IPL 2021: మా ఆటగాళ్లముందు కొన్నిసార్లు ఏదీ సరితూగదు: మోర్గాన్‌ - telugu news ipl 2021 shubhman gills says kkr were determined to make a comeback and did well
close
Published : 22/09/2021 02:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL 2021: మా ఆటగాళ్లముందు కొన్నిసార్లు ఏదీ సరితూగదు: మోర్గాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లోని తొలి దశలో ఐదు ఓటములతో వెనుకంజలో పడిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సోమవారం బెంగళూరుపై రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించి కోహ్లీసేనను చిత్తుగా ఓడించింది. దీంతో ఆ జట్టులో కొత్త ఆశలు చిగురించాయి. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ మోర్గాన్‌ మాట్లాడుతూ తమ జట్టులోని ఆటగాళ్ల ముందు కొన్నిసార్లు ఏదీ సరితూగదని ప్రశంసించాడు. ‘మా జట్టులో ఉన్న ఆటగాళ్ల నైపుణ్యాలతో పోలిస్తే కొన్నిసార్లు ఏదీ సరితూగదు. మా టైమింగ్‌ కూడా బాగా కుదిరింది. ఏ ఆటగాడైనా బరిలోకి దిగి తమ సత్తా చూపించాలి. ఈరోజు మా బౌలర్లు బాగా రాణించారు. మాక్స్‌వెల్‌, ఏబీ, విరాట్‌.. లాంటి మేటి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి వారిపై ఆధిపత్యం చలాయించారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ టోర్నీలో మేమింకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. మేం ముందుకు సాగాలంటే చాలా విషయాలు కలిసిరావాలి. కానీ, రెండో దశలో ఈరోజు మంచి ఆరంభం దక్కింది. ఈ ప్రదర్శనతో మేం ప్రమాదకర జట్టుగా ఎదిగే అవకాశం ఉంది’ అని మోర్గాన్‌ పేర్కొన్నాడు.

ఇక ఈ మ్యాచ్‌లో 48 పరుగులతో అదరగొట్టిన శుభ్‌మన్‌గిల్‌ మాట్లాడుతూ.. తాము తిరిగి పోటీలోకి రావాలనుకున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే అన్ని విభాగాల్లో సత్తాచాటి బెంగళూరును ఓడించామన్నాడు. ఇలాగే విజయాలు సాధిస్తూ ప్లేఆఫ్స్‌కు చేరతామనే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసి ఓపెనర్‌గా అదరగొట్టిన వెంకటేశ్‌ అయ్యర్‌(41*) బ్యాటింగ్‌ను మెచ్చుకున్నాడు. మరోవైపు బౌలింగ్‌లో అత్యద్భుత ప్రదర్శన చేసిన వరుణ్‌ చక్రవర్తిని కూడా గిల్‌ ప్రశంసించాడు.

హ్యాట్రిక్‌ సాధించాననుకున్నా.. కానీ

ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌ చేయగా త్రుటిలో హ్యాట్రిక్‌ వికెట్ల ఘనత చేజార్చుకున్నాడు. నాలుగో బంతికి మ్యాక్స్‌వెల్‌ (10)ను బౌల్డ్‌ చేసిన అతడు తర్వాతి బంతికే హసరంగ(0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక మరుసటి బంతికే జేమీసన్‌ను కూడా ఎల్బీగా ఔట్‌ చేసినట్లే కనిపించినా ఆ బంతి బ్యాట్‌ అంచు తాకడంతో బతికిపోయాడు. దీంతో వరుణ్‌ మంచి అవకాశాన్ని కోల్పోయాడు. దీనిపై అతడు మాట్లాడుతూ.. ‘పిచ్‌ నుంచి మరీ అంత టర్నింగ్‌ లేదు. దాంతో వికెట్లకేసి బౌలింగ్‌ చేశా. 12వ ఓవర్లో ఆరో బంతికి జేమీసన్‌ను కూడా ఔట్‌ చేశానని మొదట భావించాను. దాంతో హ్యట్రిక్‌ దక్కుతుందని ఆశపడ్డా. కానీ.. రీప్లేలో అది నాటౌట్‌గా తేలడంతో హ్యాట్రిక్‌ మిస్సయింది’ అని వివరించాడు. మరోవైపు తాను చాలా ఆలస్యంగా కెరీర్‌ ప్రారంభించానని, ఇప్పుడిప్పుడే టీమ్‌ఇండియాలో అవకాశాలు వస్తున్నాయని వరుణ్‌ పేర్కొన్నాడు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని