మరో ‘రంగస్థలం’ కాబోతుంది: చిరంజీవి - uppena pre release event
close
Updated : 07/02/2021 00:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో ‘రంగస్థలం’ కాబోతుంది: చిరంజీవి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఉప్పెన’ చిత్రం మరో ‘రంగస్థలం’ కాబోతుందని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ చిత్రం ప్రిరిలీజ్‌ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పేరుకు చిన్న సినిమానే అయినప్పటికీ భారీ అంచనాలతో ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తొలుత పాటలతో సంగీతప్రియులను ఉర్రూతలూగించిన ‘ఉప్పెన’.. ఆ తర్వాత ట్రైలర్‌తోనూ యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొట్టింది. మెగా హీరో వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. రాక్‌స్టార్‌ దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందించారు. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడారు.. ‘సుకుమార్‌తో కలిసి బుచ్చిబాబు మా ఇంటికి వచ్చి కథ చెప్పినప్పుడు ఇన్నాళ్లు ఇంతమంచి కథ ఎవరికీ ఎందుకు తట్టలేదా అన్న అనుమానం వచ్చింది. ఈ సినిమా మరో ‘రంగస్థలం’ అవుతుంది. ఎన్నోరకాల ప్రేమకథలు చూశాం. ఒక గొప్ప కథను బుచ్చిబాబు ‘ఉప్పెన’ ద్వారా మనకు చూపించబోతున్నాడు. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంది. కొత్తవాడైనా సరే చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాకు ఎంతో శ్రమించాడు డైరెక్టర్‌. బుచ్చిబాబును చూస్తుంటే దర్శక దిగ్గజం భారతీరాజ గుర్తొస్తున్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు మాత్రమే కాదు.. సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా చూడాల్సిన చిత్రం ఇది. ఇక ఈ సినిమాలో గొప్పగా మాట్లాడాలి అంటే మక్కల్‌సెల్వన్‌  విజయ్‌ సేతుపతి గురించి తప్పకుండా మాట్లాడాలి. భారతదేశంలో గొప్పనటుల్లో విలక్షణ నటుడు ఆయన. తమిళనాడులో హీరోగా ఎంతో మంచి పేరున్నా.. పాత్రలకు ప్రాధాన్యమిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్‌ తండ్రిగా విజయ్‌సేతుపతిని పెట్టాలనుకుంటున్నా అని బుచ్చిబాబు అన్నప్పుడు.. ‘విజయ్‌ సేతుపతి.. ఆయన చాలా బిజీ, మీకు డేట్స్‌ ఇస్తాడంటావా..?’ అని అడిగాను. కానీ.. స్టోరీ చెప్పగానే ఆయన ఒప్పుకోవడం.. ఈసినిమాలో చేయడం.. ఈ సినిమా సాధించిన మొదటి విజయం. వైష్ణవ్‌ మాకు గర్వకారణం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే.. శంకర్‌దాదా ఎంబీబీఎస్లో‌ ఒక్క మాటలేకుండా కేవలం కళ్లతోనే తన సత్తా చాటాడు. అది గుర్తుంచుకుంటే వైష్ణవ్‌తేజ్‌ భవిష్యత్తు అర్థమవుతోంది. ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందని మాట్లాడుకుంటున్నామంటే.. దానికి మొదటి అడుగు పడింది దేవిశ్రీప్రసాద్‌తోనే. అద్భుతమైన సంగీతంతో ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లారు. మైత్రీ మూవీ మేకర్స్‌ గురించి చెప్పాలంటే.. టాలీవుడ్‌లోని ప్రతి పెద్దహీరో కూడా వీళ్లతో సినిమా చేయాలని కోరుకుంటారు. వాళ్లతో పని చేయడం మా అదృష్టం. నేను కూడా ఓ సినిమా చేయబోతున్నాను’’ అని ఆయన తెలిపారు. 

ఈ సినిమా అవకాశం 4 గంటల్లోనే వచ్చింది..

అంతకు ముందు సినిమా డైరెక్టర్‌ బుచ్చిబాబు మాట్లాడుతూ.. ‘సుకుమార్‌గారు నాకు లెక్కలు చెప్పకపోతే.. నేను డైరెక్షన్‌ కాకుండా వేరే ఏదో పని చేసుకుంటూ ఉండేవాడిని. మెగాస్టార్‌ చిరంజీవిగారి ‘ఘరానా మొగడు’ సినిమా కోసం మొదటి రోజు నుంచి ప్రయత్నిస్తే.. 75రోజులకు టికెట్‌ దొరికింది. కానీ.. వాళ్ల ఫ్యామిలీ హీరో వైష్ణవ్‌తో సినిమా తీసే అవకాశం కేవలం నాలుగు గంటల్లో వచ్చింది. నేను స్టోరీ చెప్పగానే చిరంజీవి గారు సానుకూలంగా స్పందించి సినిమా చేస్తు్న్నాం అని చెప్పారు. ఇక హీరో వైష్ణవ్‌ గురించి చెప్పాలంటే.. ఆయనను మొదటి రోజు చూసినప్పుడే నువ్వు పవన్‌ కల్యాణ్‌ అంత పెద్ద స్టార్‌ అవుతావని చెప్పాను. ఆయన కళ్లంటే నాకెంతో ఇష్టం. సినిమాలో కృతిశెట్టి బాగా నటించింది. నిర్మాతలు నాన్ను ఎంతో ప్రోత్సహించారు. విజయ్‌సేతుపతికి యాక్షన్‌ చెప్పినప్పుడే నేను పరిపూర్ణమైన డైరెక్టర్‌ అయ్యాను’ అని బుచ్చిబాబు అన్నారు.

వీళ్లు లేకపోతే నేను లేను.. వైష్ణవ్‌ తేజ్‌
అనంతరం హీరో వైష్ణవ్‌తేజ్‌ మాట్లాడారు.. ‘‘నేను ముందుగా మాట్లాడాలి అంటే.. మా అమ్మ గురించి చెప్పాలి. అమ్మనాన్న, మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, నాగబాబు ఇదే నా ఫ్యామిలీ. వీళ్లు లేకపోతే నేను లేను. ఇంతటి మంచి కథ రాసి నాతో సినిమా తీసిన బుచ్చిబాబుగారికి చాలా థాంక్స్‌. విజయ్‌సేతుపతితో కలిసి తెర పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. కృతిశెట్టికి మొదట్లో తెలుగు వచ్చేదికాదు. కేవలం వారంరోజుల్లో భాష నేర్చుకున్నారామె. ఆమె నుంచి చాలా నేర్చుకున్నాను. ‘ఉప్పాడ’ గ్రామంలో సినిమా షూటింగ్‌ చేశాం. వాళ్లు బాగా సహకరించారు. ఈ సినిమా కథ మీకే అంకితం. కెమెరామెన్‌ శ్యామ్‌ చాలా బాగా చూపించారు. సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమాలో అందరికంటే ముఖ్యంగా దేవీశ్రీ ప్రసాద్‌ గురించి చెప్పాలి. ఆయన వల్లే సినిమా జనాల్లోకి వెళ్లింది. ఉప్పెనంత నచ్చుతుందీ ఈ సినిమా’’ అని అన్నారు. 

కృతిశెట్టి మాట్లాడుతూ.. ‘సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌ బుచ్చిబాబుకి రుణపడి ఉంటా. వైష్ణవ్‌ మంచి కోయాక్టర్‌. తన సంగీతంతో సినిమాను విడుదలకు ముందే హిట్‌ చేసిన దేవిశ్రీప్రసాద్‌ గారికి కృతజ్ఞతలు. విజయ్‌ సేతుపతిగారితో కలిసి నటించడం నా అదృష్టం. ఇంకా ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు’ అని ఆమె పేర్కొంది.

 
కథ వినగానే సీన్‌ అర్థమైంది: దేవీశ్రీప్రసాద్‌
‘ఉప్పెన’ కథ వినగానే సినిమా రెస్పాన్స్‌ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకున్నానని సంగీత దర్శకులు దేవీశ్రీప్రసాద్‌ అన్నారు. ‘సుకుమార్‌, బుచ్చిబాబు కాంబినేషన్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా స్టోరీ వినగానే నాకు మంచి అభిప్రాయం కలిగింది. వైష్ణవ్‌తేజ్‌కు మంచి భవిష్యత్తు ఉంది. కృతిశెట్టి ఈ సినిమాలో చాలా బాగా చేసింది. విజయ్‌ సేతుపతి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఈ సినిమాలో చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు. అద్భుతమైన పాటలు రాసిన చంద్రబోస్‌, శ్రీమణి ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు’ అని దేవీశ్రీప్రసాద్‌ అన్నారు. 

ఇవీ చదవండి..

ఆ ముగ్గురిలో విజయ్‌ సరసన నటించేదెవరు?

సన్నీ లియోనీని విచారించిన కేరళ పోలీసులు

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని