Virat Kohli: భారత్‌ క్రికెట్‌కు కోహ్లి గొప్ప ఆస్తి..: గంగూలీ - virat kohli deserves to win t20 world cup as captain has to go out on a high: dilip vengsarkar
close
Published : 17/09/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Virat Kohli: భారత్‌ క్రికెట్‌కు కోహ్లి గొప్ప ఆస్తి..: గంగూలీ

ఇంటర్నెట్‌ డెస్కు: వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తీసుకున్న నిర్ణయాన్ని పలువురు మాజీ క్రికెటర్లు స్వాగతిస్తున్నారు. భారత్‌ క్రికెట్‌కు విరాట్‌ కోహ్లి గొప్ప ఆస్తి అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నారు. విరాట్‌ టీమిండియాను దిగ్విజయంగా నడిపించాడని కొనియాడారు. మూడు ఫార్మట్లలోనూ విజయవంతమైన సారథిగా అభివర్ణించిన దాదా.. విరాట్ భవిష్యత్‌ ప్రణాళికల్లో భాగాంగానే ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. టీ 20 కెప్టెన్‌గా కోహ్లి అద్భుత ప్రదర్శనకు ధన్యవాదాలు తెలిపారు. 

కోహ్లి నాయకత్వంలో భారత్‌ టీ20 ప్రపంచ కప్‌ గెలుస్తుంది.. దిలీప్‌ వెంగ్‌ సర్కార్‌

టెస్టు క్రికెట్‌పై మరింత దృష్టి పెట్టేందుకే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ క్రికెటర్‌ దిలీప్ వెంగ్‌సర్కార్‌ చెప్పాడు. అయితే, కోహ్లి నాయకత్వంలో టీమ్‌ ఇండియా కచ్చితంగా టీ20 ప్రపంచకప్‌ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.  ‘కోహ్లి గొప్ప క్రికెటర్‌. నాయకుడిగా భారత్‌కి ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. కానీ, పొట్టి ఫార్మాట్‌లో విజయవంతం కాలేకపోయాడు. ఇండియన్‌ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో తాను నాయకత్వం వహిస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టును ఒక్కసారి కూడా విజేతగా నిలపలేకపోయాడు. అయితే, పొట్టి ఫార్మాట్లో విజయానికి భరోసా ఇవ్వలేం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. 2007లో ధోనీ సారథ్యంలోని భారత జట్టు కూడా కప్‌ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. అయినా, ధోనీ సేన కప్‌ని సొంతం చేసుకోగలిగింది. కోహ్లి అగ్రశ్రేణి ఆటగాడు. ఎన్నో ఏళ్లుగా భారత క్రికెట్‌ కోసం కష్టపడుతున్నాడు. ప్రస్తుతం, అతడి నాయకత్వంలో భారత జట్టు కచ్చితంగా టీ20 ప్రపంచకప్‌ సాధిస్తుంది’ అని వెంగ్‌ సర్కార్‌ పేర్కొన్నాడు. 

కోహ్లి సేవలు మరువలేనివి: జై షా

టీ20 కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి అందించిన సేవలు మరువలేనివని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నారు. ‘యువ కెప్టెన్‌గా జట్టుని ముందుండి నడిపించిన తీరు అమోఘం. ఓ వైపు నాయకత్వ బాధ్యతలు.. మరోవైపు వ్యక్తిగత ప్రదర్శన మధ్య సమన్వయం చేసుకున్న తీరు ప్రశంసనీయం’ అని జై షా ట్వీట్‌ చేశారు.

మరోవైపు, కోహ్లి అనంతరం పొట్టి క్రికెట్లో మంచి రికార్డు ఉన్న రోహిత్‌ శర్మ టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న హిట్‌మ్యాన్‌.. ఇప్పటికే ఐదు టైటిళ్లు అందించాడు. 2017లో అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ నుంచి కోహ్లి పగ్గాలు స్వీకరించిన విషయం తెలిసిందే. 90 టీ20 మ్యాచులు ఆడిన కోహ్లి 45 మ్యాచులకు నాయకత్వం వహించాడు. 27 మ్యాచుల్లో జట్టుని విజయతీరాలకు చేర్చాడు. 14 మ్యాచుల్లో టీమిండియా ఓటమి పాలైంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని