సహజ రంగుల హోలీ! - vasundhara
close
Published : 23/03/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సహజ రంగుల హోలీ!

చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడే పండగ హోలీ. ఇంద్రధనస్సులోని రంగులన్నీ ఆ రోజు అందరి ముఖాలు, దుస్తులపై ప్రతిబింబిస్తాయి. ఎంతో సంబరంగా చేసుకునే ఈ వేడుకలో ఉపయోగించే రసాయన రంగుల వల్ల చర్మానికి హాని జరగొచ్చు. మంట, దద్దుర్లు, ఇన్‌ఫెక్షన్లూ రావొచ్చు. ఈ సమస్యకు చెక్‌ పెడుతున్నారు ముంబయికి చెందిన తూర్పు కండివాలి ప్రాంతంలోని ‘రివైరా టవర్స్‌’ అపార్ట్‌మెంట్‌ మహిళలు. ఎలా అంటే..
సేంద్రియ విధానంలో ఎలాంటి రసాయనాలు లేకుండా సహజ పద్ధతుల్లో తయారైన రంగుల వల్ల మనకు ఎలాంటి హాని జరగదు. అయితే వీటి  ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. దాంతో రేటు తక్కువగా ఉండే రసాయనాలున్న వాటి వైపే ప్రజలు దృష్టి పెడతారు. రివైరా టవర్స్‌ వాసులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. 2019లో ఈ అపార్ట్‌మెంట్‌లోని కొందరు మహిళలు కలిసి దీనికోసం ప్రత్యామ్నాయాలను వెతకడం ప్రారంభించారు. ‘మా అపార్ట్‌మెంట్‌లో మొత్తం 260 ఫ్లాట్స్‌ ఉన్నాయి. పండగ నిర్వహించవద్దని ఎవరినీ ఆపలేం కదా. అలాగని కేవలం సేంద్రియ రంగులనే కొనుగోలు చేయాలని బలవంతం కూడా చేయలేం. దాంతో మా బృంద సభ్యులంతా ఏం చేయాలా అని ఆలోచించాం. సంప్రదాయ పద్ధతుల్లో ఎండిన పూల నుంచి రంగులను తయారుచేయాలని నిర్ణయించుకున్నాం’ అని చెబుతారు సొసైటీలో ఒకరైన అమూల్య మంగేష్‌.

‘ముందుగా కొంతమంది వాలంటీర్లు అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్స్‌ అన్నీ తిరిగి పూలను సేకరించి టెర్రస్‌ మీద ఆరబెట్టారు. ఆ తర్వాత వాటిని మెత్తగా పొడి చేసి పెట్టాం. మేం సహజ సిద్ధంగా తయారుచేసిన ఈ వర్ణాలు.. రసాయన రంగుల్లా కాంతివంతంగా ఉండకపోవచ్చు. కానీ ఇవి శరీరానికి ఎలాంటి హాని చేయవని కచ్చితంగా చెబుతాం. అంతేకాదు ఈ రంగులు ఉతికితే త్వరగా పోతాయి కూడా’ అని చెబుతారామె.
అలా మొదలైన ఈ రంగుల తయారీ 2020లోనూ కొనసాగింది. ఈసారి పూలను ఇళ్లతోపాటు దగ్గర్లోని దేవాలయాల నుంచి కూడా సేకరించారు. ‘మా సొసైటీలో మూడు ఆలయాలున్నాయి. అక్కడి పూజారులతో మాట్లాడి పూలదండలు, విడిపూలను సేకరించాం. ఈ పూలను రంగుల ఆధారంగా జాగ్రత్తగా వేరుచేసి వేటికవే ఆరబెట్టడం లాంటి పనులను యువత, పిల్లలకు అప్పజెప్పాం. అలా ఎండిన పూలను బ్లెండర్‌లో వేసి మెత్తగా పొడి చేసి గాలి చొరబడని డబ్బాల్లో భద్రపరుస్తున్నాం.’ అని చెబుతారు సుజాత. ఇలా 260 ఫ్లాట్స్‌కు సరిపడా రంగులను హోలీకి ముందే తయారుచేసి పెట్టుకున్నారు వాళ్లు. అయితే కొవిడ్‌ కారణంగా హోలీ వేడుకలను ఆపేసినా... పూజ మాత్రం నిర్వహిస్తామనీ, ఆ సందర్భంలో ఈ రంగులను వాడతామని చెబుతున్నారు అక్కడి మహిళలు. ‘ఈ ఏడాది కొవిడ్‌ కారణంగా వేడుకలను నిర్వహించొద్దని నిర్ణయించుకున్నాం. అయితే చాలా దగ్గరివారు మాత్రం ఇలా సహజ సిద్ధంగా తయారుచేసిన హోలీ రంగులను వాడుకోవచ్చు’ అని చెబుతున్నారు అమూల్య.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని