu: ఈ గెలుపు ఆనందమే.. కానీ అప్పుడే అయిపోలేదు!

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌లో గెలవడం ఆనందంగా ఉందని, అయితే ఇప్పుడే అంతా అయిపోయినట్లు కాదని భారత అగ్రశ్రేణి షట్లర్‌ పి.వి. సింధు తెలిపింది. తదుపరి మ్యాచ్‌కు మరింత కఠినంగా సన్నద్ధమవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది. శుక్రవారం జరిగిన బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ క్వార్టర్ ఫైనల్‌లో జపాన్‌ క్రీడాకారిణి యమగూచిపై సింధు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. 

ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో యమగూచిపై సింధు 21-12, 22-20తో వరుస గేమ్‌లు గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ సందర్భంగా మ్యాచ్‌పై సింధు స్పందిస్తూ.. ‘‘సంతోషంగా ఉంది. కానీ, అప్పుడే అయిపోలేదు. ఇప్పుడు నేను వెనక్కి వెళ్లి మ్యాచ్‌ను సమీక్షించుకోవాలి. ఆ తర్వాత కొంత రిలాక్స్‌ అయ్యి తదుపరి మ్యాచ్‌కు సిద్ధమవ్వాలి. ఈ మ్యాచ్‌లో రెండో గేమ్‌లో షాట్‌ ర్యాలీలు సుదీర్ఘంగా జరిగాయి. ముందంజలో ఉన్నప్పటికీ యమగూచి కూడా బలంగా పుంజుకుంది. అందువల్ల నేను రిలాక్స్‌ అవలేకపోయా. నావైపు కూడా కొన్ని తప్పిదాలు జరిగాయి. యమగూచి గేమ్‌ పాయింట్‌కు వచ్చినా.. నేను ఆందోళన చెందలేదు. ‘ఏం కాదు.. మ్యాచ్‌పై దృష్టిపెట్టు. తప్పకుండా గెలుస్తావు’ అని కోచ్‌ చెప్పారు. ఆయన నాకు ఎంతగానో అండగా నిలిచారు. అందువల్లే నేను మ్యాచ్‌ గెలవగలిగాను’’ అని చెప్పుకొచ్చింది. గెలుపు కోసం తాను చాలా కఠినంగా శ్రమించానని తెలిపింది. తదుపరి మ్యాచ్‌ చాలా ముఖ్యమని, దానిపై మరింత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని వివరించింది. 

సెమీస్‌లో తై జు యింగ్‌తో..

సెమీఫైనల్‌లో సింధు.. ప్రపంచ నంబర్‌ వన్‌, చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్‌తో పోటీ పడనుంది. సింధుకు ఇది చాలా కఠినమైన మ్యాచ్‌ అనే చెప్పాలి. గతంలో వీరిద్దరూ 18 సార్లు తలపడగా.. 13 సార్లు తై జు విజయం సాధించింది. కేవలం 5 మ్యాచ్‌ విజయాలతో సింధు వెనుకంజలో ఉంది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం జరగబోయే సెమీస్‌ పోరు కూడా రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి. కాగా.. ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో రెండుసార్లు సెమీస్‌కు వెళ్లిన తొలి షట్లర్‌ సింధునే కావడం విశేషం. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని