విరాట్‌ విధ్వంసం.. చిన్నబోయిన మొహాలి - virat kohlis blistering knock against australia in 2016 t20 world cup
close
Published : 27/03/2021 15:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విరాట్‌ విధ్వంసం.. చిన్నబోయిన మొహాలి

కోహ్లీ కెరీర్‌లో టాప్‌ ఇన్నింగ్స్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ కెరీర్‌లో ఎన్ని గొప్ప ఇన్నింగ్స్‌ ఉన్నా 2016 టీ20 ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాపై చెలరేగిందే అత్యుత్తమ ప్రదర్శన. ఈ విషయాన్ని అతడే స్వయంగా ఒప్పుకున్నాడు. స్వదేశంలో జరిగిన ఆ మెగా టోర్నీలో భారత్ సెమీఫైనల్లో విండీస్‌ చేతిలో ఓటమిపాలైంది కానీ, ఆ రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ ఆడిన తీరు అత్యద్భుతం. ఇప్పుడీ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. కంగారూలతో క్వార్టర్‌ ఫైనల్‌ జరిగి నేటికి 5 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని టీ20 ప్రపంచకప్‌ ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. నాటి కోహ్లీ విధ్వంసక ఇన్నింగ్స్‌ను మరోసారి గుర్తు చేస్తూ అతడి వీడియోను పోస్టు చేసింది.

మొహాలి వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 160/6 స్కోర్‌ సాధించింది. ఆరోన్‌ఫించ్‌(43; 34 బంతుల్లో 3x4, 2x6), గ్లెన్‌ మాక్స్‌వెల్‌(31; 28 బంతుల్లో 1x4, 1x6) ఫర్వాలేదనిపించారు. ఆపై లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన టీమ్‌ఇండియా 49 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అలాంటి ఒత్తిడి సమయంలో విరాట్‌(82*; 51 బంతుల్లో 9x4, 2x6) విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై కనికరం లేకుండా ఎదురుదాడి చేశాడు. రైనా(10), యువీ(21), ధోనీ (18*)తో కలిసి చివరి వరకు పోరాడాడు. ఈ నేపథ్యంలోనే 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు.

‘నా కెరీర్‌లో ఈ ఇన్నింగ్స్‌ టాప్‌ మూడులో ఉండాల్సింది. కానీ, నేను ఈరోజు భావోద్వేగంతో ఉన్నా. దీన్ని నా అత్యుత్తమ టాప్‌ ఇన్నింగ్స్‌గా భావిస్తా. స్వదేశంలో ఆస్ట్రేలియాలాంటి టాప్‌క్లాస్‌ జట్టుపై ఇలాంటి ప్రదర్శన చేయడం సంతోషాన్ని కలిగించింది’ అని విరాట్‌ మ్యాచ్‌ అనంతరం పేర్కొన్నాడు. ఇక తర్వాత వెస్టిండీస్‌తో ఆడిన సెమీఫైనల్లోనూ విరాట్‌(89; 47 బంతుల్లో 11x4, 1x6) మరో విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరోజు టీమ్‌ఇండియా 192/2 భారీ స్కోర్‌ సాధించింది. ఆపై లెండిల్‌ సిమన్స్‌(82; 51 బంతుల్లో 7x4, 5x6) దంచి కొట్టడంతో వెస్టిండీస్‌ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి ఫైనల్‌కు చేరింది. అక్కడ ఇంగ్లాండ్‌ను చిత్తుచేసి ఛాంపియన్‌గా నిలిచింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని