ఆసీస్‌ సిరీసులో సిరాజ్‌ దొరికాడు: రవిశాస్త్రి - we found siraj in australia series says ravishastri
close
Published : 22/01/2021 19:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసీస్‌ సిరీసులో సిరాజ్‌ దొరికాడు: రవిశాస్త్రి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియా సిరీస్‌లో తాము మహ్మద్‌ సిరాజ్‌ను కనుగొన్నామని టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. పోటాపోటీగా జరిగిన సిరీస్‌లో అతడు అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని ప్రశంసించాడు. తండ్రి మరణం కుంగదీసినా, జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కొన్నా.. వాటన్నింటినీ వికెట్లు తీసేందుకు ఉపయోగించుకున్నాడని వెల్లడించాడు. జట్టుకెంతో మేలుచేశాడని కితాబిచ్చాడు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశాడు.

టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఆస్ట్రేలియా సిరీస్‌ ద్వారా హీరోగా మారిపోయాడు. దుబాయ్‌ నుంచి ఆసీస్‌కు వెళ్లిన వారం రోజులకే తండ్రి మహ్మద్‌ గౌస్‌ హైదరాబాద్‌లో మరణించారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు, క్వారంటైన్‌ నిబంధనలు, దేశానికి ఆడాలన్న తండ్రి కలను నెరవేర్చేందుకు అతడు నగరానికి రాలేదు. తండ్రి అంత్యక్రియలకు హాజరవ్వలేదు. ఆ బాధను భరిస్తూనే క్రికెట్‌ ఆడాడు. మెల్‌బోర్న్‌ టెస్టులో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. సిడ్నీలో జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నాడు. ఇక కీలకమైన నాలుగో టెస్టులో అతడు జట్టు బౌలింగ్‌ దళానికి నాయకత్వం వహించాడు. సీనియర్లు లేకపోవడంతో కుర్రాళ్లకు సలహాలిస్తూ నడిపించాడు. ఐదు వికెట్ల ఘనతనూ అందుకున్నాడు.

గురువారం హైదరాబాద్‌కు చేరుకున్న సిరాజ్‌కు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం వద్ద అభిమానులు సందడి చేశారు. అక్కడి నుంచి సిరాజ్‌ నేరుగా శ్మశాన వాటికకు వెళ్లి తండ్రి సమాధి వద్ద నివాళులర్పించాడు. కాసేపు అక్కడే గడిపి తండ్రి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఇంటికి వచ్చాక తల్లిని ఓదార్చాడు. సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ఇక ముందు మరింత ఆత్మవిశ్వాసంతో ఆడతానని, విజయగర్వం తలకెక్కించుకోనని అతడు చెప్పిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి
ఆసీస్‌ కాదు.. టీమిండియాపై దృష్టిపెట్టండి 
అమ్మో.. టీమ్‌ఇండియాతో అంటే శ్రమించాల్సిందే

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని