Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు - telugu top ten news at nine pm
close
Published : 03/08/2021 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

1. వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ బలోపేతం చేసేలా చర్యలు: జగన్‌

ఐటీ, డిజిటల్‌ లైబ్రరీలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాలకు ఇంటర్నెట్‌ తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డిజిటల్‌ లైబ్రరీలతో ప్రాథమిక, మాధ్యమిక విద్య, డిగ్రీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు.

హైకోర్టులో అశోక్‌గజపతిరాజుకు ఊరట

2. హరీశ్‌రావు మానవత్వం మరిచి మాట్లాడుతున్నారు: రఘునందన్‌

మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌పై  మానవత్వం లేకుండా ఆరోపణలు చేస్తున్నారంటూ భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈటల రాజేందర్‌కు ఆస్పత్రిలో ఆపరేషన్‌ జరిగితే.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న హరీశ్‌రావు మానవత్వం మర్చిపోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

21 జిల్లాలకు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షుల నియామకం

3. తెలంగాణతో గొడవపడాలని ఎప్పుడూ అనుకోలేదు: బొత్స

తెలంగాణతో గొడవపడాలని ఎప్పుడూ అనుకోలేదని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం త్వరగా సమసిపోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. విశాఖ ఉక్కుపై కేంద్రమంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉక్కు పరిశ్రమపై కేంద్రానికి దుర్మార్గ వైఖరి అని ధ్వజమెత్తారు. 

4. దేవినేని బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

కృష్ణాజిల్లా జి.కొండూరులో తనపై నమోదైన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వైపుల న్యాయవాదులు వాదనలు వినిపించారు. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తవటంతో నిర్ణయాన్ని రేపు వెల్లడిస్తామని కోర్టు తెలిపింది.

5. శెభాష్‌ సింధు.. కేంద్రమంత్రుల సన్మానం

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన స్టార్‌ షట్లర్‌ పీవీ సింధును పలువురు కేంద్రమంత్రులు సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో  కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, నిర్మలా సీతారామన్‌, అనురాగ్ ఠాకూర్‌, నిశిత్‌ ప్రమాణిక్‌ పాల్గొని సింధు క్రీడా ప్రతిభను కొనియాడారు.

6. కరోనా సెకండ్‌వేవ్‌ ఇంకా పోలేదు.. ఆ 8 రాష్ట్రాల్లో ఆందోళనకరం!

దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ ఇంకా తొలగిపోలేదని, ఎనిమిది రాష్ట్రాల్లో ఈ మహమ్మారి ఉద్ధృతరూపం కొనసాగుతోందని కేంద్రం హెచ్చరించింది. కరోనా వ్యాప్తి రేటును తెలియజేసే ఆర్‌- ఫ్యాక్టర్‌  (రీ ప్రొడక్షన్‌ రేటు) 8 రాష్ట్రాల్లో 1 కన్నా ఎక్కువగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో కరోనా పరిస్థితిపై నిర్వహించిన మీడియా సమావేశంలో అధికారులు మంగళవారం మాట్లాడారు. 

7. గోగ్రా నుంచి బలగాల ఉపసంహరణకు భారత్‌, చైనా ఓకే

సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి, తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించుకునే దిశగా మరో అడుగు పడింది. తూర్పు లద్దాఖ్‌లోని గోగ్రా హైట్స్‌ ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణకు భారత్‌, చైనా అంగీకరించినట్లు తెలుస్తోంది. గత శనివారం రెండు దేశాల మధ్య జరిగిన కమాండర్‌ స్థాయి సైనిక చర్చల్లో ఈ మేరకు ఒప్పందానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. 

8. వుహాన్‌ ల్యాబ్‌లోనే కరోనా ఆవిర్భావం!

కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే పుట్టినట్లు రుజువైందని అమెరికాకు చెందిన రిపబ్లికన్లు ఆరోపించారు. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేశారు. ఇందుకు సంబంధించి అనేక రుజువులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా నిఘా సంస్థలు మాత్రం ఇంకా తుది అభిప్రాయానికి రాలేదు. వుహాన్ ల్యాబ్‌పై వస్తున్న ఆరోపణలను చైనా ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తోంది.

9. రూ.7 లక్షల కోట్లకు చేరిన ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ విలువ!

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.7 లక్షల కోట్ల మార్క్‌ను తాకింది. ఈరోజు ఓ దశలో ఈ కంపెనీ షేరు ధర రూ.1,646.40కు పెరగడంతో ఈ మార్క్‌ను అందుకుంది. గత రెండు వారాల్లో ఈ కంపెనీ షేరు విలువ 7 శాతానికి పైగా పెరగడం విశేషం. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా బీఎస్‌ఈలో ఇన్ఫోసిస్‌ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. 

10. జావెలిన్‌ త్రోలోనూ భారత్‌కు నిరాశే..

ఒలింపిక్స్‌లో మంగళవారం భారత్‌కు మరో నిరాశే ఎదురైంది. జావెలిన్‌ త్రో విభాగంలో తుదిపోరుకు అర్హత సాధించే పోటీల్లో జాతీయ అత్యుత్తమ రికార్డు కలిగిన అథ్లెట్‌ అన్ను రాణి నిరుత్సాహపర్చింది. ఆమె మూడో ప్రయత్నంలో 54.04 మీటర్ల ప్రదర్శన చేసి క్వాలిఫికేషన్‌-ఏలో 14వ స్థానంలో నిలిచింది. దాంతో ఆమె మార్చిలో నెలకొల్పిన తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన 63.24 మీటర్లు కూడా చేరుకోలేకపోయింది.

దేశానికి పతకం తెస్తానని ముందే చెప్పిందిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని