ఆయన లేకపోతే ‘ఉప్పెన’ ఒంటరయ్యేది: బుచ్చిబాబు - uppena director buchibabu interview
close
Updated : 10/02/2021 21:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయన లేకపోతే ‘ఉప్పెన’ ఒంటరయ్యేది: బుచ్చిబాబు

చిత్రం అందరి హృదయాలను బరువెక్కిస్తుంది

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరీక్ష రాసి.. ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విద్యార్థిలాంటిదే తన పరిస్థితి. అందరికీ టెన్షన్‌ ఉంటుంది. కాకపోతే తనకు కొంచెం ఎక్కువే ఉంటుందట. తొలి సినిమా.. అదీ విడుదలకు ముందే తెలుగు చిత్రసీమలో అందరి నోటా నానుతున్న డైరెక్టర్‌ బుచ్చిబాబు సాన చెబుతున్న మాటలివి. మట్టిలో నుంచి పుట్టిన కథలను అందరూ ఇష్టపడతారు. అందుకే అందరూ మెచ్చే అలాంటి కథతో  సినిమా తీశానంటున్నారాయన. సుకుమార్‌ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన తొలిసారి దర్శకత్వం వహించి  ఉప్పెనను తెరకెక్కించారు. మెగా హీరో వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా నటిస్తున్న ఈ ప్రేమకథా చిత్రంలో మక్కళ్‌ సెల్వన్‌ విజయ్‌సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 12 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అదంతా ఆయన మాటల్లోనే..

మా ఇంటి గడప నుంచే కథలు వెతుకుతా..

నేను సుకుమార్‌ గారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసేటప్పుడే చాలా కథలు రాసుకున్నాను. నేను మా ఇంటి గడప నుంచి వెతకడం మొదలుపెడతా. మా ఇల్లు,  ఎదురిల్లు, వీధి, ఊరు.. ఇలా అక్కడే ఎన్నో అందమైన కథలు దొరుకుతాయి. నా కథలు సుకుమార్‌గారికి కూడా చెప్పాను. ఇంకా రాయ్‌ చూద్దాం అనేవారు. ‘రంగస్థలం’ తీసేటప్పుడు ఆయనకు ఈ కథ చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. చాలా బాగుందని మెచ్చుకున్నారు కూడా. తమిళ సినిమాలు చూసేటప్పుడు.. మన తెలుగులో ఇలాంటి సినిమాలు ఎందుకు రావడం లేదు అనిపించేది. అయితే.. అన్ని కథలకు ఆ బ్యాక్‌డ్రాప్‌ సెట్‌కాదు. మా అదృష్టం కొద్ది ఈ సినిమాకు సెట్‌ అయింది. 

సుకుమార్‌ అసిస్టెంట్‌ అంటేనే నాకిష్టం..

ఇంటర్మీడియట్‌లో సుకుమార్‌ గారు మాకు మ్యాథ్స్‌ టీచర్‌. ‘సినిమాల్లోకి వెళతాను’ అని ఆయన కొంతమందితో మాత్రమే చెప్తుండేవారు. ఆ నలుగురైదుగురిలో నేనొకడిని. అలా ఆయనతో కలిసి సినిమాలకు వెళ్లడం, ఆయన రాసుకున్న కథలు వినేవాడిని. ఆయన దగ్గర.. ఆర్య2, 100%లవ్‌, కుమారి21ఎఫ్‌, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, 1నేనొక్కడినే సినిమాలకు పనిచేశాను. ఎంబీఏ చేస్తూనే ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేశాను. మా ఊరిలో నన్ను సుకుమార్‌ అనే పిలుస్తుంటారు. ఇరవయేళ్ల నుంచి ఆయన దగ్గర ఉంటున్నాను. ఆయన నాకు ఏ సమయంలో ఎంత ఇవ్వాలో అంతా ఇస్తూ వస్తున్నారు. ఈ భూమ్మీద మా గురువులా స్క్రిప్టు ఆలోచించేవారు మరెవరూ లేరు. బుచ్చిబాబు డైరెక్టర్‌ అనేదానికంటే.. సుకుమార్‌ అసిస్టెంట్‌ అంటేనే పేరెక్కువ.. నాకిష్టం. ఆయన బ్యానర్‌లో సినిమా చేయడం నా అదృష్టం. 

ప్రేమకు హద్దులు లేవని చెప్పడమే ఈ కథ ఉద్దేశం. సినిమాకు సెన్సార్‌ ఒక్క కట్‌ కూడా చెప్పలేదు.

ఆ ఇద్దర్నీ అందుకే తీసుకున్నా..

ఈ కథకు కొత్త కుర్రాడు కావాలి. కథ రాసిన తర్వాత ఎవరైతే ఈ సినిమాకు న్యాయం చేయగలరని వెతకడం మొదలుపెట్టాను. మెగాఫ్యామిలీ నుంచి వైష్ణవ్‌తేజ్‌ ఈ కథకు బాగా నప్పుతాడని అనిపించింది. ఆయనకు కథ చెప్పాను. నిజానికి వైష్ణవ్‌ లేకపోతే ‘ఉప్పెన’ ఒంటరి అయిపోయేది. అంతబాగా చేశాడు. ఈ కథను జాతీయస్థాయిలో చెప్పాలనుకున్నా. అందుకే విజయ్‌సేతుపతిగారిని తీసుకున్నాను. కథ విన్న తర్వాత ఆయన కూడా చాలా సంతోషించారు. ఈ సినిమా ‘96’ కంటే పెద్ద హిట్‌ కొట్టబోతుందని చెప్పారు. ఈ కథ ఎవరికి చెప్పినా సరే ఈ సినిమాలో విజయ్‌సేతుపతి విలన్‌ అని ముందునుంచి చెప్తూ వస్తున్నా. చిరంజీవిగారికి కథ చెప్పగానే.. ‘హిట్‌ ఫార్ములా ముందే రాసేశావ్‌’ అన్నారు. ‘వైశూ.. ఈ సినిమా నువ్వు తీస్తావా లేక నేను తీయనా..?’ అన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కథ ఎలాంటిదో. రేపు పొద్దున సినిమా చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. 

ఎన్టీఆర్‌కు చెప్పిన కథ వేరే..

ఎన్టీఆర్‌కు ఈ కథ చెప్పలేదు. నాన్నకు ప్రేమతో సమయంలో వేరే కథ చెప్పాను. అది కూడా బాగుందని ఆయన మెచ్చుకున్నారు. అక్కడి నుంచి ఏ హీరోకైనా కథ చెప్పగలననే ధైర్యం వచ్చింది. నేను చేసే ప్రతి కథ అందరికీ నచ్చుతుందని నమ్ముతా. ఎందుకంటే నేను రాసేది మట్టిలో నుంచి పుట్టిన కథలు. మీకు సినిమా చూస్తున్నట్లు అనిపించదు. అందరూ కథలో లీనమైపోతారు. క్లైమాక్స్‌ మాత్రం అందరి హృదయాలను కచ్చితంగా బరువెక్కిస్తుంది.

చిన్నప్పుడు నేను సినిమాకు వెళితే పదిమందికి సినిమా కథ వివరించేవాడిని

కృతివాళ్ల అమ్మగారు డైలాగులు చెప్పేవారు..

నాలోపల మూడునాలుగేళ్ల నుంచి ఉన్న పాత్రలను నటుల్లో ఎక్కించడం అంటే అంత సులభం కాదు. యాక్టింగ్‌లో వైష్ణవ్‌కు కొంతైనా అనుభవం ఉంది. కానీ.. కృతికి ఏమాత్రం లేదు. రోజూ ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి నేర్పించాల్సి వచ్చింది. ఆమెకు నేర్పించే క్రమంలో కృతివాళ్ల అమ్మగారు కూడా డైలాగ్‌లు మొత్తం నేర్చుకున్నారు(నవ్వుతూ). అయితే.. సినిమాలో హీరోహీరోయిన్లు ఇద్దరూ ఎన్నో సినిమాల అనుభవం ఉన్నవాళ్లలా చేశారని చాలా మంది అంటున్నారు.

తర్వాత సినిమా ఓ పెద్ద హీరోతో మైత్రీ మూవీస్‌తో కలిసి చేస్తున్నాను

ఉప్పెన కోరుకుంది కాబట్టే.. సేతుపతి గారు చేశారు

విజయ్‌సేతుపతి ఈ సినిమా చేస్తారా.. చేయరా..? అనే అనుమానమే నాకు రాలేదు. ఒకవేళ ఆయన చేయకపోతే ఎవర్ని అడగాలనే ప్రశ్న కూడా తలెత్తలేదు. చిరంజీవి గారు అడిగినా అదే చెప్పాను. సుకుమార్‌ గారికి.. వైష్ణవ్‌కు కూడా విజయ్‌ చేస్తారనే చెప్పాను. ఆయనకు కథ చెప్పిన తర్వాత ఆయన కూడా చేస్తానన్నారు. ఈ సినిమా విజయ్‌గారితో మొదలై.. ఆయనతోనే ఇంటర్వెల్‌ పడటంతో పాటు ఆయనతోనే ముగుస్తుంది. ఆయనను ఈ సినిమాకు ఎందుకు తీసుకున్నామో.. సినిమాలో క్లైమాక్స్‌ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఉప్పెన కోరుకుంది కాబట్టే.. సేతుపతి గారు చేశారు. 

ఈ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. కూతురిది ఉప్పెనంత ప్రేమ. తండ్రిది ఉప్పెనంత కోపం

రెమ్యునరేషన్‌ అసలే తీసుకోలేదు
సాయిచంద్‌గారి పాత్ర ఈ సినిమాలో కొన్నిసార్లు విజయ్‌సేతుపతిని డామినేట్‌ చేస్తుంది. ఆయనకు కథ నచ్చడంతో ఈ సినిమాకు ఆయన రెమ్యునరేషన్‌ కూడా తీసుకోలేదు. చెక్‌ పంపించి ప్లీజ్‌ తీసుకోండి సర్‌.. అని బ్రతిమాలినా సరే వద్దన్నారు. 

సినిమా ఇప్పటి వరకూ 70నుంచి 100 మంది చూశారు. అందరూ బాగుందని చెప్పినవాళ్లే. ట్రైలర్‌ చూసినప్పుడు ఎన్టీఆర్‌ ‘తెలిసిపోతుందిరా హిట్‌’ అన్నారు

అందుకే సంగీతం అంటే నాకు అంత ఇష్టం..

సముద్రం చాలా ఎమోషన్స్‌ను చూపిస్తుంది. సముద్రం పక్క నుంచి వచ్చిన వాళ్లంతా గొప్ప సంగీత దర్శకులు అవుతారు. ఏఆర్‌ రెహమాన్‌, ఇళయరాజా, దేవీశ్రీప్రసాద్‌గారు అలాంటి వాళ్లే. నాక్కూడా సంగీతం అంటే చాలా ఇష్టం. కొన్ని వేల పాటలను లిరిక్స్‌తో పాటు పాడేస్తా. చెన్నై వెళ్లి దేవిశ్రీప్రసాద్‌గారికి కథ చెప్పాను. అయిపోగానే డీఎస్పీ సుకుమార్‌గారికి ఫోన్‌ చేశారు. ‘మిమ్మల్ని పొగడాలా..?మీ శిష్యుడిని పొగడాలా..?’ అన్నారు.

ఇవీ చదవండి..

రూ.75 వేల సంపాదన వదిలి రూ.500లకు పనిచేసి..!

ట్రెండింగ్‌లో ‘లైగర్‌’.. ఎందుకంటే?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని