Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - telugu top news at nine pm
close
Published : 21/09/2021 20:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. భారత వాయుసేన కొత్త చీఫ్‌గా వీఆర్‌ చౌధరి!

భారత వాయుసేన కొత్త దళపతిగా ఎయిర్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరిని నియమించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం వైమానిక దళ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన్ను తదుపరి చీఫ్‌గా నియమించనున్నట్లు రక్షణశాఖ ప్రకటించింది. ప్రస్తుతం వైమానిక దళాధిపతిగా కొనసాగుతున్న ఆర్‌కేఎస్‌ భదౌరియా ఈ నెల 30న పదవీవిరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త చీఫ్‌గా చౌధరిని నియమించాలని రక్షణశాఖ నిర్ణయించింది.

2. రేవంత్‌రెడ్డికి సిటీ సివిల్‌ కోర్టు ఇన్‌జంక్షన్‌ ఆర్డర్స్‌

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వేసిన పరువునష్టం దావా కేసులో సిటీ సివిల్‌ కోర్టు మధ్యంత ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్‌ కేసుతో ముడిపెట్టి కేటీఆర్‌పై వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. ఈ మేరకు రేవంత్‌రెడ్డిని ఆదేశిస్తూ సిటీ సివిల్‌ కోర్టు ఇన్‌జంక్షన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

3. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు దీవిస్తుంటే తెదేపా అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 99 శాతం జడ్పీటీసీలు, 85 శాతం ఎంపీటీసీ స్థానాలను వైకాపా కైవసం చేసుకుందన్నారు. కుప్పం, నారావారిపల్లె, నిమ్మకూరులోనూ వైకాపా గెలిచిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును తప్పకుండా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడాలి నాని అన్నారు.

4. మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణలోని మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021-23 సంవత్సరాలకు ఈ రిజర్వేషన్లు అమల్లో ఉండనున్నాయి.

5. ఏపీ నిరాధారమైన వాదన పట్టించుకోవద్దు: తెలంగాణ

ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న నిరాధారమైన వాదనను పట్టించుకోవద్దని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై వివరణ ఇచ్చారు. కృష్ణా నీరు ఇవ్వని ప్రాంతాలకే గోదావరి నీళ్లిస్తున్నామని చెప్పారు. మిగులు నీటిని ఎగువ  ప్రాజెక్టుల్లో వినియోగించుకోవచ్చునని.. తక్కువ నీటి మళ్లింపునకు టెలిమెట్రీలు అవసరం లేదని ఈఎన్‌సీ లేఖలో పేర్కొన్నారు.

6. 107 ఏళ్ల కవల బామ్మలు @ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌.. అందులో చోటు సంపాదించడమనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. వారికంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. ఫలానా రంగంలో వైవిధ్యమైన ప్రతిభ కనబరచాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న బామ్మలకు ఓ ప్రత్యేకత ఉందండోయ్‌! ప్రపంచంలోనే వృద్ధ కవలలుగా (మహిళల విభాగంలో) వీరిద్దరు గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కారు. వారి గురించి వారి మాటల్లో ఏమని చెబుతారంటే.. 

7. వాణిజ్య వాహనాల ధరలు పెంచిన టాటామోటార్స్‌

టాటామోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరలను పెంచింది. ఈ పెంపు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని కంపెనీ మంగళవారం ప్రకటించింది. ముడిపదార్థాల ధరలు పెరడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది. ఇటీవల కాలంలో స్టీలు, విలువైన లోహాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.  ఈ పెరుగుదల సుమారు 2 శాతం వరకు ఉండొచ్చు. మోడల్‌ని బట్టి ఇది మారుతుంటుంది.

8. అలా చేస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చు.. సీఎంలకు లేఖలు రాస్తా!

దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఓ కీలక సూచన చేశారు. కమర్షియల్‌ ట్రక్కు డ్రైవర్లకు నిర్దిష్టమైన పనిగంటలు అమలు చేయాలన్నారు. పైలట్ల మాదిరిగానే ట్రక్కు డైవర్లకు కూడా నిర్దిష్టమైన పని గంటలు నిర్ణయిస్తే.. అలసట కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు.

9. చిన్నారులకు కొవాగ్జిన్‌.. ప్రయోగాలు పూర్తి!

18ఏళ్లలోపు పిల్లల్లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ మరికొన్ని వారాల్లోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. భారత్‌ బయోటెక్‌ చిన్నారుల కోసం రూపొందించిన ‘కొవాగ్జిన్‌’ తుది (రెండు, మూడు) దశ ప్రయోగాలు పూర్తి చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ప్రయోగాల సమాచారాన్ని వచ్చే వారం భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI)కు అందజేస్తామని ప్రకటించింది.

10. కర్రలతో కొట్టుకున్న కియా ఉద్యోగులు

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో కియా అనుంబంధ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు పరస్పర ఘర్షణకు దిగారు. పరిశ్రమ ఆవరణలో కర్రలతో కొట్టున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని