PM CARES Fund: ‘పీఎం కేర్స్‌’ ప్రభుత్వ నిధి కాదు..! - telugu news pm cares not a govt fund says central
close
Published : 24/09/2021 00:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PM CARES Fund: ‘పీఎం కేర్స్‌’ ప్రభుత్వ నిధి కాదు..!

దిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘పీఎం కేర్స్‌ (PM CARES)’ పేరుతో అత్యవసర సహాయ నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇది ప్రభుత్వ నిధి కాదని కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. పీఎం కేర్స్‌ కింద సేకరించిన విరాళాలు భారత ఏకీకృత నిధి (Consolidated Fund of India)కి వెళ్లవని స్పష్టం చేసింది. ఇతర ట్రస్టుల మాదిరిగానే ఈ ట్రస్టుకు వచ్చిన నిధుల వినియోగం పూర్తి పారదర్శకంగానే ఉంటుందని దిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటయ్యే ఛారిటబుల్‌ ట్రస్టుల మాదిరిగానే పీఎం కేర్స్‌ కూడా వ్యవహరిస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పీఎం కేర్స్‌ కింద ఆన్‌లైన్‌లో, చెక్కులు, డీడీలు, నగదు రూపంలో సేకరించిన విరాళాల పారదర్శకతపై కాగ్‌ (CAG) నియమించిన కమిటీతో ఆడిట్‌ జరుగుతుందని తెలిపింది. విరాళాలు, ఖర్చులకు సంబంధించిన ఆడిట్‌ నివేదికను సంబంధిత వెబ్‌సైట్‌లో పొందుపరిచేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని దిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం తరపున పీఎంఓ కార్యాలయం కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ శ్రీవాస్తవ ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది (మార్చి 27, 2020) ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ నిధిని ప్రభుత్వ నిధిగా ప్రకటించాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో సంయక్‌ గంగ్వాల్‌ అనే ఓ న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. ఒక వేళ అది ప్రభుత్వ నిధి కాకుంటే వెబ్‌సైట్‌ డొమైన్‌ పేరులో gov, ప్రధానమంత్రి ఫోటో, కేంద్ర ప్రభుత్వ ముద్రను తొలగించాలని కోర్టుకు తెలిపారు. ఆ పిటిషన్‌ విచారణ సందర్భంగా దిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తాజాగా అఫిడవిట్‌ సమర్పించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని