IPL 2021: అనుకున్నది ఒకటి.. జరిగింది మరొకటి: సంజూ శాంసన్ - telugu news ipl 2021 sanju samson says rajasthan royals need to lift their standards
close
Updated : 28/09/2021 14:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL 2021: అనుకున్నది ఒకటి.. జరిగింది మరొకటి: సంజూ శాంసన్

ఇంటర్నెట్‌డెస్క్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి అని రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ తెలిపాడు. సోమవారం రాత్రి తలపడిన మ్యాచ్‌లో హైదరబాద్‌ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. రాజస్థాన్‌ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 18.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (60), కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (51) అర్ధశతకాలతో రాణించి జట్టుకు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందించారు. మరోవైపు రాజస్థాన్‌ ఈ మ్యాచ్‌లో ఓటమిపాలై ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే సంజూ మాట్లాడుతూ తాము మంచి స్కోరే  సాధించామని చెప్పాడు.

‘మేం సాధించింది మంచి స్కోరే అనుకుంటున్నా. ఈ పిచ్‌ కాస్త నెమ్మదిగా ఉంది. మరోవైపు హైదరాబాద్‌ బౌలర్లు బాగా రాణించారు. మేం ఇంకాస్త ప్రయత్నించి ఉంటే మరో 20 పరుగులు అదనంగా వచ్చేవి. ఇలాంటి పిచ్‌పై శుభారంభం దక్కితే దాన్ని అలాగే కొనసాగించాలి. ఈ క్రమంలోనే నేను పవర్‌ప్లే తర్వాత చెలరేగిపోవాలనుకున్నా.. కానీ మరో ఎండ్‌లో వికెట్లు కోల్పోయాం. దీంతో నేను క్రీజులో నిలబడి భాగస్వామ్యాలు జోడించాలనుకున్నా. ఎలాగైనా గెలవాలని మంచి స్కోర్‌ హైదరాబాద్‌ ముందు ఉంచాలనుకున్నాం. చివరికి మేం అనుకున్న స్కోర్‌ బోర్డుపై ఉంచగలిగాం. కానీ, ఈ ప్రదర్శన సరిపోలేదు. మా బ్యాటింగ్‌, బౌలింగ్‌పై దృష్టిపెట్టాలి. ప్రతి బంతిపైనా శ్రద్ధచూపాలి’ అని సంజూ వివరించాడు.

మళ్లీ గెలవడం చాలా బాగుంది: విలియమ్సన్‌

సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ ఈ టోర్నీలో రెండో విజయం సాధించడం సంతోషంగా ఉందన్నాడు. ‘ఇప్పుడు చాలా బాగుంది. ఈ మ్యాచ్‌లో మా జట్టులోని ప్రతి ఒక్కరు ఎలా ఆడాలనే దానిపై ముందే స్పష్టతతో ఉన్నాం. ఈ మ్యాచ్‌లో కొన్ని సందర్భాలు కీలకంగా మారాయి. తొలుత బంతితో రాజస్థాన్‌ను కట్టడి చేశాం. తర్వాత బ్యాటింగ్‌లో శుభారంభం దక్కింది. ఇక జేసన్‌ రాయ్‌ ఎంత బాగా ఆడాడో చెప్పాల్సిన పనిలేదు. తాను చేయాల్సిన పని చేశాడు. ఏ జట్టుమీదైనా ఇలాగే ఆడతాడు. ఈ టోర్నీలో ఇంకొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. మా జట్టులోని లోపాలను సరిదిద్దుకొని ఇకపై బాగా ఆడాలి. ఇప్పుడున్న స్థితి నుంచి ముందుకు సాగాలి’ అని విలియమ్సన్‌ అన్నాడు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని