Thalaivii: కంగనా రనౌత్‌ ఎంపిక సరైంది కాదన్నారు! - telugu news producer vishnu vardhan about thalaivii
close
Published : 13/09/2021 22:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Thalaivii: కంగనా రనౌత్‌ ఎంపిక సరైంది కాదన్నారు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖుల జీవితగాథల్ని తెరపైకి తీసుకురావడమంటే తనకెంతో ఇష్టమని తెలిపారు నిర్మాత విష్ణు వర్ధన్‌ ఇందూరి. శైలేష్‌ ఆర్‌. సింగ్‌తో కలిసి విష్ణు నిర్మించిన చిత్రం ‘తలైవి’. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ తెరకెక్కించిన చిత్రమిది. కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్ర పోషించారు. ఎంజీ రామచంద్రన్‌ (ఎంజీఆర్‌) పాత్రలో అరవింద్‌ స్వామి నటించారు. వినాయకచవితి కానుకగా ఈ నెల 10న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత విష్ణు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం పడిన ఇబ్బందుల్ని తెలియజేశారు.

‘తలైవి’.. ఆలోచన తనదే

క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ బృందా వల్లే ఈ సినిమా ప్రారంభమైంది. జయలలిత గురించి ప్రపంచానికి తెలియజేయాలనే తన అభిప్రాయాన్ని మాతో పంచుకుంది. ఆమె ఆలోచన మాకు నచ్చడంతో సినిమాని నిర్మించాలనుకున్నాం. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. తమిళనాడుకి చెందిన దర్శకుడు అయితే ఈ కథని బాగా డీల్‌ చేయగలరనే ఉద్దేశంతో విజయ్‌ని ఎంపిక చేశాం. ఇలాంటి కథని ఎవరు రాయగలరు? అనుకున్నప్పుడు విజయేంద్ర ప్రసాద్ తప్ప ఎవరూ న్యాయం చేయలేరు అనిపించింది. టైటిల్ పాత్ర కోసం కంగనా రనౌత్‌ని అనుకున్నాం అని చెప్పగానే చాలామంది బ్యాడ్‌ చాయిస్‌ అన్నారు. ఇదే విషయాన్ని ప్రకటించిన సమయంలో సోషల్‌ మీడియాలో నెగెటివ్ కామెంట్లు పెట్టారు. కానీ, సినిమా చూశాక తమ అభిప్రాయం మారింది. గతంలో వారు పెట్టిన నెగెటివ్‌ ట్వీట్‌ని రీట్వీట్‌ చేస్తూ ‘మీ నిర్ణయమే సరైంది’ అని చెబుతున్నారు. నిర్మాతగా ఓ మంచి సినిమా తీశాననే ప్రశంసలు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.

ఎవర్నీ తక్కువగా చూపించలేదు..

ఈ సినిమాలో జయలలితతోపాటు ఎం.జి.ఆర్‌. పాత్ర చాలా కీలకమైంది. అందుకే ఈ పాత్రకి అరవింద్ స్వామిని తీసుకున్నాం. ఈ పాత్రకి తక్కువ సన్నివేశాలున్నా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒకరిని గొప్పగా మరొకరిని తక్కువగా చూపించే ప్రయత్నం చేయలేదు. కరోనా కారణంగా బడ్జెట్‌, నటీనటుల విషయంలో కొన్ని మార్పులు చేయాలనుకున్నా. కానీ, సహనిర్మాతల మద్దతుతో ఆ ఆలోచన మానుకున్నా. థియేటర్లని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా తెరకెక్కించాం. మరోవైపు నాన్ థియేట్రికల్ రెవెన్యూ బాగా వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాక్సాఫీస్ లెక్కల్నిబట్టి సినిమా హిట్‌ అయిందా, లేదా? చెప్పలేం. మనం పెట్టిన పెట్టుబడి వచ్చిందా, లేదా? మన సినిమాను ఎంత మంది చూశారు? అనే అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆ విషయంలో మేం విజయం అందుకున్నాం.

విమర్శలు లేవు..

నిర్మాతలెవరూ తమ సినిమాని వారం ముందే అందరికీ చూపించే ప్రయత్నం చేయరు. కానీ, నేను చేశా. నా సినిమా మీద నాకున్న నమ్మకం అది. ప్రివ్యూ చూసిన వారంతా బాగుందని చెప్పడంతో సినిమా విడుదలకి ముందురోజు ఎలాంటి ఒత్తిడిలేకుండా ప్రశాంతంగా పడుకున్నా. ‘తలైవి’ విడుదలయ్యాక ఏ విమర్శలూ తలెత్తలేదు. ఈ సినిమా చేస్తున్నామని తెలియగానే జయలలిత కుటుంబ సభ్యులు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అలాంటి వారు సినిమా చూశాక మమ్మల్ని అభినందించారు. జయలలితకి అసలైన నివాళి ఇదే అని అన్నారు. తమిళనాడులో ఇంకా ఎక్కవ స్క్రీన్లలో ఈ సినిమాని ప్రదర్శింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.

తదుపరి చిత్రాలు..

నాకు బయోపిక్‌ సినిమాలంటే చాలా ఇష్టం. కపిల్ దేవ్ బయోపిక్ ‘83’ మంచి సినిమా. థియేటర్లలోనే విడుదల చేసేందుకు ఎదురుచూస్తున్నా. ప్రస్తుతం..  ‘ఆజాద్ హింద్’ అనే దేశభక్తి సినిమాకి సంబంధించి చర్చలు సాగుతున్నాయి. సామాజిక మాధ్యమాల నేపథ్యంలో పాన్‌ ఇండియా స్థాయిలో ‘ట్రెండిండ్‌’ అనే చిత్రం నిర్మించే ఆలోచన ఉంది. ఈ ప్రాజెక్టులకి సంబంధించిన వివరాలన్నీ త్వరలోనే తెలియజేస్తా.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని