మహేశ్‌-రాజమౌళి సినిమా కథ.. హింట్‌ ఇచ్చిన విజయేంద్రప్రసాద్‌ - vijayendra prasad hints about ss rajamouli and maheshbabu film
close
Published : 25/07/2021 18:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌-రాజమౌళి సినిమా కథ.. హింట్‌ ఇచ్చిన విజయేంద్రప్రసాద్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని సినిమాలు, కాంబినేషన్‌లు పట్టాలెక్కక ముందే వార్తల్లోకెక్కుతాయి. అలాంటిదే ఈ చిత్రం. దర్శకధీరుడు రాజమౌళి, అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు కలయికలో ఓ సినిమా త్వరలో రాబోతున్న విషయం సినిమా ప్రియులందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆ విషయాన్ని రాజమౌళి స్వయంగా ప్రకటించారు కూడా. అయితే.. ప్రకటన మినహా సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. ప్రముఖ సినీ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ మహేశ్‌బాబు-రాజమౌళి చిత్రం కథపై ఓ హింట్‌ ఇచ్చారు. ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్‌ పలు ఆసక్తికరమై విషయాలు పంచుకున్నారు.

మహేశ్‌బాబుతో సినిమా పనులు ఎక్కడి వరకూ వచ్చాయన్న ప్రశ్నకు విజయేంద్రప్రసాద్‌ స్పందిస్తూ.. ‘‘ఇంకా స్క్రిప్టు దగ్గరే ఉన్నాయి. కరోనా సమయంలో ఏ పనీ సాధ్యం కాలేదు. అయితే.. ఒకసారి రాజమౌళి నా దగ్గరికి వచ్చిన మహేశ్‌బాబుతో సినిమా చేయాలనుకుంటున్నానని, ఒక కథ కావాలని అడిగాడు. ఆఫ్రికా బ్యాక్‌డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఉండాలన్నారు. నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌కు పెద్ద అభిమానులం. ఆయన పుస్తకాల ఆధారంగా స్ర్కిప్టు రాయాలనుకుంటున్నా’’ అని ఆయన అన్నారు. అంతేకాదు.. రాజమౌళి-మహేశ్‌బాబు ప్రాజెక్టు ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి చిత్రాలంటే భారీ స్థాయిలో రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై భారీ అంచనాలున్నాయి. సుమారు రూ.450కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్‌ 13 ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రీకరణకు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చే పనుల్లో జక్కన్న టీమ్‌ నిమగ్నమై ఉంది. ఆ సినిమా ప్రమోషన్‌ కోసం భారీ బడ్జెట్‌తో ఓ ప్రచార గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ పాటలో ఎన్టీఆర్‌, తారక్‌తో పాటు బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ కూడా సందడి చేయనుంది. అంతేకాదు.. ఈ సినిమా ప్రచారంలో జక్కన్న హీరోలు ప్రభాస్‌, రవితేజ, రానా పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బ్యాంకింగ్‌ రంగంలోని కుంభకోణాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కీర్తి సురేశ్‌ కథానాయిక. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దాని తర్వాత జక్కన్నతో కలిసి పనిచేసే అవకాశం ఉంది. అయితే.. 2022లో పట్టాలెక్కే అవకాశం ఉన్న ఈ సినిమా థియేటర్లో చూడాలంటే ప్రేక్షకులు మరికొన్నేళ్లు ఎదురుచూడక తప్పదు మరి.

పవర్‌స్టార్‌కు కథ రాశారని వస్తున్న వార్తలపై విజయేంద్రప్రసాద్‌ స్పందించారు. ‘పవన్‌ కల్యాణ్‌ అంటే అందరికీ అభిమానం ఉంటుంది. అయితే.. నేను ఆయనకు ఎలాంటి కథ రాయలేదు. ఆయన ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నాను. అది జరగడం లేదు. జరుగుతుందని కూడా అనుకోవట్లేదు’ అని ఆయన చెప్పుకొచ్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని