Cinema news: టైటిల్‌కి ‘రంగే’శారు..! - telugu news movies with the names of colour pink orange red black
close
Published : 31/08/2021 13:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema news: టైటిల్‌కి ‘రంగే’శారు..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కాదేదీ కవితకనర్హం’ అని శ్రీశ్రీ చెప్పినట్టు ‘కాదేదీ టైటిల్‌కి అనర్హం’ అని అంటుంటారు దర్శక-నిర్మాతలు. అలా మనుషుల పేర్ల నుంచి ఊరి పేర్ల వరకు, ముద్దు పేర్ల నుంచి ప్రముఖుల పేర్ల వరకు, నంబర్ల నుంచి రంగుల వరకు అన్నింటినీ సినిమా టైటిల్‌గా పెడుతున్నారు. ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. అయితే చాలా తక్కువ సినిమాలకు రంగుల పేర్లు పెట్టారు. మరి ఆ సినిమాలేంటి? ఆ రంగులేంటి? చూద్దామా..!

విభిన్న ప్రేమకథ.. ‘ఆరెంజ్‌’

ఇప్పటి వరకూ వెండితెరపైకి వచ్చిన ప్రేమ కథల్లో ‘ఆరెంజ్‌’ ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రేమ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదని చెప్పే రామ్‌ అనే ప్రేమికుడి కథ ఇది. రామ్‌చరణ్, జెనీలియా జంటగా బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కించారు. ప్రకాశ్‌ రాజ్‌, బ్రహ్మానందం, ప్రభు కీలక పాత్రలు పోషించారు. మ్యూజికల్‌ హిట్‌గా నిలిచిందీ  చిత్రం. ఇందులోని ప్రతి పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అంతగా తన సంగీతంతో మాయ చేశారు హ్యారీస్‌ జయరాజ్‌. ‘ఆరెంజ్‌’ పండుని చూసినా, ఆ పేరుని విన్నా ఈ ప్రేమకథే గుర్తుకొస్తుంది.

న్యాయం కోసం.. ‘పింక్’

తాము చేయని నేరంలో చిక్కుకున్న ముగ్గురు అమ్మాయిలకి న్యాయం చేసే ఓ లాయర్‌ కథే ‘పింక్’. అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ, కృతి కుల్హరి, ఆండ్రియా తదిరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుద్ధరాయ్‌ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌లో విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘వకీల్‌సాబ్‌’గా రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. తమిళంలో ‘నేర్కొండ పార్వైయ్‌’గా రీమేక్‌ అయింది. కోలీవుడ్‌, టాలీవుడ్‌లోనూ ఈ కథ విశేషంగా మెప్పించింది. చాలామందిని ఆలోచింపజేసింది.

యాక్షన్‌ థ్రిల్లర్‌.. ‘రెడ్‌’

రామ్‌ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘రెడ్‌’. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో దర్శకుడు కిశోర్‌ తిరుమల తెరకెక్కించారు. నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ నాయికలు. ఓ వ్యక్తి చేసిన నేరానికి అదే పోలికలతో ఉన్న మరో వ్యక్తి ఎదుర్కొనే సమస్యని ఈ సినిమాలో చూపించారు. తమిళ చిత్రం ‘తడమ్‌’ రీమేక్‌గా రూపొందించారు. ఈ కథ తమిళ, తెలుగు ప్రేక్షకుల్నీ విశేషంగా ఆకట్టుకుంది. ‘రెడ్‌’ అంటే రామ్‌.. రామ్‌ అంటే ‘రెడ్‌’ అనేంతగా ప్రాచుర్యం పొందింది.

క్రైమ్‌, సస్పెన్స్‌.. ‘బ్లాక్‌’

ఆది కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్లాక్‌’. జి.బి. కృష్ణ దర్శకుడు. దర్శనా బానిక్‌ కథానాయిక. క్రైమ్‌, సస్పెన్స్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో ఆది పోలీసు అధికారిగా కనిపించనున్నాడు.  ఈ చిత్రాన్ని మహంకాళి మూవీస్‌ పతాకంపై మహంకాళి దివాకర్‌ నిర్మిస్తున్నారు. ఆమని, సూర్య, కౌశల్‌, పృథ్వీరాజ్‌, సత్యం రాజేశ్‌, తాగుబోతు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని