INDvsENG: జోరూట్‌ భారీ శతకం.. 391 పరుగులకు ఇంగ్లాండ్‌ ఆలౌట్‌ - telugu news indvseng joe root huge century makes england lead in first innings
close
Updated : 14/08/2021 23:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

INDvsENG: జోరూట్‌ భారీ శతకం.. 391 పరుగులకు ఇంగ్లాండ్‌ ఆలౌట్‌

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ స్వల్ప ఆధిక్యం..

లండన్‌: టీమ్‌ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 391 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్‌పై 27 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. కెప్టెన్‌ జోరూట్‌(180 నాటౌట్‌; 321 బంతుల్లో 18x4) భారీ శతకానికి తోడు బెయిర్‌స్టో(57; 107 బంతుల్లో 7x4) అర్ధశతకంతో రాణించాడు. వీరిద్దరూ తొలి సెషన్‌లో భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించి ఇంగ్లాండ్‌ ఆధిక్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించారు. 119/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆట కొనసాగించిన రూట్‌, బెయిర్‌స్టో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను ముగించారు. దాంతో ఇంగ్లాండ్‌ 216/3 స్కోర్‌తో భోజన విరామానికి వెళ్లింది.

ఇక రెండో సెషన్‌లో బెయిర్‌స్టో అర్ధశతకం పూర్తయ్యాక ఊహించని బంతికి ఔటయ్యాడు. సిరాజ్‌ వేసిన 79వ ఓవర్‌లో ఓ బంతి అతడి బ్యాట్‌కు తగిలి గాల్లోకి లేచింది. వెంటనే స్పందించిన కోహ్లీ క్యాచ్‌ అందుకున్నాడు. దాంతో ఆ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. కానీ, రూట్‌తో కలిసి అతడు శతక భాగస్వామ్యం జోడించాడు. అనంతరం బట్లర్‌(23; 42 బంతుల్లో 4x4), మోయిన్‌ అలీ(27; 72 బంతుల్లో 4x4) కాసేపు క్రీజులో నిలిచినప్పటికీ ఎక్కువ పరుగుల చేయకుండా భారత బౌలర్లు వారిని అడ్డుకున్నారు.  ఈ క్రమంలోనే ఇషాంత్‌ వారిద్దరినీ ఔట్‌ చేయడంతో పాటు సామ్‌కరన్‌ను కూడా డకౌట్‌ చేశాడు. అలా ఇంగ్లాండ్‌ ఏడు వికెట్లు కోల్పోయి టీమ్‌ఇండియా స్కోరుకు చేరువైంది. అప్పటికీ ఆ జట్టు స్కోర్‌ 341/7గా నమోదైంది. కాసేపటికే రాబిన్‌సన్‌(6).. సిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం టెయిలెండర్లతో కలిసి రూట్‌ ఇంగ్లాండ్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. మార్క్‌వుడ్‌(5) రనౌట్‌ కాగా, మూడో రోజు ఆఖరి బంతికి అండర్సన్‌(0) షమి బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దాంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక భారత బౌలర్లలో సిరాజ్‌ నాలుగు, ఇషాంత్‌ మూడు, షమి రెండు వికెట్లు తీశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని