టీమ్‌ఇండియా చరిత్రకు నాంది పడింది ఈరోజే! - tendulkar open the batting on this day in 1994 rest is history
close
Published : 27/03/2021 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీమ్‌ఇండియా చరిత్రకు నాంది పడింది ఈరోజే!

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సుదీర్ఘకాలం టీమ్‌ఇండియాకు సేవలందించాడు. ‘గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌’గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. బ్యాటింగ్‌ రికార్డులన్నీ తనకోసమే ఉన్నాయేమో అనేలా చెలరేగిపోయాడు. 24 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఘనతలు, ఎన్నో రికార్డులు తిరగరాశాడు. అయితే వాటికి బీజం పడింది మాత్రం ఈరోజే. సరిగ్గా 27 ఏళ్ల క్రితం వన్డేల్లో ఓపెనర్‌గా దిగాడు. అంతకుముందు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌‌మన్‌గా కొనసాగిన సచిన్‌ 1994 మార్చి 27నే ఓపెనర్‌ అవతారమెత్తాడు. ఆపై చరిత్ర సృష్టించాడు.

ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఆ వన్డేలో ఆరోజు ఓపెనింగ్‌ చేస్తాననే విషయం తనకే తెలియదని ఓ సందర్భంలో సచిన్‌ చెప్పాడు. అప్పట్లో సహజంగా నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ టీమ్‌ఇండియా ఓపెనర్‌గా దిగేవాడు. అయితే, ఆరోజు అతడికి ఏదో గాయమవడంతో మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. దాంతో కెప్టెన్‌గా ఉన్న అజహరుద్దీన్‌, జట్టు మేనేజర్‌ వాడేకర్‌ ఏం చేయాలో అని ఆలోచిస్తుండగా సచిన్‌ తాను ఓపెనర్‌గా దిగుతానని అడిగాడు. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడంతో అజ్జూ అంగీకరించాడు. ఆపై లిటిల్‌మాస్టర్‌ కాస్త మాస్టర్‌ బ్లాస్టర్‌గా మారాడు. 49 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో మొత్తం 82 పరుగులు చేశాడు. 143 పరుగుల లక్ష్యంలో సచినే సగం స్కోరుకు పైగా సాధించాడు. కాగా, ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా సునాయాస విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి తెందూల్కర్‌ చెలరేగిపోయాడు. ఈ విషయాన్ని తాజాగా బీసీసీఐ ట్వీట్‌ చేసి అభిమానులతో పంచుకుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని