జక్కన్న చెక్కిన విలన్లు
close
Published : 18/02/2020 11:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జక్కన్న చెక్కిన విలన్లు

ప్రతి ప్రేక్షకుడూ హీరోను చూసే సినిమాకు వస్తాడు. ఇంకొందరు హీరోయిన్ల కోసం వస్తార్లెండి. అది వేరే విషయం. సినిమా చూసేటప్పుడు విలన్‌పై తన అభిమాన హీరోనే గెలవాలని కోరుకుంటారందరూ. ఎందుకంటే హీరో అంటేనే మంచోడు కాబట్టి. ప్రేక్షకుడి అంచనాలను అందుకుంటూ హీరో తన శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తే థియేటర్లో ఈలలు వేసి హంగామా చేస్తారు. అలా కాకుండా.. హీరోపై విలన్‌ పైచేయి సాధిస్తే..? హీరోకంటే ఎక్కువ బలవంతుడినని నిరూపిస్తే..? ప్రేక్షకుడిలో అసహనం మొదలవుతుంది. అయితే, అప్పటివరకూ పిల్లిలా ఉన్న హీరో చివరిలో పులిలా రౌడీలను చితక్కొడుతుంటే సగటు ప్రేక్షకుడికి వచ్చే మజానే వేరు. ఆ మజా అనుభవించాలంటే ప్రతినాయకుడి పాత్ర బలంగా ఉండాలి. అప్పుడే ఆయా సన్నివేశాలు రక్తికడతాయి. ఇలా హీరో-విలన్ల మధ్య పోరును రక్తికట్టించడంలో దర్శకధీరుడు రాజమౌళి దిట్ట. అందుకే రాజమౌళి సినిమాల్లో హీరోలతో పాటు విలన్లూ సినిమాపై చెరగని ముద్రవేస్తారు.

బాహుబలి భళ్లాలదేవ

‘లీడర్’తో కథానాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న రానా.. ‘బాహుబలి’లో భళ్లాలదేవుడిగా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ సినిమా ప్రభాస్‌కు ఎంత పేరు తెచ్చిందో నటనపరంగా రానాకు అంతే పేరు తీసుకొచ్చింది. ఎంతలా అంటే, ‘బిఫోర్‌ బాహుబలి.. ఆఫ్టర్‌ బాహుబలి’ అని చెప్పుకునేలా మార్చేసింది. ఇప్పుడు రానా నటించే ప్రతి సినిమాపై అంచనాలు భారీగానే ఉంటున్నాయి. ప్రభాస్‌కు ధీటైన ప్రతినాయకుడు చూపించాలన్న ఉద్దేశంతో రానాను ఎంచుకున్నారు రాజమౌళి. జక్కన్న అంచనాలకు మించి రానా పాత్ర పండింది.  ప్రస్తుతం రానా ‘అరణ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది.

విలనంటే ఇలా ఉండాలన్న భిక్షుయాదవ్‌

విలన్‌ అంటే ఇలా ఉండాలి అని చూపించిన పాత్ర ‘భిక్షుయాదవ్‌’. ఆ పాత్రలో ప్రదీప్‌ రావత్‌ తనదైన నటనతో మెప్పించాడు. పొడవాటి మీసాలు, ముక్కుకు రింగు, మెడలో కంటె, వేసుకొని క్రూరంగా, చూడగానే భయం పుట్టేలా ఆయన ఆహార్యం ఉంటుంది. బలవంతుడైన భిక్షుయాదవ్‌ను బలహీనులు, ఆవేశపరులైన విద్యార్థులు తమ తెలివి తేటలతో ముప్పుతిప్పలు పెట్టి తమ కాలేజ్‌ను ఎలా దక్కించుకున్నారన్నది ‘సై’ కథ. దీనికి రగ్బీ క్రీడను నేపథ్యంగా తీసుకుని రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో నటనకు గానూ ప్రదీప్‌ రావత్‌కు ఫిలింఫేర్‌ అవార్డు సైతం లభించింది. ఈ సినిమా తర్వాత ప్రదీప్‌ రావత్‌కు అవకాశాలు బాగా పెరిగిపోయాయి. ఆ తర్వాత ఏ సినిమాలో చూసినా దాదాపు ఆయనే విలన్‌గా కనిపించేవారు. 

మర్యాదైన విలన్‌ రామినీడు

‘మర్యాదరామన్న’ అనగానే మనకు ‘మర్యాద.. మర్యాద..’ అనే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌.. పదునైన కత్తుల మధ్య విలన్ల నుంచి తప్పించుకుంటున్న హీరో సునీల్‌ కళ్లముందుకు వస్తాడు. ఆ సినిమాలో రాయలసీమ యాసలో మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూనే.. గడప లోపల ఉన్న హీరో గడప దాటి బయటికి రాగానే నరికేయాలని చూస్తుంటాడు విలన్‌ రామినీడు. ఆ పాత్రలో నాగినీడు కనిపించి అభిమానులను మెప్పించారు. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నాగినీడు తెలుగులో తన స్థానం సుస్థిరం చేసుకున్నారు.

కేరక్టర్‌ ఆర్టిస్టు నుంచి కాట్‌రాజుగా..

కొన్ని పాత్రలు నటులకు ఎంతలా గుర్తింపు తెస్తాయంటే.. రీల్ పేరే రియల్‌ పేరుగా మారేంతగా. అలాంటి గుర్తింపు వచ్చిన వారు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉంటారు. అందులో సుప్రీత్ ఒకరు. ఈ పేరు చెబితే ఎవరా సుప్రీత్‌ అంటారు. ‘ఛత్రపతి’లో ‘కాట్‌రాజ్‌’గా అంటేనే గుర్తొస్తాడు. అప్పటి వరకూ చిన్నాచితకా పాత్రలు చేసుకుంటూ కేరక్టర్‌ ఆర్టిస్టుగా ఉన్న సుప్రీత్‌ ఈ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి విలన్‌ దొరికాడు అనేంతలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషించాడు.

రక్తం తాగే టిట్లా..!

రాజమౌళి తన సినిమాల్లో ఎవర్ని, ఎప్పుడు, ఎలా చూపిస్తారో ఎవరికీ తెలియదు. కథ డిమాండ్‌ చేస్తే సహాయ నటులు కూడా విలన్లుగా మార్చేస్తాడు. జక్కన్న దెబ్బతో అప్పటి వరకూ సహాయనటుడిగా పలు సినిమాల్లో కనిపించిన నటుడు అజయ్‌ ఒక్కసారిగా విలన్‌గా మారిపోయాడు. ‘విక్రమార్కుడు’లో ఆరడుగుల ఎత్తు, అతిభయంకరమైన రూపంతో ఎవరూ గుర్తుపట్టలేనంతగా కనిపించాడు అజయ్‌. ‘టిట్లా’ పాత్రలో అజయ్‌ కనిపించగా బావూజీగా వినీత్‌కుమార్‌ నటించాడు. ఈ సినిమా అజయ్‌ సినిమా కెరీర్‌లో ఓ మైలు రాయిగా నిలిచింది. 

బల్లెం విసిరితే అంతే రణదేవ్‌బిల్లా

దేవ్‌ గిల్‌ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ.. రణదేవ్‌బిల్లా అంటే తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులుండరు. ‘మగధీర’లో కాలభైరవుడు(రామ్‌చరణ్‌)తో మిత్రవింద(కాజల్‌) కోసం రణదేవ్‌బిల్లాగా పోరాడాడు. దేవ్‌గిల్‌ అప్పటి వరకూ తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో కనిపించినా రాని పేరు ‘మగధీర’తో వచ్చింది. ఆ సినిమా తర్వాత ఒక్కసారిగా స్టార్‌ అయిపోయాడీ నటుడు. ప్రస్తుతం దక్షిణాదిన పలువురు పెద్ద హీరోల చిత్రాల్లో విలన్‌గా అవకాశాలు కొట్టేస్తున్నాడు.

సుదీప్‌.. సుదీప్‌గానే

కిచ్చా సుదీప్‌.. కన్నడలో పెద్ద నటుడు. కానీ, తెలుగు ప్రేక్షకులకు తన నట విశ్వరూపం అంతగా తెలియదు. రాజమౌళి ‘ఈగ’లో విలన్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో హీరో పాత్రకంటే విలన్‌ ఎక్కువ సమయం తెరపై కనిపిస్తాడు. ఈ సినిమాతో సుదీప్‌ దక్షిణాదిన మోస్ట్‌వాంటెడ్‌ నటుడిగా మారాడు. ఇటీవల వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలోనూ కనిపించాడు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. అక్కడ తన మార్కు చూపించేందుకు సిద్ధమయ్యాడు.

వింతైన భాషతో కాలకేయ..

విలన్‌ గుంపులో ఎక్కడో ఓ మూలన ఉండే ప్రభాకర్‌ ‘బాహుబలి’లో కాలకేయుడిగా ఒక్కసారిగా తెలుగుతెరపైకి దూసుకొచ్చాడు. వింత భాషతో, భయంకర రూపంతో ‘బాహుబలి-1’ క్లైమాక్స్‌కు మరింత బలాన్ని తెచ్చాడు. ఆ సినిమాలో కాలకేయ మాట్లాడిన భాష ఎప్పటికీ మర్చిపోలేం. ఒక రకంగా చెప్పాలంటే ఆ భాషతోనే ప్రభాకర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత ప్రభాకర్‌కు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు బాగానే పెరిగాయి.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’..?

రాజమౌళి దర్శకుడిగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. తన సినిమాలతో భారతీయ సినిమా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన జక్కన్న ఈ సినిమాలో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌, హాలీవుడ్‌ నటులను సైతం చూపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే.. ఈ సినిమాలో విలన్‌పాత్రపై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. రే స్టీవెన్‌సన్‌, అలీసన్‌ డూడీలు విలన్‌ పాత్రలు పోషిస్తున్నారు. ఇక బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవగణ్‌ పాత్ర ఏంటో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే!

- ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని