Dhanush Karnan Review: తిరగబడిన కర్ణుడి కథ ‘కర్ణన్‌’ - the review of tamil film karnan
close
Updated : 21/05/2021 18:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Dhanush Karnan Review: తిరగబడిన కర్ణుడి కథ ‘కర్ణన్‌’

సినిమా: కర్ణన్; భాష: తమిళం; దర్శకుడు: మారి సెల్వరాజ్‌; సంగీతం: సంతోష్‌ నారాయణన్‌; తారాగణం: ధనుష్‌, రజీషా విజయన్‌, లాల్‌, యోగిబాబు తదితరులు; నిర్మాణం: కలైపులి ఎస్‌. థాను; సినిమాటోగ్రఫ్రీ: తెని ఈశ్వర్‌; నిడివి: 160 నిమిషాలు; ఎక్కడ చూడొచ్చు: అమెజాన్‌ ప్రైమ్‌

దళితుల జీవితాలను ప్రతిబింబిస్తూ కోలీవుడ్‌లో సినిమాలు రావడం కొత్తేమీ కాదు. వారి సమస్యల్ని, కష్టాల్ని, అణచివేత, దోపిడీలకు గురైన విధానాన్ని సాక్షాత్కారిస్తూ చాలా సినిమాలు వచ్చాయి. వెట్రిమారన్‌ ‘అసురన్’‌, పా రంజిత్‌ ‘కాలా’, మారి సెల్వరాజ్‌ ‘పరియేరుం పెరుమాళ్‌’, అంశన్‌ కుమార్‌ ‘మనుసంగదా’ లాంటి చిత్రాలు దళితుల సమస్యలను, వివక్షను బలంగానే చూపించాయి. ‘పరియేరుం పెరుమాళ్‌’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మారి సెల్వరాజ్ మరోసారి అలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకొని మళ్లీ హిట్టు కొట్టాడు. తమిళనాడులోని తుత్తుకూడి జిల్లా కొడియాంకులం అనే గ్రామంలో 1995లో జరిగిన కుల ఘర్షణ నేపథ్యాన్నే ఈ సినిమాకు కథగా ఎంచుకున్నాడు దర్శకుడు. ధనుష్‌ హీరోగా చేయగా, మలయాళీ నటుడు లాల్‌ ఓ ముఖ్యపాత్రను పోషించాడు. కామెడీ పాత్రలతో నవ్వించే యోగిబాబు ఇందులో ఓ సీరియస్‌ రోల్‌ చేయడం విశేషం. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందించాడు.

కథేంటంటే: తమిళనాడులోని ఓ మారుమూల గ్రామం. ఆ ఊరికి బస్టాప్‌ ఉండదు. ఊరి పొలిమేరల్లో నుంచే రోజూ బస్సు వెళ్తుంది. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న బస్సు ఎవరూ ఆపరు. ఆ ఊళ్లో ఉండేదంతా అణగారిన వర్గాలకు చెందిన వారు కావడంతో రాజకీయ నాయకులు పెద్దగా పట్టించుకోరు. పక్క ఊరి జనాలకు,  బస్సు కండక్ట్రర్‌కి కూడా ఈ ఊరి వాళ్లంటే చులకన. ఆర్మీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూ ఖాళీగా ఉండే యువకుడు కర్ణన్‌(ధనుష్‌). ఓ రోజు అతడు పట్నం నుంచి తిరిగి వస్తుండగా బస్సు ఆపమన్నందుకు గొడవ జరుగుతుంది. మీ ఊరొక శవాల దిబ్బ అని ఎగతాళి చేస్తాడు కండక్టర్‌. పక్క ఊరి బస్టాప్‌కు వెళ్లి కళాశాలకు వెళ్దామని ఓ యువతి ప్రయత్నిస్తే అక్కడి యువకులు అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఇదేంటని ప్రశ్నించినందుకు ఆ యువతి తండ్రిని రోడ్డు మీద పడేసి కొడతారు.  ఇలాంటి అవమానాలు, చావులు, ఛిద్రమైన కలలు ఇవన్నీ చూస్తూ పెరుగుతాడు కర్ణన్‌. బస్సులేని కారణంగా తమ ముందు తరం అవకాశాలు పోగొట్టుకోకూడదని బలంగా వాదిస్తాడు. ఊరు దాటి తమ జాతి ప్రజలు ఎదగాలని ఆశపడతాడు. ఓ రోజు నిండు గర్భిణి రోడ్డు మీద నొప్పులతో వేదన పడుతుంటే బస్సు ఆగకుండా వెళ్లిపోతుంది. దీంతో ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది. అప్పుడు కర్ణన్‌ ఏం చేశాడు? తన ఊరి ప్రజల కోసం అతను చేసిన పోరాటం ఏంటి? అందుకు కర్ణన్‌ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉంది: సినిమా అంతా 90ల నాటి తమిళ గ్రామీణ నేపథ్యంలో  సాగుతుంది. అక్కడి మనుషులు, వారి నమ్మకాలు, జీవన విధానాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. ఊరిలో అందరి పేర్లు మహాభారతంలోని పాత్రలవే ఉంటాయి. కథానాయకుడు కర్ణన్‌ అయితే, నాయిక పేరు ద్రౌపది. మరో ముఖ్య పాత్ర పేరు యమరాజ. తలలేని ఓ శిలను దేవుడిగా పూజించడమే కాకుండా అక్కడ జరిగే ఊరి జాతర కూడా కొత్తగా అనిపిస్తుంది. ప్రయాణ సదుపాయాలు లేకపోవడం కారణంగా వారు పడే కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తాయి. ఊళ్లో హింస చెలరేగినప్పుడు, పోలీసుస్టేషన్లో వారిని చితకబాదుతూ.. తక్కువ చేసి మాట్లాడే తీరు ఆనాటి సమాజంలో అసమానతలు ఏ రీతిని ఉన్నాయో చెబుతుంది. దర్యాప్తు కోసం వచ్చినప్పుడు ఆ గ్రామ పెద్ద తలదించుకోలేదని, తలపాగా చుట్టుకున్నాడన్న కోపంతో పోలీసు స్టేషన్‌లో చితకబాదే సన్నివేశం ఆవేశాన్ని రగిలిస్తుంది. ఇలాంటి సన్నివేశాలతో సినిమా చివరి వరకు రక్తి కట్టిస్తుంది. సినిమా పూర్తి తమిళ నేటివిటీకి దగ్గరగా ఉండటం, కొన్ని చోట్ల శ్రుతిమించిన నటన అతిగా అనిపిస్తుంది. అలాగే  మొదటి అర్ధభాగం నిదానంగా
సాగడం సినిమాకు కొంత మైనస్‌. కర్ణన్‌, ద్రౌపదిల మధ్య వచ్చే అందమైన ప్రేమ కథ చూసేందుకు బాగుంటుంది. కథనాయకుడు, యమరాజకు మధ్య వచ్చే సన్నివేశాలు, వారి మధ్య అనుబంధం సినిమాకు ప్రధాన బలం. ఇక సంతోష్‌ నారాయణన్‌ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో పాటల్ని జానపద కళాకారులతో పాడించాడాయన. నేపథ్య సంగీతం ఉత్కంఠను మరింత పెరిగేందుకు దోహద పడింది.

ఎవరెలా చేశారు: ధనుష్‌కు ఇలాంటి పాత్రలు చేయడం కొట్టిన పిండి. ఇలా అణిగి అణిగి తిరగబడే పాత్రల్లో తన నటనా సామర్థ్యం ఏంటో ‘అసురన్’‌, ‘వడా చెన్నై’, ‘పుదుపెట్టై’లాంటి చాలా సినిమాల్లో చూపించాడు. ఆ ఆవేశం, కసి, తిరుగుబాటు నైజాన్ని అవలీలగా తెరమీద పలికించాడు.  మలయాళ నటుడు లాల్ మరో గుర్తుండిపోయే పాత్రను చేశాడు ‌. యమరాజ పాత్రలో కర్ణన్‌కు అండగా నిలబడి, మార్గనిర్దేశనం చేసే ముసలి స్నేహితుడిగా ఆకట్టుకుంటాడు. ఈ సినిమాతోనే కోలీవుడ్‌ అరంగేట్రం చేసిన మలయాళ నటి రజిషా విజయన్‌ కూడా చూడ చక్కగా ఉంది.  ద్వితీయార్ధంలో ఈ పాత్రకు అంతగా ప్రాధాన్యముండదు. యోగిబాబు, గౌరీ మిగతా నటులు ఆయా పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు మారి సెల్వరాజ్‌ మరోసారి యాక్షన్‌ డ్రామాను ఎంచుకుని దానికి, సామాజిక సమస్యను జోడించాడు. 90ల కాలం ప్రతిబింబించేలా ప్రతి సన్నివేశాన్ని తీర్చిదిద్దారు. పాత్రలను తీర్చిదిద్దిన విధానం, కథ నడిపిన తీరు ఆకట్టుకుంంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని