వరదొచ్చినా... వైరస్‌ భయపెట్టినా డ్యూటీకే ఓటు! - vadodara nurse bhanumathi conferred with florence nightingale award
close
Published : 19/09/2021 18:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరదొచ్చినా... వైరస్‌ భయపెట్టినా డ్యూటీకే ఓటు!

(Photos: Screengrab)

నర్సింగ్‌ వృత్తిలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవమున్న భానుమతికి వృత్తే దైవం. అందుకే ఎంతోమంది మహిళలకు పురుడు పోసి అమ్మయ్యే భాగ్యం కల్పించారు. అప్పుడే పుట్టిన పిల్లలకు ఎలాంటి కష్టం రానీయకుండా చూసుకున్నారు. వరదలొచ్చినా, కరోనాలాంటి వైరస్‌లొచ్చినా ధైర్యంగా ‘డ్యూటీకే నా ఓటు’ అన్నారు. అందుకే ప్రతిష్ఠాత్మక ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ పురస్కారం ఆమెను వరించింది.

సేవకు పురస్కారం!

నర్సింగ్‌ వృత్తిలో విశేష సేవలు అందిస్తున్న వారిని కేంద్ర ప్రభుత్వం ఏటా ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ మెడల్‌తో గౌరవిస్తోన్న సంగతి తెలిసిందే. అలా 2020 సంవత్సరానికి గాను మొత్తం 51 మంది నర్సులు ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఈ పురస్కారం (వర్చువల్‌గా) అందుకున్నారు. అందులో గుజరాత్‌కు చెందిన 56 ఏళ్ల భానుమతి సోమాబాయి గీవాలా కూడా ఉన్నారు. కరోనా కాలంలోనూ ధైర్యంగా విధులకు హాజరైన ఆమె కరోనా సోకిన ఎంతోమంది మహిళలకు పురుడు పోశారు. తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడి మన్ననలు అందుకున్నారు. ఈ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కించుకున్నారీ కొవిడ్‌ వారియర్.

సెలవు తీసుకోరు!

ప్రస్తుతం వడోదరలోని సర్‌ సాయాజీరావ్‌ జనరల్‌ (SSG)ఆస్పత్రిలో హెడ్‌ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నారు భానుమతి. అక్కడి గైనకాలజీ, పీడియాట్రిక్‌ వార్డుల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. 1988లో నర్సింగ్‌ వృత్తిలోకి అడుగుపెట్టారు భానుమతి. ఈ రంగంలో సుదీర్ఘ అనుభవమున్న ఆమె ఎస్‌ఎస్‌జీ ఆస్పత్రి మొదటి నర్సింగ్‌ స్టాఫ్‌లో ఒకరు కావడం విశేషం. ‘క్యాజువల్‌ లీవులు తీసుకోవడం నాకేమాత్రం ఇష్టముండదు’ అని చెప్పే భానుమతి వారంలో ఆరు రోజులు ఆస్పత్రిలోనే సేవలందిస్తున్నారు. ఇక వీక్లీ ఆఫ్‌ రోజున రామకృష్ణమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.

వరదలు, వైరస్‌లొచ్చినా ఆగలేదు!

2019 ఆగస్టులో వరదలు వడోదరా నగరాన్ని ముంచెత్తాయి. ఎస్‌ఎస్‌జీ హాస్పిటల్‌ వార్డులన్నీ కూడా వరద నీటితో నిండిపోయాయి. అయినా వృత్తి ధర్మానికే ఓటేసి ఆస్పత్రికి వెళ్లారు భానుమతి. వార్డుల్లోని గర్భిణులు, బాలింతలకు సేవలందించారు. ఇక మహమ్మారి కాలంలో అయితే ప్రాణాలను పణంగా పెట్టి మరీ విధులకు హాజరైందీ కొవిడ్‌ వారియర్‌. కొవిడ్‌ బారిన పడి ఆస్పత్రికి వచ్చిన గర్భిణులకు ధైర్యంగా పురుడు పోశారు. అనంతరం తల్లులు, పుట్టిన పిల్లలను ప్రత్యేక వార్డుల్లో ఉంచి వారి బాగోగులు చూసుకున్నారు. ఇలా ప్రకృతి వైపరీత్యాల్లోనూ వృత్తి నిబద్ధతను చాటినందుకే కేంద్ర ప్రభుత్వం భానుమతిని ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ పురస్కారంతో గౌరవించింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని