హైదరాబాద్‌ కోసం కదిలిన తారాలోకం - tollywood celebrities contribution to telangana CM relief fund
close
Published : 21/10/2020 05:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌ కోసం కదిలిన తారాలోకం

ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాలు

హైదరాబాద్‌: భారీ వర్షాలతో అల్లాడుతున్న భాగ్యనగరం కోసం తారాలోకం కదిలివచ్చింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో బాధితుల సహాయార్థం తెలుగు చలనచిత్ర సీమ ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటించారు. మొదట నాగార్జున తన వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళం అందించబోతున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఆపై చిరంజీవి, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, విజయ్‌ దేవరకొండ, త్రివిక్రమ్‌, హరీష్‌ శంకర్‌ తదితరులు విరాళాల్ని ప్రకటించారు. వీరందరికీ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో ధన్యవాదాలు తెలిపారు.


‘గడిచిన వందేళ్లలో ఎప్పుడూలేని విధంగా కుండపోతగా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్‌ అతలాకుతలం అయిపోయింది. అపార ప్రాణ నష్టంతోపాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి బీభత్సంతో అల్లాడిపోతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.కోటి విరాళం ప్రకటిస్తున్నా. ఈ సందర్భంగా ఎవరికి వీలైనంత సాయం వాళ్లు చేయాలని కోరుతున్నా’

- చిరంజీవి


‘భారీ వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్‌లో నివసిస్తున్న కొంత మంది జీవితాలు సర్వనాశనం అయ్యాయి. తక్షణ సహాయ చర్యల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.550 కోట్లు విడుదల చేయడం ప్రశంసించదగ్గ విషయం. నేను కూడా నా వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నా. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళంగా అందించబోతున్నా’

- నాగార్జున


‘తెలంగాణలో భారీ వర్షపాతం వల్ల సంభవించిన ఈ వినాశనాన్ని మనం ఎప్పుడూ ఊహించలేదు. బాధిత కుటుంబాల్ని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టడం అభినందించాల్సిన విషయం. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళంగా అందిస్తున్నా. ఈ మంచి పనిలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నా. ఇటువంటి కష్ట సమయంలో మనతోటి వారిని ఆదుకుందాం’

- మహేశ్‌బాబు


‘వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్‌లోని అనేక మంది జీవితాలు సమస్యల్లో పడ్డాయి. నావంతుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళం ప్రకటిస్తున్నా. మనమంతా కలిసి హైదరాబాద్‌ను తిరిగి నిర్మించుకుందాం’

- ఎన్టీఆర్‌


‘తెలంగాణలో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో ఎన్నో ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సహాయార్థం తెలంగాణ సీఎం సహయనిధికి నా వంతు సాయంగా కోటిన్నర రూపాయలు అందిస్తున్నా’

- ప్రభాస్‌ 


‘వరదల సమయంలో కేరళ, చెన్నై కోసం మనమంతా ఒక్కటయ్యాం. కరోనా కష్ట కాలంలో ఒకరికొకరుగా నిలిచాం. ఇప్పుడు మన నగరానికి, మన ప్రజలకు చేయూత కావాలి. అందుకే ముఖ్యమంత్రి  సహాయనిధికి రూ.10 లక్షలు విరాళం పంపిస్తున్నా ’

- విజయ్‌ దేవరకొండ


‘హైదరాబాద్‌కు తీరని నష్టం జరిగింది. ఇటువంటి సమయంలో బాధితుల సహాయార్థం నా వంతు సాయంగా రూ.5 లక్షల విరాళం ప్రకటిస్తున్నా’ అని హరీశ్‌ శంకర్‌ అన్నారు. అదే విధంగా దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు.


అధిక వర్షాల కారణంగా హైదరాబాద్‌ అతలాకుతలమయింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వాన చినుకులు పడటం మొదలైతే నగర వాసుల్లో ఆందోళన నెలకుంటోంది.

* ‘తెలంగాణ ప్రజల గురించి చాలా ఆందోళన చెందుతున్నా. మంత్రి కేటీఆర్‌ గారు మొదటి రోజు నుంచి నేరుగా బాధితుల సమస్యలు తెలుసుకుని, సహాయక చర్యలు చేపట్టడం గొప్ప విషయం. ముఖ్యమంత్రి సహాయ నిధికి నా వంతుగా రూ.25 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నా’- కథానాయకుడు రామ్‌
* హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ వరద బాధితుల సహాయార్థం రూ.10 లక్షల విరాళం ప్రకటించింది. 
* తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి నిర్మాత బండ్ల గణేశ్‌ రూ.5 లక్షలు, దర్శకుడు అనిల్‌ రావిపూడి రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు.
* వరద బాధితుల కోసం ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ 1000 కిలోల బియ్యం, 500 దుప్పట్లు పంపింది. ‘స్ఫూ్ర్తి ఫౌండేషన్‌’ ద్వారా వీటిని బాధితులకు అందించనున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని