Satyadev: ఆయన వల్లే ‘తిమ్మరుసు’ గురించి ఇంతమందికి తెలిసింది - telugu news thimmarusu actor satyadev interview
close
Published : 29/07/2021 22:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Satyadev: ఆయన వల్లే ‘తిమ్మరుసు’ గురించి ఇంతమందికి తెలిసింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా సినిమాకీ వైవిధ్యం ప్రదర్శించే నటుల్లో సత్యదేవ్‌ ఒకరు. చేసే ప్రతి చిత్రం విభిన్నంగా ఉండాలనుకుంటారు. అలా లాయరు పాత్రలో ఆయన నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జులై 30న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు సత్యదేవ్‌. ఈ వివరాలివీ...

* రెండోసారి లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న సినిమా మీదే. ఎలా ఫీలవుతున్నారు?

చాలా ఆనందంగా ఉంది. ఓటీటీ విలువ పెరిగినా థియేటర్‌ థియేటరే కదా. ఆ అనుభూతి వేరు. నా గత చిత్రం ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ ఓటీటీకి వెళ్లడం కాస్త బాధ కలిగించింది. కానీ, ఆ సమయంలో అదే సరైన నిర్ణయం అనిపించింది. ఈ విషయంలో నిర్మాతనీ దృష్టిలో పెట్టుకోవాలి. ప్రీ రిలీజ్‌ వేడుకలో నాని చెప్పినట్టు మిగతా వాటితో పోలిస్తే థియేటర్లు చాలా సేఫ్‌. ఇలాంటి సమయంలో పెద్ద సినిమాలు రావడం లేదు.. మేం ఎందుకొస్తున్నామంటే మా బడ్జెట్‌కి, మా లెక్కలకీ ఇదొక మంచి అవకాశంలా భావిస్తున్నాం. ఇది అనువైన సమయం.. ఉన్నన్ని థియేటర్లలో విడుదల చేయడమే మంచిది అనిపించింది.

* ‘తిమ్మరుసు’ ఎలా ప్రారంభమైంది?

నా మునుపటి చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’కి పూర్తి భిన్నంగా చేయాలనుకునే సమయంలో నిర్మాత సృజన్‌ పరిచయం అయ్యారు.  తర్వాత దర్శకుడు శరణ్‌ తోడై ఓ బృందంగా ‘తిమ్మరుసు’ కథని తీర్చిదిద్దాం. మరో నిర్మాత మహేశ్‌ కోనేరు మాకు అండగా నిలిచారు. ఇది కోర్టు నేపథ్యంలో సాగే థ్రిల్లర్ సినిమా‌. ఇతర థ్రిల్లర్‌ చిత్రాలకు దీనికి చాలా తేడా ఉంటుంది. నా గత చిత్రాల్లో యాక్షన్‌ సన్నివేశాలుండవు. ఆ కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకి వచ్చి ఈ సినిమాలో పోరాటాలు చేశాను. మా టీం అంతా ఎంతో కష్టపడి 39 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. అది కూడా కొవిడ్‌ వేళ ఒకే ఒక షెడ్యూల్‌లో.

* ఇటీవల కోర్టు నేపథ్యంలో వరుసగా సినిమాలు వస్తున్నాయి కదా..

అవును. అయితే ఇది కావాలని చేసేది కాదు. ఒక్కో కథ ఒక్కోలా ఉంటుంది. యావజ్జీవ శిక్షను తప్పించడానికి లాయరు చేసే పోరాటం ‘తిమ్మరుసు’ కథ. ఇందులో రామచంద్ర పాత్రలో కనిపిస్తాను. కోర్టు నేపథ్యంలో వచ్చిన సినిమాలు విజయం సాధించాయి. మా సినిమా విషయంలోనూ అదే ఫలితం ఆశిస్తున్నాం. ఇతర చిత్రాలకు దీనికీ పోలిక ఉండదు.

* ఈ కథ వినోదాత్మకమా? సీరియస్‌గా సాగుతుందా?

వినోదమే ప్రధానం. తర్వాత నెమ్మదిగా అసలు కథ మొదలవుతుంది. ఈ రెండే కాదు అన్ని రకాల భావోద్వేగాలూ ఈ చిత్రంలో ఉంటాయి.

* కోర్టు నేపథ్యం అంటే వాదనలు, ప్రతివాదనలు ఆసక్తిగా ఉండాలి. ఇందుకు ఎలాంటి కసరత్తులు చేశారు?

ఇలాంటి చిత్రాలకు అవే కీలకం. వాదనలు, ప్రతివాదనలే రక్తి కట్టిస్తాయి. ఈ సినిమాలోనూ భారీ డైలాగులు ఉన్నాయి. ఓ సన్నివేశానికి సంబంధించి దర్శకుడు శరణ్‌ ముందుగా నాలుగు పేజీల డైలాగ్‌ ఉందన్నారు. కానీ, తర్వాత కొన్ని మార్పులు చేసి తగ్గించారు. వాటిని తెరపై చూస్తుంటే ప్రేక్షకులకి మంచి అనుభూతి కలుగుతుంది. 

* వాస్తవ సంఘటనల ఆధారంగా ఏమైనా రాసుకున్నారా?

వాస్తవంగా జరిగిన అంశాల్ని తీసుకోలేదు. కానీ, ఎవరో ఒకరి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురై ఉంటాయి.

* సెక్షన్స్‌కి సంబంధించి ఏమైనా చెప్పబోతున్నారా?

తప్పు చేయకుండా ఓ వ్యక్తి ఏదైనా కేసులో చిక్కుకుంటే, అతనికి న్యాయం ఎలా జరుగుతుంది అనేది కీలకాంశం. ఇలా ఆ కేసుని పరిష్కరించే మార్గంలో కథానాయకుడికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా అధిగమించాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇందులో చాలా ట్విస్టులుంటాయి.

* ట్రైలర్‌ని ఎన్టీఆర్‌తో విడుదల చేయించారు. దాని గురించి

ట్రైలర్‌ విడుదల చేయాలని ఆయన్ను అడగ్గానే ఒప్పుకున్నారు. చాలాసేపు ఈ సినిమా గురించి మాట్లాడుకున్నాం. సినిమానీ చూస్తానని చెప్పారు. ఆయన విడుదల చేయడం వల్లే ఈ సినిమా గురించి ఇంతమందికి తెలిసింది.

* కథానాయిక పాత్ర ఎలా ఉంటుంది?

ఇందులో ప్రియాంక జవాల్కర్‌ కథానాయిగా నటించింది. తనూ లాయరుగానే కనిపిస్తుంది. తనూ నేనూ బ్రహ్మాజీ ఒకే కంపెనీ పనిచేస్తాం. ప్రియాంక నాకు సపోర్ట్‌ చేస్తుంటుంది. ఆమెలో మంచి నటి ఉంది. ఆమె హావభావాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని