Imran Khan on Taliban: తాలిబన్లతో కలిసి పనిచేయాల్సిందే..! - telugu news international community must engage with taliban
close
Updated : 16/09/2021 18:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Imran Khan on Taliban: తాలిబన్లతో కలిసి పనిచేయాల్సిందే..!

అంతర్జాతీయ సమాజానికి పాక్‌ ప్రధాని పిలుపు

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్లతో కలిసి పనిచేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్ పిలుపునిచ్చారు. అక్కడి మహిళల హక్కులతో పాటు సమ్మిళత ప్రభుత్వం ఏర్పాటు విషయంలో వారిని ప్రోత్సహించాలని సూచించారు. తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న అఫ్గానిస్థాన్‌లో శాంతి, స్థిరత్వం రావాలంటే తాలిబన్లతో అంతర్జాతీయ సమాజం కలిసి పనిచేయడం ఒక్కటే మార్గమని ఇమ్రాన్‌ ఖాన్‌ అభిప్రాయపడ్డారు.

‘అఫ్గానిస్థాన్‌ మొత్తం ప్రస్తుతం తాలిబన్ల నియంత్రణలో ఉంది. ప్రస్తుతం వారు అన్ని వర్గాలను కలుపుకొని పనిచేయగలిగితే అఫ్గాన్‌లో 40ఏళ్ల తర్వాతి శాంతిని చూడవచ్చు. కానీ, ఆ అంచనాలు అమలు కాకపోతే.. ఆందోళన చెందాల్సిన విషయమే. ముఖ్యంగా అక్కడ హింస, మానవ సంక్షోభం, భారీ సంఖ్యలో శరణార్థుల వంటి సమస్యలతో అఫ్గాన్‌లో మరోసారి అస్థిరత ఏర్పడవచ్చు. అంతేకాదు, అఫ్గాన్‌ నేల నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు మళ్లీ కోరలు చాచే ప్రమాదం ఉంది’ అని ఓ అంతర్జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సంక్షోభ నివారణ చర్యలు చేపట్టాలంటే అంతర్జాతీయ సమాజం మద్దతు తాలిబన్లకు కావాలని అన్నారు.

అఫ్గాన్‌ మహిళలు ధైర్యవంతులు..

అఫ్గాన్‌ మహిళల హక్కులపై వస్తోన్న ఆరోపణలపై ఇమ్రాన్‌ను ప్రశ్నించగా.. బయటనుంచి ఒత్తిడి తెచ్చి వారి హక్కులను కాపాడే ప్రయత్నం చేయాలనుకోవడం పొరపాటే అవుతుందని అన్నారు. అఫ్గాన్‌ మహిళలు ధైర్యవంతులని.. కాస్త సమయమిస్తే, వారి హక్కులను వారే పొందే ప్రయత్నం చేస్తారని ఇమ్రాన్‌ ఖాన్‌ హితవు పలికారు. ఇక ఉగ్రవాదంపై అమెరికా చేసిన పోరాటంలో భాగస్వామ్యం కావడం వల్ల పాకిస్థాన్‌ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంలో పాకిస్థాన్‌ను అమెరికా ఓ పావుగా వాడుకుందని ఆరోపించారు. 9/11 దాడుల తర్వాత అఫ్గాన్‌లో పాక్‌ అత్యంత కుట్రపూరితంగా వ్యవహరించిందని.. దాని పాత్రపై దర్యాప్తు జరిపించాలని అమెరికా చట్టసభ్యులు డిమాండ్‌ చేసిన నేపథ్యంలో అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ రెండు రోజుల క్రితం ఓ ప్రకటన చేసిన సందర్భంగా ఇమ్రాన్‌ ఈవిధంగా స్పందించారు. అఫ్గానిస్థాన్‌లో గత 20 ఏళ్లలో పాకిస్థాన్‌ పోషించిన పాత్రను త్వరలో పరిశీలిస్తామని.. అఫ్గాన్‌లో పాక్‌ భవిష్యత్‌ పాత్రపైనా కన్నేసి ఉంచుతామని  ఆంటోని బ్లింకెన్‌ చెప్పిన విషయం తెలిసిందే.

ఇదిలాఉంటే, తాలిబన్ల నేతృత్వంలో ఏర్పాటైన అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వంలో ఎక్కువగా ఐరాస భద్రతా మండలి ప్రకటించిన టెర్రరిస్ట్‌ బ్లాక్‌లిస్టులో ఉన్న వ్యక్తులే మంత్రులుగా ఉన్నారు. తాజాగా కొలువైన అఫ్గాన్‌ కేబినెట్‌లో దాదాపు 14మంది నిషేధిత జాబితాలో ఉన్నవారే. ముఖ్యంగా ప్రధానమంత్రి ముల్లా హసన్‌తో పాటు ఇద్దరు ఉప ప్రధానులు కూడా ఆ జాబితాలో ఉన్న విషయం తెలిసిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని