వేడి ఉత్పత్తుల వల్ల జుట్టు పాడైందా? ఇలా రిపేర్ చేయండి! - tips to repair heat damaged hair at home in telugu
close
Updated : 16/06/2021 18:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేడి ఉత్పత్తుల వల్ల జుట్టు పాడైందా? ఇలా రిపేర్ చేయండి!

‘జుట్టున్నమ్మ ఏ కొప్పు వేసినా అందమే!’ అనేది పాత సామెత. చిన్న జుట్టైనా తమకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకోవడం కొత్త ట్రెండు! తాము ధరించిన దుస్తులకు నప్పినట్లుగా తమ వెంట్రుకల్ని స్ట్రెయిట్‌గా, కర్లీగా.. ఇలా ఎలా పడితే అలా చేసుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల హెయిర్‌స్టైలింగ్‌ టూల్స్‌ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే! ఇవి జుట్టు ఆరోగ్యానికి మంచివా, కావా అన్న విషయం పక్కన పెట్టి.. తాత్కాలికంగా తమ హెయిర్ స్టైల్ అందంగా కనిపిస్తే చాలనుకుంటున్నారు ఈతరం అమ్మాయిలు. నిజానికి వీటి నుంచి వెలువడే ఎక్కువ వేడి వల్ల జుట్టు సహజత్వాన్ని కోల్పోతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే వీలైనంత వరకు ఇలాంటి హెయిర్‌స్టైలింగ్‌ టూల్స్‌కి దూరంగా ఉండడమే మంచిదంటున్నారు. మరి, జరిగిందేదో జరిగిపోయింది.. ఇలా వేడి కారణంగా దెబ్బతిన్న జుట్టును తిరిగి పూర్వపు స్థితికి తెచ్చుకోలేమా? అంటే.. అందుకు కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు పాటించాలంటున్నారు.
హెయిర్‌స్టైలింగ్‌ టూల్స్‌ వల్ల జుట్టు అప్పటికప్పుడు అందంగా కనిపించచ్చు.. కానీ వీటి నుంచి వెలువడే అధిక వేడి కారణంగా కుదుళ్లు, జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. చివర్లు చిట్లిపోవడం, జుట్టు విపరీతంగా పొడిబారిపోవడం, గడ్డిలాగా బరకగా తయారవడం, ఎక్కడికక్కడ తెగిపోవడం.. వంటివన్నీ ఇదే కోవకు చెందుతాయని చెబుతున్నారు.


కొబ్బరి నూనె మాస్క్‌తో..!
తేమ కోల్పోయి పొడిబారిన జుట్టును తిరిగి రిపేర్‌ చేయడానికి కొబ్బరినూనె చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు సౌందర్య నిపుణులు. ఇది జుట్టు కోల్పోయిన తేమను తిరిగి అందించి వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలంగా పెరిగేలా చేస్తుందంటున్నారు. ఇందుకోసం.. కొబ్బరి నూనెతో తయారుచేసిన ఈ హెయిర్‌మాస్క్‌ ప్రయత్నించమంటున్నారు. ఒక టేబుల్‌స్పూన్‌ ఆర్గాన్‌ ఆయిల్‌, రెండు టేబుల్‌స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక విటమిన్‌ ‘ఇ’ క్యాప్సూల్‌, కొద్దిగా షియా బటర్‌ వేసి.. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి గంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల వేడి వల్ల డ్యామేజ్‌ అయిన జుట్టు తిరిగి తేమను సంతరించుకుంటుంది.. ఈ చిట్కా జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలకు దోహదం చేస్తుంది.


షాంపూ ఇంట్లోనే!
బయట దొరికే షాంపూలు వాడడం వల్ల జుట్టు మరింత డ్యామేజ్‌ అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ఇంట్లోనే సహజసిద్ధమైన పదార్థాలతో షాంపూ తయారుచేసుకోమని చెబుతున్నారు నిపుణులు. ఇందుకోసం..
* డిస్టిల్డ్‌ వాటర్‌ - అరకప్పు
* లిక్విడ్‌ క్యాస్టైల్‌ సోప్‌ - బాటిల్‌లో సగం మోతాదులో తీసుకోవాలి (ఇది మార్కెట్లో దొరుకుతుంది)
* కలబంద గుజ్జు - అరకప్పు
* విటమిన్‌ ఇ నూనె - 10 చుక్కలు
* వెజిటబుల్‌ గ్లిజరిన్‌ - 2 టీస్పూన్లు
* ఏదైనా అత్యవసర నూనె - కొన్ని చుక్కలు
వీటన్నింటినీ ఒక బాటిల్‌లోకి తీసుకొని బాగా కలిసేంత వరకు షేక్‌ చేయాలి. ఇలా తయారుచేసుకున్న షాంపూను తలస్నానం చేసే ముందు జుట్టుపై మర్దన చేసుకొని కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై చల్లటి నీటితో తలస్నానం చేయాలి. ఈ సహజసిద్ధమైన షాంపూ డ్యామేజ్‌ అయిన జుట్టును రిపేర్‌ చేయడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది.


మీది కర్లీ హెయిరా?
ఉంగరాల జుట్టున్న వారి వెంట్రుకలు సాధారణంగానే పొడిబారినట్లుగా, గడ్డిలాగా కనిపిస్తాయి. అలాంటి వారు తమ జుట్టుకు హీటింగ్‌ ఉత్పత్తుల్ని వాడితే అది మరింత డ్యామేజ్‌ అవుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఎప్సం సాల్ట్‌ చక్కటి ప్రత్యామ్నాయం అని చెబుతోంది ఓ అధ్యయనం. ఇందుకోసం.. కండిషనర్‌, ఎప్సం సాల్ట్‌.. రెండింటినీ సమాన పరిమాణాల్లో తీసుకొని కొద్దిగా వేడిచేయాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ మిశ్రమంతో కుదుళ్లు, జుట్టుపై మునివేళ్లతో మర్దన చేయాలి. ఆపై అరగంట పాటు అలాగే ఉంచుకొని.. చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఈ చిట్కా వల్ల పొడిబారిన కుదుళ్లు, జుట్టు తిరిగి తేమను సంతరించుకుంటాయి.


కెఫీన్‌తో రిపేర్!
బ్లో డ్రయర్స్‌, ఇతర హెయిర్‌స్టైలింగ్‌ టూల్స్‌ వల్ల జుట్టు చిక్కులు కడుతుంది. ఇలాంటి జుట్టును రిపేర్‌ చేయడం టీతోనే సాధ్యమంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా.. కొన్ని తేయాకులు/టీ పొడిని నీటిలో వేసి మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక జుట్టు, కుదుళ్లపై నుంచి పోసి.. ఆపై జుట్టుకు టవల్‌ చుట్టేయాలి. ఇలా ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని ఆపై చల్లటి నీటితో తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఈ టీ మిశ్రమంలోని కెఫీన్‌ జుట్టుకు, కుదుళ్లకు సహజసిద్ధమైన తేమను అందిస్తుంది. అలాగే వెంట్రుకల ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.

ఇలా చేయండి!
   * జుట్టు తత్వాన్ని బట్టి నాణ్యమైన హెయిర్‌ సీరమ్‌ మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని వాడినా వేడి వల్ల డ్యామేజ్‌ అయిన జుట్టును తిరిగి రిపేర్‌ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ విషయంలో మీకేమైనా సందేహాలుంటే సౌందర్య నిపుణుల సలహాలు తీసుకోవచ్చు.
* రోజువారీ తీసుకునే ఆహారంతో కూడా డ్యామేజ్‌ అయిన జుట్టును తిరిగి రిపేర్‌ చేసుకోవచ్చు. ఈ క్రమంలో సీజనల్‌ పండ్లు, ఆకుకూరలు, ఆకుపచ్చటి కాయగూరలు, ఉసిరి.. వంటివి క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
* జుట్టు డ్యామేజ్‌ కాకుండా ఉండాలంటే సాధ్యమైనంతవరకు వేడి ఉత్పత్తుల్ని వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఒకవేళ వాడాల్సి వస్తే.. వెంట్రుకలు పాడవకుండా ముందుగా సన్‌స్క్రీన్‌ హెయిర్‌ స్ప్రే, హెయిర్‌ జెల్‌.. వంటివి రాసుకొని ఆపై హెయిర్‌స్టైలింగ్‌ టూల్స్ ఉపయోగిస్తే కొంత వరకు మేలు జరుగుతుందంటున్నారు.

మరో ముఖ్య విషయం ఏంటంటే.. జుట్టు ఆరోగ్యం కోసం మీరు వాడే ఉత్పత్తుల విషయంలో మీకు ఎలాంటి సందేహాలున్నా, ఏ జుట్టు తత్వానికి ఎలాంటి ఉత్పత్తులు వాడాలో తెలియకపోయినా నిపుణుల సలహా తీసుకుంటే మరీ మంచిది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని