Justice N V Ramana: నోరి దత్తాత్రేయుడి జీవితం మూర్తీభవించిన మానవత్వానికి నిదర్శనం - telugu news justice n v ramana about dr nori dattatreyudu book
close
Published : 25/09/2021 20:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Justice N V Ramana: నోరి దత్తాత్రేయుడి జీవితం మూర్తీభవించిన మానవత్వానికి నిదర్శనం

హైదరాబాద్‌: డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడి స్వీయ ఆత్మకథ ‘ఒదిగిన కాలం’ పుస్తకావిష్కరణకు స్వయంగా తాను హాజరుకాలేకపోతున్నందుకు చింతిస్తున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ మేరకు ఆయన ఓ సందేశాన్ని విడుదల చేశారు.

‘‘డా.నోరి దత్తాత్రేయుడు జీవితం మూర్తీభవించిన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఏడు పదుల జీవితాన్ని, ఎన్నెన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగిన కాలాన్ని తనదైన శైలిలో ‘ఒదిగిన కాలం’ పేరుతో మనకందించి ఆయన సమాజానికి, ప్రత్యేకించి తెలుగు సమాజానికి మరెంతో సేవ చేశారు. ఈ 230 పేజీల పుస్తకం ఇటీవలి కాలంలో నేను ఆమూలాగ్రం ఆపకుండా చదివిన పుస్తకాల్లో ఒకటి. ‘మానవ సేవే మాధవ సేవ’ అనే నానుడిని సులువుగా బోధపరిచే ఈ పుస్తకం సందేశాత్మకమే కాక గొప్ప విజ్ఞాన ప్రదాయిని కూడా. బాల్యంలో ఆయనకు ఎదురైన ఇక్కట్లు, మాతృమూర్తి చేసిన త్యాగాలు, కుటుంబ వాత్సల్యం, బంధు మిత్రుల తోడ్పాటు గురించి చదువుతుంటే నా కళ్లు చెమర్చాయి. ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పృశించే యథార్థ జీవన గాథ ఇది’’

‘‘వైద్య విజ్ఞానం, క్యాన్సర్‌ గురించి ఈ పుస్తకంలో డాక్టరు గారు వర్ణించిన తీరు ఎంతో సరళంగా ఉంది. క్యాన్సర్‌ బాధితుల కథలు కూడా జోడించడంతో ఈ పుస్తకం మరింతగా ఆకట్టుకుంది. డాక్టర్‌ గారి జీవితంలో అనేక ఘటనలు కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా.. వెనుదిరిగి చూస్తే.. ప్రజల కోసం అసాధారణ సేవలందించేందుకు దైవేచ్ఛ మేరకే ఆ ఘటనలు జరిగాయని నమ్మక తప్పదు. ఈ పుస్తకంలో మన దేశంలాంటి వర్ధమాన దేశాలకు సందేశమూ ఉంది. అమెరికాలాంటి దేశాలు వైద్య రంగంలో నిరంతర అభివృద్ధి కోసం సాగిస్తున్న పరిశోధనల గురించి ఆయన విడమరిచి చెప్పారు. ఆ స్థాయిలో మన దేశంలోనూ పరిశోధనలు పుంజుకోవాలి. ఆయన అమెరికా వెళ్లి చేయగలిగిన పరిశోధన, మనదేశంలోనే చేయగలిగేందుకు అనువైన వాతావరణం, సదుపాయాలు కల్పించాలి’’

‘‘డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు తెలుగువాడిగా జన్మించడం మన తెలుగు నేల చేసుకున్న పుణ్యఫలం. ఆయన ఇలాగే ప్రజాసేవలో మరెందరికో ప్రాణభిక్ష పెడుతూ కలకాలం వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ పుస్తకం అందించినందుకు డా.నోరి గారికీ, సహకరించిన అరుణ పప్పు గారికీ, ప్రచురణ కర్తలు ‘సాహితీ మిత్రులు’ సంస్థకు అభినందనలు’’ అని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తన సందేశంలో పేర్కొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని