Tokyo Olympics: సెమీస్‌కు భారత మహిళల హాకీ జట్టు.. అద్భుత గోల్‌ ఇదే! - telugu news indian women hockey team enter into tokyo games semis
close
Updated : 02/08/2021 19:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: సెమీస్‌కు భారత మహిళల హాకీ జట్టు.. అద్భుత గోల్‌ ఇదే!

టోక్యో: మళ్లీ స్వర్ణయుగం రాబోతోందా? ఒకప్పుడు భారత హాకీ జట్టు మైదానంలో అడుగు పెడుతోందంటే హడల్‌! ప్రపంచ దేశాలు వణికిపోయేవి. టీమ్‌ఇండియా దిగ్గజాలను ఎదుర్కొనేందుకు భయపడేవి. ఒలింపిక్స్‌లో వరుసగా పతకాలు కొల్లగొట్టిన ఘన చరిత్ర మనది.

ఏమైందో ఏమో! దిగ్గజాల నిష్క్రమణతో భారత హాకీ ప్రాభవం కోల్పోయింది. ఓటముల పరంపర వెక్కిరించింది. మధ్యలో కొందరు గొప్ప ఆటగాళ్లు అవతరించినా బృందంగా మాత్రం విఫలమయ్యేవాళ్లు. అలాంటిది మళ్లీ ఇన్నేళ్లకు భారత హాకీకి స్వర్ణయుగం రాబోతున్నట్టు అనిపిస్తోంది. 49 ఏళ్ల తర్వాత పురుషుల జట్టు ఒలింపిక్స్‌ సెమీస్‌లో అడుగుపెడితే.. అమ్మాయిల బృందం చరిత్రలోనే తొలిసారి సెమీస్‌ చేరుకుంది.

కంగారూలు.. స్టన్‌

ఆస్ట్రేలియా.. అంతర్జాతీయ హాకీలో తిరుగులేని జట్టు. మూడు సార్లు ఒలింపిక్స్‌ విజేత. ప్రపంచ రెండో ర్యాంకు దాని సొంతం. అలాంటి జట్టును క్వార్టర్‌ ఫైనల్లో 1-0 తేడాతో ఓడించింది రాణి రాంపాల్‌ సేన. ఈ విజయం అపూర్వం.. అద్వితీయం అనడంలో సందేహమే లేదు. లీగ్‌ దశలో వరుసగా మ్యాచులు ఓడిన అమ్మాయిలు ఆపై వరుసగా విజయాల జైత్రయాత్ర చేయడం నభూతో న భవిష్యతి!

ఒకే పెనాల్టీ కార్నర్‌

క్వార్టర్‌ ఫైనల్లో రెండు జట్లూ నువ్వానేనా అన్నట్టు ఆడాయి. గట్టి పట్టుదల ప్రదర్శించాయి. ముఖ్యంగా భారత జట్టు తెగువను ఎంత అభినందించినా తక్కువే! దుర్భేద్యమైన డిఫెన్స్‌కు మారుపేరైన ఆసీస్‌పై రాణీ జట్టుకు లభించింది ఒకే ఒక్క పెనాల్టీ కార్నర్‌. 22వ నిమిషంలో దొరికిన బంగారు అవకాశాన్ని గుర్జీత్‌ కౌర్‌ ఒడిసిపట్టింది. బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించి రెండో క్వార్టర్‌ ముగిసే సరికి 1-0తో భారత్‌కు ఆధిక్యం అందించింది.

సవిత సాహో!

ఆ తర్వాత వందనా కటారియా, నవనీత్‌ కౌర్‌, రాణి రాంపాల్‌, టెటె సలీమా గోల్స్‌ చేసేందుకు విపరీతంగా శ్రమించారు. ఆసీస్‌ గోల్‌ కీపర్‌ రేచల్‌ అన్‌ సహచరులతో కలిసి విజయవంతంగా వారిని అడ్డుకుంది. ఇక భారత గోల్‌కీపర్‌ సవిత గురించి ఎంత చెప్పినా తక్కువే! ఆసీస్‌ చేసిన 9 దాడులను సహచరులతో కలిసి ఆమె నిలువరించింది. ఏడు పెనాల్టీ కార్నర్లు, రెండు ఫీల్డ్‌ గోల్స్‌ను అడ్డుకున్న ఆమె టీమ్‌ఇండియా విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. బుధవారం జరిగే సెమీస్‌లో అర్జెంటీనాతో భారత్‌ తలపడనుంది. అందులో గెలిస్తే.. ఇక హాకీ చరిత్ర మలుపు తిరగడం ఖాయం!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని