వ్యాక్సిన్‌  చూడని ఆఫ్రికా దేశాలు..! - vaccine deserts no vaccine countries
close
Published : 09/05/2021 20:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్‌  చూడని ఆఫ్రికా దేశాలు..!

డజనుకుపైగా దేశాల్లో ఇప్పటికే మొదలుకాని ప్రక్రియ

కైరో: ప్రపంచాన్ని వణకిస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ వేగంగా పంపిణీ చేసేందుకు ప్రపంచ దేశాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 174 దేశాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్‌ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికాలో దాదాపు డజనుకుపైగా దేశాలు ఇప్పటికీ వ్యాక్సిన్‌ చూపు చూడలేని దయనీయ స్థితిలో ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వాటిని ముందుగానే సేకరించి పంపిణీ చేయడంలో ధనిక దేశాలు ముందున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ పదేపదే చెబుతోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇప్పటివరకు 174 దేశాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగా దాదాపు 128కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేయగలిగారు. అయినప్పటికీ ఆఫ్రికాలోని పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ అనే సంగతే తెలియదు. ఛాద్‌ వంటి దేశాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉన్నప్పటికీ అక్కడ వ్యాక్సిన్‌పై చర్చ జరగడం లేదని ఇందుకు పేద దేశాలు కావడమే తమకు శాపమని అక్కడి వైద్య ఆరోగ్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డజను దేశాలు వ్యాక్సిన్‌కు దూరం..

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, దాదాపు డజనుకు పైగా దేశాల్లో ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. ముఖ్యంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్న దేశాలు ఎక్కువగా ఆఫ్రికాలోనే ఉన్నాయి. ఛాద్‌, బుర్కినా ఫాసో, బురుండి, ఎరిట్రియా, టాంజానియా వంటి దేశాలకు వ్యాక్సిన్‌ అన్న మాటే తెలియదు. వ్యాక్సిన్‌ కొరత, సరఫరాలో అంతరాయం వంటి కారణాల వల్ల ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈ ఆఫ్రికా దేశాలు మరింత వెనుకబడి పోయాయని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాని దేశాల్లో కొత్తరకం కరోనా వేరియంట్‌లు విజృంభించే ప్రమాదమూ లేకపోలేదని డబ్ల్యూహెచ్‌ఓ ఏర్పాటుచేసిన ‘కొవాక్స్‌’ సమన్వయకర్త గియాన్‌ గంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పేద దేశాలకు వ్యాక్సిన్‌ విరాళంగా ఇచ్చేందుకు ధనిక దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

పేలవమైన ప్రజారోగ్య వ్యవస్థ..

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలతో పోలిస్తే ఇక్కడ వైరస్‌ ఉద్ధృతి తక్కువగానే ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఛాద్‌ దేశంలో ఇప్పటివరకు కేవలం 170 కొవిడ్‌ మరణాలు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ ఇక్కడ నమోదుకాని కేసుల సంఖ్య భారీ స్థాయిలో ఉంటుందని అనుమానిస్తున్నారు. కొవిడ్‌ రోగులకు చికిత్స చేసే వైద్య సిబ్బంది కూడా వైరస్‌ బారినపడుతుండడం క్రమంగా పెరుగుతున్నట్లు ప్రైవేలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అత్యంత దారుణమైన ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థ ఉండడం వల్లే ఆఫ్రికా దేశాలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు సమీప దేశాల వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కరోనా విజృంభణ వేళ ఆఫ్రికాలో దీనమైన స్థితిని ఎదుర్కొంటున్న దేశాలపై రష్యా, చైనా వంటి దేశాలు దృష్టిపెట్టాయి. ఆఫ్రికాలోని పలుదేశాల్లో వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఛాద్‌ వంటి డజనుకుపైగా దేశాలకు ఇంకా చేరనేలేదు. ఇదే సమయంలో ఆఫ్రికాలో కొత్తరకం వేరియంట్‌ వెలుగుచూడడం మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. కనీసం కరోనా రోగులకు వైద్యం అందించే వైద్య సిబ్బంది, ఆరోగ్యసంరక్షణ కార్యకర్తలకు కూడా వ్యాక్సిన్‌ అందకపోవడంతో తీవ్ర ఆందోళనతో విధులు నిర్వర్తిస్తున్నామని అక్కడికి వెళ్లిన అంతర్జాతీయ మీడియా సంస్థలకు వెల్లడించారు. ఇంత జరుగుతున్నా ఇక్కడి ప్రభుత్వాలు మాత్రం వ్యాక్సిన్‌ను ఎందుకు సమకూర్చుకోలేక పోతున్నాయో తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బుర్కినా ఫాసో వంటి దేశాలు తొలుత భారత్‌లోని ఓ వ్యాక్సిన్‌ తయారీ సంస్థనుంచి టీకా సేకరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ, భారత్‌లో సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి నేపథ్యంలో వాటి సరఫరాకు అంతరాయ కలిగినట్లు అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని