Tollywood: అడవి బాట పట్టిన తెలుగు హీరోలు.. ఇప్పుడు ఇదే ట్రెండ్‌! - upcoming tollywood movies based on forest background
close
Published : 07/09/2021 13:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: అడవి బాట పట్టిన తెలుగు హీరోలు.. ఇప్పుడు ఇదే ట్రెండ్‌!

అడవి.. జంతువులు/పక్షులకు నివాసం.. ఔషధ మొక్కలకు ఆలవాలం.. అది పచ్చగా ఉంటేనే మానవాళికి జీవన గమనం.. ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు అడవే కథా వస్తువు. రామాయణం, భారతం గాథ ఏదైనా అడవిని దాటి రావాల్సిందే. తెలుగు కథలకు కమర్షియాలిటీకి అడవి అదనపు బలం. మారుతున్న కాలం, ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా ట్రెండ్‌ మారుతూ అడవి నేపథ్యంలో అనేక సినిమాలు తెరకెక్కాయి. మళ్లీ చాన్నాళ్లకు ఇప్పుడు అరణ్యంలో సందడి మొదలైంది. మన దర్శక-నిర్మాతలు అడవి బాట పట్టారు. ముఖ్యంగా ‘మెగా’ హీరోలు నటిస్తున్న చిత్రాలు అధికభాగం అడవి నేపథ్యంలో సాగేవే. ప్రస్తుతం టాలీవుడ్‌లో అడవి నేపథ్యంగా రాబోతున్న ఆ సినిమాలేంటో చూద్దామా!

జక్కన్న అడవి దారి

కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రూ. 400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రాజమౌళి దీన్ని తెరకెక్కిస్తున్నారు. కొమరం భీమ్‌, అల్లూరి ఇద్దరి జీవితాలు అడవితో పెనవేసుకున్నవే. వారిద్దరూ మన్యం, గిరిజన గూడేల్లో చైతన్యం నింపిన వీరులు. అందుకే ఈ సినిమా సింహభాగం చిత్రీకరణ అడవిలోనే సాగింది. విడుదలైన టీజర్‌, మేకింగ్‌ వీడియోల్లోనూ ఈ విషయం తెలిసిపోతోంది. క్లైమాక్స్‌లో వచ్చే పోరాటాలు హోరాహోరీగా జరగనున్నాయి. ఈ ఫైట్లు ఒళ్లు గగురుపొడవటమే కాదు, ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తాయని కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ చెప్పేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ప్రేక్షకులకు అడవిలో పసందైన వినోద విందు దక్కనుందని తెలిసిపోతుంది. ఈ చిత్రం కోసం బాలీవుడ్‌ నుంచి నటీనటులు, హాలీవుడ్‌ నుంచి సాంకేతిక నిపుణులు చేరడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. 


క్లాస్‌లో పాఠాలు.. అడవిలో గుణపాఠాలు

చిరంజీవి కథానాయకుడిగా శివ కొరటాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ కథానాయిక. రామ్‌చరణ్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. దేవాదాయశాఖలో జరిగే అన్యాయాలపై పోరాడే ‘ఆచార్య’గా చిరంజీవి కనిపించనున్నారు. ఇక ఆయనకు తోడు ‘సిద్ధ’ పాత్రలో రామ్‌చరణ్‌ నక్సలైట్‌గా పోరాటం చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పోస్టర్‌లు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అడవిలో జరిగే యాక్షన్‌ సన్నివేశాలు, ఛేజింగ్‌లు మాస్‌తో విజిల్స్‌ వేస్తాయని టాక్‌. మరి అడవిలో తండ్రీకొడుకులు చేసే యుద్ధం చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!


‘పుష్పరాజ్‌’ ఎర్రచందనం వేట

సుకుమార్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్‌ డ్రామా ‘పుష్ప’. మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌గా భయపెట్టనున్నాడు. ఇది కూడా పూర్తిగా అడవిలో జరిగే క్రైమ్‌ కథతో తెరకెక్కుతోంది. ఎర్రచందనం స్మగ్లర్‌ పుష్పరాజ్‌గా బన్నీ ఓ భిన్నమైన రోల్‌ని పోషిస్తున్నారు. మొత్తం రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎర్రచందనాన్ని దొంగిలించే క్రమంలో వచ్చే పోరాట సన్నివేశాలు ఊహకందవని అంటున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటే హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’ పాటతో సినిమాకు హైప్‌ పెరిగింది. పోస్టర్లతో అభిమానులకు కాక పుట్టిస్తున్న పుష్ప తొలిభాగాన్ని డిసెంబరులో  విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక కథానాయిక.


‘భీమ్లా నాయక్‌’ అరణ్య వాసం

పవన్‌ కల్యాణ్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. ఈ సినిమా కొంత భాగం అడవి నేపథ్యంలోనే సాగనుంది. ఇందులో పవన్‌ పోలీసాఫీసర్‌ ‘భీమ్లానాయక్‌’గా కనిపిస్తున్నారు. మాతృక చిత్రమైన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’లో కేరళ ఆదివాసి మహిళలు, అక్కడి జీవన విధానాన్ని చిత్ర దర్శకుడు శచి అద్భుతంగా చిత్రీకరించారు. కేరళ గిరిజనులు మాట్లాడుకునే ఇరుల భాషలోనే పాటలు కూడా ఉన్నాయి. అవి  సూపర్‌ హిట్‌గా నిలిచాయి.  ‘భీమ్లానాయక్‌’లోనూ దర్శకుడు సాగర్‌ కె. చంద్ర నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని , అక్కడి జీవన విధానాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. పవన్‌ కల్యాణ్‌ ఇందులో పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడనే విషయం తాజాగా విడుదలైన టీజర్‌ చూస్తే తెలిసిపోతుంది. మాతృకలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన పాత్రలో రానా నటించనున్నారు.


కొండపొలం కుర్రాడి కథ

సన్నపురెడ్డి వెంకట్‌రెడ్డి రాసిన నవల కొండపొలం. పాఠకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ నవల ఇప్పుడు దృశ్యరూపం దాల్చబోతోంది.  క్రిష్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. అడవి నేపథ్యంలోనే సాగే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరో హీరోయిన్లు. అడవిలో హీరో  చేసే సాహసాలు అదిరిపోయేలా ఉంటాయని సమాచారం.  ఇటీవలే విడులైన టీజర్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. వికారాబాద్‌ అడవుల్లో సినిమా షూటింగ్‌ జరుపుకొంది.  ఈ సినిమా కోసం కీరవాణి స్వరపరిచిన ఓబులమ్మ పాట కూడా అడవిలో దొరికే పుట్టతేనెలా మధురంగా ఉంది. అడవి జీవితం, అక్కడి అందాలను మరింత అందంగా ‘కొండపొలం’లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు క్రిష్‌.


వనంలో విప్లవం

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా ‘విరాట పర్వం’ తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం 90లనాటి కథాంశాన్ని ఎంచుకున్నారు.  ఇందులో రానా నక్సలైట్‌ గా కనిపించనున్నారు. అరణ్యంలో జరిపే పోరాటాలు ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం.  ఇందులో ఓ అందమైన ప్రేమకథనూ భాగం చేశారు దర్శకుడు వేణు.  ప్రేమించినవాడిని వెతుక్కుంటూ సాయిపల్లవి అరణ్యంలోకి వెళ్తుందని ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది. అడవిలో ఆ ప్రేమ, విప్లవాల కలయిక ఎంత మేరకు అలరిస్తుందో తెలియాలింటే సినిమా చూసి తీరాల్సిందే. ప్రియమణి కామ్రేడ్‌ భారతక్కగా నటిస్తుండగా బాలీవుడ్‌ నటి నందితాదాస్‌ మరో కీలక పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘విరాటపర్వం’ విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. రానా హీరోగా ఈ ఏడాది ‘అరణ్య’ అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో ఎంచుకున్న కథాంశం, రానా నటనలకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.  అరణ్యాల నేపథ్యంలో సినిమాలు తెరకెక్కిస్తూ అడవి పరిమళాన్ని తెరకు అద్దుతుండటం ఇప్పటి ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందంటున్నారు టాలీవుడ్‌ నిపుణులు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని