Proning: కరోనా జయించిన 82 ఏళ్ల బామ్మ - up 82 year old woman beat corona with proning
close
Updated : 30/04/2021 12:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Proning: కరోనా జయించిన 82 ఏళ్ల బామ్మ

గోరఖ్‌పూర్‌: రెండో దశలో కరోనా నేరుగా శ్వాసవ్యవస్థపై దెబ్బకొడుతుంటడంతో ప్రాణవాయవుకు డిమాండ్‌ పెరుగుతున్న వేళ.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ 82 ఏళ్ల బామ్మ ఆక్సిజన్‌ అవసరం లేకుండానే వైరస్‌ను జయించారు. ‘ప్రోనింగ్‌’ పద్ధతిలో ఆక్సిజన్‌ స్థాయులను పెంచుకుని కేవలం 12 రోజుల్లోనే కరోనా నుంచి క్షేమంగా బయటపడ్డారు. 

గోరఖ్‌పూర్‌ జిల్లాలోని అలీనగర్‌ ప్రాంతానికి చెందిన 82ఏళ్ల విద్య శ్రీవాస్తవ ఇటీవల కరోనా బారినపడ్డారు. దీంతో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు. ఒక రోజు ఆమె ఆక్సిజన్‌ స్థాయులు 79కి పడిపోయాయి. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఆసుపత్రిలో చేర్చకుండా ఆమెను మంచంపై బోర్లా పడుకోబెట్టారు. ప్రోనింగ్ పద్ధతిలో శ్వాస తీసుకునేలా చూసుకున్నారు. దీంతో నాలుగు రోజులు తిరగకుండానే ఆమె ఆక్సిజన్‌ స్థాయులు 94కు చేరుకున్నాయని విద్య కుమారుడు హరిమోహన్‌ తెలిపారు. ఆక్సిజన్‌ సిలిండర్ అవసరం లేకుండానే ప్రోనింగ్‌తో తన తల్లి శ్వాసవ్యవస్థ మెరుగుపడిందని చెప్పారు. అలా కేవలం 12 రోజుల్లోనే విద్య కరోనా నుంచి కోలుకున్నారు.

కరోనా రాగానే చాలా మంది ఒకింత ఆందోళనకు గురవుతుంటారు. అలా కాకుండా మనోధైర్యంతో ఉంటూ వైద్యుల సూచనలు తప్పకుండా పాటిస్తే ఇంట్లోనే వైరస్‌ను జయించొచ్చని చెప్పేందుకు ఈ బామ్మే ఉదాహరణ. 

ఏంటీ ప్రోనింగ్‌.. ఎలా చేయాలి..

ఛాతి, పొట్టభాగంపై బరువుపడే విధంగా (బోర్లా) పడుకోవడం లేదా ఒక పక్కకు పడుకొని శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు పూర్తిస్థాయిలో ఆక్సిజన్‌ చేరుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల సూచించింది. ‘ప్రోనింగ్‌’గా పిలిచే ఈ విధానం వైద్యపరంగా ధ్రువీకరణ పొందిందని పేర్కొంది. ముఖ్యంగా ఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్‌ రోగులకు ‘ప్రోనింగ్‌’ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది.

* మొదట మంచంపై బోర్లా పడుకోవాలి.

* ఒక మెత్తటి దిండు తీసుకుని మెడ కిందభాగంలో ఉంచాలి.

* ఛాతి నుంచి తొడ వరకూ ఒకటి లేదా రెండు దిండ్లను ఉంచవచ్చు.

* మరో రెండు దిండ్లను మోకాలి కింద భాగంలో ఉండేలా చూసుకోవాలి. ఇక ఎక్కువ సమయం పడకపై ఉండే రోగులకు రోజంతా ఒకేవిధంగా కాకుండా పలు భంగిమల్లో విశ్రాంతి తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ఒక్కో స్థానంలో 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పడుకోవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

* భోజనం చేసిన తర్వాత గంట వరకు ప్రోనింగ్‌ చేయవద్దు.

* తేలికగా, సౌకర్యవంతంగా అనిపించినంత వరకు మాత్రమే ప్రోనింగ్‌ చేయండి.

* పలు సమయాల్లో రోజులో గరిష్ఠంగా 16 గంటల వరకు ప్రోనింగ్‌ చేయవచ్చు.(వైద్యుల సూచనల మేరకు)

* హృద్రోగ సమస్యలు, గర్భిణిలు, వెన్నెముక సమస్యలున్నవారు ఈ విధానానికి దూరంగా ఉండాలి.

* ప్రోనింగ్‌ సమయంలో దిండ్లను సౌకర్యవంతంగా ఉండేలా ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు.

ప్రయోజనాలు..

* ప్రోనింగ్‌ పొజిషన్‌ వల్ల శ్వాసమార్గం సరళతరమై గాలి ప్రసరణ మెరుగవుతుంది.

* ఆక్సిజన్‌ స్థాయులు 94శాతం కంటే తక్కువకు పడిపోతున్న సమయంలోనే ప్రోనింగ్‌ అవసరం.

* ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ స్థాయులు, రక్తంలో చక్కెర స్థాయులను పరిశీలించడం ఎంతో ముఖ్యం.

* మంచి వెంటిలేషన్‌, సకాలంలో ‘ప్రోనింగ్‌’ చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని