Samantha: ఆ విషయంపై స్పందించమని 65,000 ట్వీట్లు పెట్టారు! - telugu news samantha akkineni interview about the family man season 2 and shaakuntalam
close
Published : 31/08/2021 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Samantha: ఆ విషయంపై స్పందించమని 65,000 ట్వీట్లు పెట్టారు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథానాయికగా సినిమాల్లో కొనసాగుతూనే ‘ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2’ వెబ్‌ సిరీస్‌తో డిజిటల్‌ బాట పట్టింది సమంత. సినిమాల్లోనే కాదు సిరీస్‌ల్లోనూ వైవిధ్యం ప్రదర్శించి, తొలి ప్రయత్నంలోనే ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ (ఐ.ఎఫ్‌.ఎఫ్‌.ఎం) అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించింది. తనకి ఇష్టమైన పాత్రలు, తనపై వస్తున్న విమర్శల గురించి మాట్లాడింది. ఆ విశేషాలివీ...

అది నేను ఊహించలేదు..

నేను నటించిన మొదటి వెబ్‌ సిరీస్‌ ఇది (ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2). తొలి ప్రయత్నంలోనే అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాజీ పాత్ర కోసం కష్టపడి పనిచేశాను. కానీ, ఫలానా అవార్డు వస్తుందని ఊహించలేదు. నా కెరీర్‌లో ‘ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2’ సిరీస్‌ ప్రత్యేకంగా నిలుస్తుంది. రాజీ పాత్రకి నన్ను ఎంపిక చేసినందుకు దర్శకుడు రాజ్‌ అండ్‌ డి.కె. కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. క్యూట్‌ గాళ్ ఇమేజ్‌ ఉన్న నన్ను ఇలాంటి సీరియస్‌ పాత్రకి ఎంపిక చేయడం వారి చేసిన సాహసం అనుకోవచ్చు. నా పాత్రలకి నేనే విమర్శకురాలిని. నిజం చెప్పాలంటే ఈ సిరీస్‌లోని నా పెర్ఫామెన్స్‌ని నేను చూడలేకపోయా (నవ్వుతూ..).  గతంలో పోషించిన పాత్రకి ఇప్పుడు పోషిస్తున్న పాత్రలకి వైవిధ్యం చూపించాలనుకుంటా. ఎప్పుడూ నన్ను నేను నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుంటా. ఈ ఆలోచనలతోనే రాజీ పాత్రలో కనిపించా.

ఆ కల నిజమైంది..

నేను డిస్నీ సినిమాలు, అబ్బురపరిచే కథల్ని తెరపై చూస్తూ పెరిగాను. వాటిల్లో రాజకుమారుడు, రాజకుమారి పాత్రలు నన్నెంతో ఆకర్షించాయి. డిస్నీ నుంచి ఏ సినిమా విడుదలైనా వెంటనే చూసేస్తా. యానిమేషన్ అంటే నాకంత ఇష్టం. యానిమేటెడ్‌ పాత్రల్ని ఆరాధిస్తా. ఎందుకంటే మనుషుల కంటే బాగా అవే భావోద్వేగాల్ని పలికించగలవు. ‘మీ మెంటార్‌ ఎవరు? నటనలో ఎవరు మీకు స్ఫూర్తి? ఎవర్ని అనుసరిస్తుంటారు?’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. డిస్నీ, యానిమేటెడ్‌ పాత్రలే నాకు స్ఫూర్తి. వాటిని అనుకరించేందుకు ప్రయత్నిస్తుంటా. వీటి కారణంగా ఎపిక్‌ (ఇతిహాసం) చిత్రంలో నటించాలనే కోరిక మొదలైంది. రాజకుమారిగా కనిపించాలని అనుకునేదాన్ని. దర్శకుడు గుణశేఖర్‌ వల్ల ఆ కల నిజమైంది. అదే ‘శాకుంతలం’. మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా ఈ ప్రేమకథ రూపొందుతోంది. నేనిందులో శాకుంతల అనే పాత్ర పోషించాను.

సూపర్‌మ్యాన్‌గా..

యాక్షన్‌ చిత్రాలూ చేయాలని అనిపిస్తుంటుంది. రాజీ పాత్ర కోసం కొన్ని పోరాటాలు చేశాను. విలన్లు హీరోయిన్‌ని బంధిస్తే ‘ఎవరైనా ఉన్నారా? నన్ను రక్షించండి’ అనే పాత్ర కాకుండా నేనే యాక్షన్‌ చేయడం మంచి అనుభూతి పంచింది. ప్రస్తుతానికి సూపర్‌మ్యాన్‌గా నటించాలనుంది. చూద్దాం.. ఏమవుతుందో!

వాటిపై స్పందించను..

సమంత సామాజిక మాధ్యమాల్లో పేరెందుకు మార్చుకుంది? ఈ విషయం నెట్టింట హాట్‌ టాపిక్‌ అయింది. ట్రోల్స్‌ వస్తున్నాయి. దానిపై స్పందించాలని నేను అనుకోవడం లేదు. ఇప్పుడే కాదు ‘ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2’ విడుదలైన సమయంలోనూ విమర్శలు ఎదురయ్యాయి. దీని గురించి ఏదైనా చెప్పండి అంటూ కొంతమంది సోషల్‌ మీడియా వేదికగా కోరారు. ఇందుకు సుమారు 65,000 ట్వీట్లు పెట్టారు. కానీ, నాకు జవాబు ఇవ్వాలనిపించలేదు. సంబంధిత విషయాలపై నాకు మాట్లాడాలనిపిస్తేనే మాట్లాడతా.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని