Nallamala: మల్లెపూలన్ని కుల్లుకునేలా ఏమున్నవే పిల్ల ఏమున్నవే - telugu news nallamala song
close
Published : 31/07/2021 13:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nallamala: మల్లెపూలన్ని కుల్లుకునేలా ఏమున్నవే పిల్ల ఏమున్నవే

చిత్రం: నల్లమల; దర్శకత్వం: రవి చరణ్‌; సంగీతం-సాహిత్యం: పి.ఆర్‌.(పెద్దపల్లి రోహిత్‌); పాట: ఏమున్నావే పిల్ల; గానం: సిద్‌ శ్రీరామ్‌;

పల్లవి:

లేత లేగ దూడ పిల్ల తాగే

పొదుగులోని పాల రంగు నువ్వే

పచ్చ పైరు వోణి ఒంటికేసుకొని ...ఏమున్నవే

నింగి సాటుకున్న సినుకు నువ్వే

సూటిగా దూకేసి తాకినావే

ఎలిసిపోని వాన జల్లులాగా ఏమున్నవే

మల్లెపూలన్ని కుల్లుకునేలా

ఏమున్నవే పిల్ల ఏమ్మునవే

తేనె తీగలన్నీ సుట్టుముట్టేలా

ఏమున్నవే పిల్ల ఏమున్నవే

సూరీడు సూడు పొద్దు దాటిన

నిన్ను సూసి పోలేడే

సీకటి దాటిన సందురుడు

దాగేలాగా ఏమున్నవే

ఏమున్నవే పిల్ల ఏమున్నవే

అందంతో బంధించావే

ఏమున్నవే పిల్ల ఏమున్నవే

సూపుల్తో సంపేసావే

ఏమున్నవే పిల్ల ఏమున్నవే

మాటల్లో ముంచేసావే

ఏమున్నవే పిల్ల ఏమున్నవే

నవ్వుల్తో ఊపిరి ఆపేసావే

చరణం 1:

తొలిసినుకు సేరి

ఈ నేల గాలి

గుప్పించే మట్టి సువాసన నీదే

పొత్తిల్లో దాగి

ముద్దుల్లో తేలే

పసిపిల్ల బుగ్గల్లో నునుపే నీది

నువ్వు నడిసే నడకల్లో

నది పొంగుల హంగుంది

లేత నడుము మడతల్లో

ఈ మాయల మనసుంది

వాలే రెండు కన్నుల్లో

బోలెడంత సిగ్గు దాగుంది

వాలు జడ గుత్తుల్లో

ఈ భూగోళం మొత్తముంది  ।।ఏమున్నవే పిల్ల।।

చరణం 2:

ఎగిరేటి సిలుకా

గోరింక వంకా

ఓరా కన్నేసి సూసింది సూడు

తరిగేటి సొగసా

కాదేమో బహుశా

అయినా నవ్వేసి వచ్చింది నేడు

కారు మబ్బు సీకట్లో

నీ వెన్నెల నవ్వుంది

ఆరు బయట వాకిట్లో

ఆ సుక్కల ముగ్గుంది

జంట అయ్యే దారుల్లో

నీ సిగ్గుల అడ్డుంది

వెంట వచ్చే అడుగుల్లో

జన్మ జన్మల తోడుంది  ।।ఏమున్నవే పిల్ల।।

ప్రియుడు ప్రియురాలిని వర్ణిస్తూ సాగే రకరకాల పాటలను ఎన్నో విన్నాం. ఏ పాటకు ఆ పాట ప్రేక్షకులను ప్రేమలోకంలో విహరింపజేసేది. ఈ క్రమంలో చాలా మంది గేయ రచయితలు కథానాయికలను ప్రకృతితో పోలుస్తూ పాటను అందంగా ముస్తాబు చేసేవారు. అదే ఒరవడిని యువ రచయిత, సంగీత   దర్శకుడు పెద్దపల్లి రోహిత్‌   అలియాస్‌ పి.ఆర్‌. ఒడిసిపట్టుకున్నారు. నల్లమల చిత్రం కోసం తానే స్వయంగా సాహిత్యాన్ని, సంగీతాన్ని సమకూర్చి ‘‘ఏమున్నావే పిల్ల ఏమున్నావే’’ అంటూ పాటకట్టాడు. జానపద బాణీగా సాగే ఆ పాట సిద్‌ శ్రీరామ్‌ గొంతునుంచి జాలువారడంతో.... ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఈ సందర్భంగా ఆ పాట ప్రత్యేకతలను పి.ఆర్‌. ‘ఈనాడు సినిమా’తో పంచుకున్నారు.

ఆన్‌లైన్‌లో పాడి...

నేను ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలలో పుట్టి పెరిగాను. హైదరాబాద్‌లో చదువుకున్నా. చిన్నప్పటి నుంచే పాటలు రాయడం నాకు అలవాటుగా మారింది. బీటెక్‌ చదువుతున్నప్పుడే సినిమా రంగంలోకి అడుగుపెట్టి కొన్ని లఘు చిత్రాలు, చిన్న చిన్న సినిమాలకు పాటలు రాశాను. కానీ నా పాటలకు సంగీత పరంగా న్యాయం జరగడం లేదని భావించా. సంగీతం నేర్చుకున్నాను. ఆ తర్వాత కొన్ని లఘుచిత్రాలు, వెబ్‌ సిరీస్‌లకు పాటలు రాసి, సంగీతాన్ని అందించాను. ఈ క్రమంలో వచ్చిన అవకాశమే ‘నల్లమల’ చిత్రం. రవి చరణ్‌ దర్శకత్వంలో చక్కటి కథతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రంలో పాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందులో ఇటీవల విడుదలైన ‘ఏమున్నావే పిల్ల’ పాట మిలియన్ల కొద్ది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆ పాట జానపద బాణీలో ఉండాలన్నది మా దర్శకుడి ఆలోచన.    పాట కంపోజ్‌ చేశాక సిద్‌ శ్రీరామ్‌ను  సంప్రదించాం. తాను ఈ తరహాలో ఎప్పుడు పాడలేదు. పాడతానని మాటిచ్చారు. కానీ అప్పుడు సిద్‌ అమెరికాలో ఉన్నాడు. లాక్‌డౌన్‌ సమయం కావడంతో పాడటం ఎలా అనేదే ప్రశ్న. మా కోసం సిద్‌ శ్రీరామ్‌ అమెరికా నుంచి ఆన్‌లైన్‌లో పాడి వినిపించారు. దీనికి ముందు పదాలు పలికే విధానం, వాటి అర్థాలు తెలుసుకున్నారు. ప్రతి పదానికి భావం అడిగి తెలుసుకొని పాడి పంపించారు. కంపోజింగ్, లిరిక్స్‌ అంతా వారం రోజుల్లో పూర్తైంది. సిద్‌ శ్రీరామ్‌ పాడి పంపించాక మిక్సింగ్‌ చేసుకోడానికి మరో 10 రోజులు పట్టింది. 20 రోజుల్లో ఈ పాటను తయారు చేసి దర్శకుడికి ఇచ్చాను.

నల్లమల అటవీ ప్రాంతంలోని ఓ మారుమూల పల్లెలో నివసించే యువకుడు... తన మనసుకు నచ్చిన అమ్మాయి కోసం పాడుకునే పాట. ఆ విషయాన్ని అమ్మాయికి చెబుతూ తన చుట్టూ ఉన్న ప్రపంచంతో పోలుస్తూ పాడుతుంటాడు. దీనికి సాహిత్యం ఎలా ఉండాలని ఆలోచించా. పాటలోని భావం, వ్యక్తపరిచే పోలికలు ఆ ప్రాంతం దాటి పోకూడదు. అడవుల్లో తాను ఏవైతే చూస్తూ పెరిగాడో వాటిని పోల్చుకుంటూ అమ్మాయిని ఆరాధించాలి. అలా... లేత   లేగదూడ తాగే పాల రంగుతో అమ్మాయి రంగును పోల్చాను. అమ్మాయి వస్త్రధారణను పచ్చటి పైరును ఒంటికేసుకున్నావని     వర్ణించాను. ఎలిసిపోని వానజల్లు, మల్లెపూలన్ని కుళ్లుకుంటాయి, తేనెతీగలన్నీ చుట్టుముట్టినట్టు రాశా. అమ్మాయి అందాన్ని చూసి పొద్దు దాటినా ఇంకా సూర్యుడు  రెప్ప వాల్చడం లేదని, చీకట్లో దాగిన  చంద్రుడుతో పోలుస్తూ పాటలో చక్కటి భావం వచ్చేలా చూశాను. ఇలా... కథా   నాయకుడు తనచుట్టూ ఉన్న ప్రకృతిలోని ప్రతి అంశాన్ని జోడిస్తూ ఎంతో ప్రేమగా పాడుకుంటాడు. కథలో సందర్భానుసారంగా వచ్చే పాట ఇది. సినిమా విజయానికి ఎంతో దోహదపడుతుంది. మా చిత్ర బృందమంతా కలిసికట్టుగా శ్రమించడం వల్లే ఈ రోజు మా పాటకు మంచి ఆదరణ లభిస్తుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని