Tokyo olympics: చరిత్ర లిఖించారన్న మోదీ.. మీ మాటలే ప్రేరణనిచ్చాయన్న మన్‌ప్రీత్‌ - telugu news pm modi speaks to manpreet and coach reid after olympic hockey bronze applauds hard work
close
Published : 05/08/2021 15:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo olympics: చరిత్ర లిఖించారన్న మోదీ.. మీ మాటలే ప్రేరణనిచ్చాయన్న మన్‌ప్రీత్‌

దిల్లీ: ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టును ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. మ్యాచ్‌ గెలిచిన వెంటనే ఆయన కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, కోచ్‌ గ్రాహం రీడ్‌కు ఫోన్‌ చేశారు. ‘చరిత్ర లిఖించారు’ అని ప్రశంసల్లో ముంచెత్తారు. దేశం తమ రాక కోసం ఎదురు చూస్తోందని ప్రశంసించారు.

బెల్జియంతో జరిగిన సెమీస్‌ను ప్రధాని మోదీ టీవీలో వీక్షించారు. ఆ మ్యాచులో టీమ్‌ఇండియా పోరాడి ఓడింది. బాధలో ఉన్న మన్‌ప్రీత్‌ సేనను ఆయన ఓదార్చారు. ఫోన్‌ చేసి గెలుపోటములు సహజమేనని అన్నారు. జట్టు పోరాటాన్ని చూసి దేశం గర్విస్తోందని తెలిపారు. తర్వాతి మ్యాచులో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అందుకు తగ్గట్టే హాకీ ఇండియా జర్మనీని 5-4 తేడాతో ఓడించింది.

విజయం సాధించిన వెంటనే ‘చరిత్రాత్మకం! ఈ రోజు ప్రతి భారతీయుడి మదిలో ఉండిపోతుంది. ఇంటికి కాంస్యం తీసుకొస్తున్న భారత హాకీ జట్టుకు అభినందనలు. ఈ అద్భుత విజయంతో వారు యావత్ భారతావని, ముఖ్యంగా యువత కలలను నిజం చేశారు. హాకీ జట్టును చూసి భారత్‌ గర్విస్తోంది’ అని మోదీ ట్వీట్ చేశారు. వెంటనే మన్‌ప్రీత్‌కు కాల్‌ చేశారు.

‘మన్‌ప్రీత్‌ జీ! మీకు అభినందనలు. మీరు, మొత్తం జట్టు గొప్ప విజయం సాధించారు. మీరు సాధించిన విజయం చూసిన యావత్‌ భారతావని ఆనంద తాండవం చేస్తోంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది. ఆటగాళ్లందరికీ అభినందనలు. మీరు రాగానే మేమంతా కలుసుకుంటాం. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది’ అని మన్‌ప్రీత్‌ను మోదీ ఫోన్‌లో అభినందించారు. కోచ్‌ గ్రాహం రీడ్‌తోనూ ఆయన మాట్లాడారు.

‘అభినందనలు. మనం చరిత్ర సృష్టించాం’ అని మోదీ అనడంతో ‘సెమీస్‌ తర్వాత మీ మాటలు మాకు ప్రేరణనిచ్చాయి. మేమంతా ఆ మాటలతో స్ఫూర్తి పొందాం. ధన్యవాదాలు’ అని రీడ్‌ బదులిచ్చారు. దాంతో ‘మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది. నేనెంతో గర్వపడుతున్నాను’ అని మోదీ సంభాషణను ముగించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని