Shaili Singh: ఒలింపిక్స్‌లో మరో సంచలనం కాబోతున్న శైలిసింగ్! - telugu news shaili singh next big indian athlete in long jump
close
Updated : 23/08/2021 12:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Shaili Singh: ఒలింపిక్స్‌లో మరో సంచలనం కాబోతున్న శైలిసింగ్!

(Photo: Anurag Thakur Twitter)

2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి మరో సంచలన అథ్లెట్‌ రాబోతోందా..? అంటే అవుననే సమాధానం లభిస్తోంది. ఎందుకంటే తాజాగా జరిగిన అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో లాంగ్‌ జంపర్‌ శైలి సింగ్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోవడమే అందుకు కారణం. ఆదివారం నైరోబీలో జరిగిన ఈ పోటీల్లో శైలి త్రుటిలో స్వర్ణ పతకం కోల్పోయింది. కానీ, ఆమె భవిష్యత్తులో దేశం గర్వించదగ్గ అథ్లెట్‌గా ఎదగటం ఖాయంగా కనిపిస్తోంది.

తల్లి టైలర్‌ పని చేస్తూ..

(Photo: Sports Authority of India Twitter)

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన శైలిసింగ్‌ (17) లాంగ్‌ జంపింగ్‌ అథ్లెట్‌. ఆమెకు తల్లి ఓ సోదరి, సోదరుడు ఉన్నారు. తండ్రి లేకపోవడంతో ఆ కుటుంబాన్ని తల్లి వనితా సింగ్‌ చూసుకునేవారు. ఆమె టైలరింగ్‌ చేస్తూ తన ముగ్గురు పిల్లల్ని పోషించేది. కాగా, ఆమెకు క్రీడలపై ఇష్టం ఉండటంతో తన కుమార్తె శైలిని లాంగ్‌ జంప్‌ విభాగంలో ప్రోత్సహించింది. లఖ్‌నవూలోని ఓ క్రీడా వసతిగృహంలో చేర్పించగా తల్లి మాటను గౌరవిస్తూ ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొనేది. ఈ క్రమంలోనే 2017లో విజయవాడలో జరిగిన జాతీయ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొంది. అక్కడ పతకం గెలవకపోయినా తర్వాత అంతర్‌ జిల్లా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో మాజీ అథ్లెట్ అంజూ బాబీ జార్జ్‌ కంటపడింది. దాంతో శైలిని అంజూ-రాబర్ట్‌ దంపతులు తమ వెంట బెంగళూరుకు తీసుకెళ్లారు.

ట్రాక్‌లోకి దిగితే బంగారమే..

(Photo: Anuraj Thakur Twitter)

ఇక లఖ్‌నవూ నుంచి బెంగళూరు చేరిన శైలిని అంజూ-రాబర్ట్‌ దంపతులు ఆమెకు మెరుగైన శిక్షణ ఇచ్చారు. దాంతో లాంగ్‌ జంప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కొనసాగిస్తూ శైలి జూనియర్‌ ఛాంపియన్‌గా అవతరించింది. 2018లో రాంచీలో జరిగిన జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్ అండర్‌-16 విభాగంలో తొలిసారి బంగారు పతకం సాధించింది. ఇక్కడ శైలి 5.94 మీటర్లు లాంగ్‌ జంప్‌ చేసి జాతీయ రికార్డు నెలకొల్పింది. ఇక 2019లో గుంటూరులో జరిగిన జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ అండర్‌-18 విభాగంలో రెండోసారి గోల్డ్‌ మెడల్‌ సాధించింది. ఈసారి తన రికార్డును తానే బద్దలు కొట్టింది. ఈసారి 6.15 మీటర్ల దూరం దూకి సత్తా చాటింది. ఈ మేటి ప్రదర్శనతో ఆమె 2020లో ఐఏఏఎఫ్‌ (అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఫెడరేషన్‌) నిర్వహించిన అండర్‌-20 ఛాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధించింది. ఇక ఈ ఏడాది జూన్‌లో పాటియాలాలో నిర్వహించిన అండర్‌-20 సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో 6.48 మీటర్లు దూకి అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధించింది. ఈ క్రమంలోనే ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ఒక్క సెంటిమీటర్‌ తేడాతో ప్రపంచస్థాయి ఈవెంట్‌లో తొలిసారి స్వర్ణాన్ని కోల్పోయింది. 6.59 మీటర్ల ప్రదర్శన చేసిన శైలి రెండో స్థానంలో నిలవగా స్వీడన్‌కు చెందిన మజా అస్కాగ్‌ 6.60 మీటర్లతో పసిడి పతకం సాధించింది. అయితే, భవిష్యత్‌లో మరింత బాగా ఆడి ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటి భారత పతాకాన్ని రెపరెపలాడించాలని తహతహలాడుతోంది.

తల్లి మాట నిలబెట్టలేకపోయా..

(Photo: World Athletics Twitter)

ఇక నిన్న జరిగిన ఫైనల్స్‌లో తాను 6.59 మీటర్ల కన్నా ఎక్కువ దూకి స్వర్ణం గెలవాల్సిందని పేర్కొంది. ఈ పోటీల్లో స్వర్ణం గెలిచి స్టేడియంలో జాతీయ గీతం వినిపించాలని తన తల్లి చెప్పారని గుర్తుచేసుకుంది. కానీ తాను ఆ కోరిక తీర్చలేకపోయానని తెలిపింది. కాగా, తన వయస్సు ఇంకా 17 ఏళ్లే అని, వచ్చే అండర్‌-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. అలాగే రాబోయే ఆసియా, కామన్వెల్త్‌ క్రీడల్లోనూ మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నట్లు శైలి వివరించింది. ఇక శైలి ప్రదర్శనపై స్పందించిన కోచ్‌ అంజుబాబీ.. ఆమె ల్యాండింగ్‌ శైలిలో చిన్న సమస్య ఉందని, లేదంటే పసిడి సాధించేదని తెలిపింది. ఏ పోటీల్లోనైనా శైలి స్వర్ణం సాధించకపోవడం ఇదే తొలిసారని గుర్తుచేసింది. రజతం అంటే ఆమెకు ఇష్టం ఉండదని చెప్పింది. ఈ ఏడాది టోక్యోలో మహిళల లాంగ్‌ జంప్‌లో 7 మీటర్లు దూకిన జర్మనీ అథ్లెట్‌ స్వర్ణం గెలిచింది. శైలి మరో 40 సెంటీమీటర్లు రికార్డును పెంచుకొంటే పతకం ఖాయం. అథ్లెటిక్స్‌లో సాధారణంగా వయస్సు 20ఏళ్లు దాటిన తర్వాత అత్యుత్తమ ప్రదర్శనలు ఉంటాయి. ఈ నేపథ్యంలో శైలికి మంచి భవిష్యత్తు ఉందనడంలో సందేహమే లేదు. ఇక ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా తర్వాత శైలి మరో పెద్ద అథ్లెట్‌ కాబోతోందని ఆమె కోచ్‌ అంజూ విశ్వాసం వ్యక్తంచేసింది.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని