ఆ విషయంలో బ్రిటిష్‌వాళ్లు గొప్ప - we should learn form Britishers says puri
close
Published : 15/11/2020 03:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ విషయంలో బ్రిటిష్‌వాళ్లు గొప్ప

షర్టు, ప్యాంటు వేసుకోవడం వాళ్లే నేర్పారు: పూరీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనదేశాన్ని ఏళ్లతరబడి పాలించిన బ్రిటిష్‌ వాళ్లను చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలని అంటున్నారు దర్శకులు పూరీ జగన్నాథ్‌. ప్రపంచదేశాలకు పాలన పాఠాలు నేర్పింది బ్రిటిష్‌ వాళ్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన తన ‘పూరీ మ్యూజింగ్స్‌’లో భాగంగా.. ఈసారి బ్రిటిష్‌ వాళ్ల పాలన.. గొప్పతనం గురించి మాట్లాడారు.
‘‘మనందరికీ బ్రిటిష్‌వాళ్లు అంటే పడదు. గతంగతః.. దాన్ని వదిలేద్దాం. కానీ, ఒక్కసారి బ్రిటిష్‌ వాళ్ల గురించి ఆలోచిద్దాం. ఈరోజు యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో బ్రిటిష్‌ వారి జనాభా కేవలం 6.5కోట్లు. మరి ఇప్పుడే అంత తక్కువగా ఉంటే.. 16వ శతాబ్దంలో వాళ్ల జనాభా 50లక్షలు కూడా ఉండదు. అందులో సెయిలర్స్‌, సోల్జర్స్‌ మొత్తం కలిపితే 50వేలు కూడా ఉండరు. వాళ్లకంటే మనదేశం 13రెట్లు పెద్దది. అయినా.. వాళ్లొచ్చి మన దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారు..? కారణం కసి. మనం హిమాలయాలు ఎక్కి అవతల ఏముందో చూడం. సరదాగా శ్రీలంక కూడా వెళ్లం.. మనం నూతిలో కప్పలం. కానీ.. అతి తక్కువ జనాభా ఉన్న ఓ చిన్న దేశం నుంచి బ్రిటిష్ వాళ్లు వచ్చి.. రవి అస్తమించని సామ్రాజ్యం స్థాపించారు. 22 దేశాలు తప్ప ప్రపంచంలోని అన్ని దేశాలను ఆక్రమించారు. ప్రపంచంలో అందరికీ షర్టు, ప్యాంట్‌ వేసుకోవడం నేర్పారు. వాళ్లు మాట్లాడే ఇంగ్లిష్‌ అందరికీ నేర్పారు. అలాగే.. వాళ్లు ఆక్రమించిన దేశాలన్నింటినీ వాళ్ల సొంత దేశాల్లా భావించి డెవలప్‌ చేశారు. రైళ్లు వేశారు. రోడ్లు వేశారు. నట్లు, బోల్టులతో సహా అన్ని దేశాల్లో ఫ్యాక్టరీలు కట్టారు. కార్లు, ఎయిర్‌పోర్టులు, షిప్పులు.. ఒక్కటి కాదు.. వ్యవస్థను అర్థం చేసుకోవాడినికి అన్ని దేశాల వాళ్లను లండన్‌ తీసుకెళ్లి బారిష్టరు చదివించారు. కొన్ని వందల షిప్పులు అన్ని దేశాలకు లండన్‌నుంచి రోజూ అప్‌ అండ్‌ డౌన్‌ చేసేవి. ఇన్ని చేయాలంటే బ్రిటిష్‌ వాళ్లకు ఎంత కసి ఉండాలి. ఎంత ముందు చూపు ఉండాలి. ఆ తర్వాత వాళ్లు ఎందుకు ఫెయిల్‌ అయ్యారంటే.. ప్రతి దేశంలోనూ స్వాతంత్ర్యం కోసం స్థానికులు పోరాడటం. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ వాళ్లు ఓడిపోవడం. ఇలా.. ఎన్నో కారణాల వల్ల వాళ్లకు చిరాకేసి ఒక్కదాని తర్వాత ఒకటి వరుసగా.. ఒక్కో దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించుకుంటూ వెళ్లారు. యూనైటెడ్‌ స్టేట్స్‌కు 1776, అఫ్గానిస్థాన్‌ 1919, ఈజిఫ్టు 1922, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌కు 1931, ఇరాక్‌ 1932, జోర్డాన్‌ 1946, పాకిస్థాన్‌, ఇండియా 1947.. ఇంకా చాలా పేర్లున్నాయి. ఇలా ఎన్నో దేశాలకు స్వాతంత్ర్యం ప్రకటిస్తూ.. 1984 వరకూ ఇస్తూనే ఉన్నారు’’ అని పూరీ అన్నారు.
‘అయితే.. ఒక్కదేశం మాత్రం.. మాకు స్వాతంత్ర్యం వద్దు మమ్మల్ని మీరే పాలించండి. లేదంటే.. మా దేశ అభివృద్ధి ఆగిపోతుందని కోరారు. ఆ ఒక్క దేశాన్ని వాళ్లు ఇంకొన్నాళ్లు పరిపాలించి.. వాళ్లు కోరుకున్నట్లుగా బాగా అభివృద్ధి చేశారు. 1997లో స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్లిపోయారు. అదే.. హాంకాంగ్‌. అందుకే ఆ దేశం అలా ఉంది. ఎందుకు చెప్తున్నాననంటే.. బ్రిటిష్‌ వాళ్ల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది పాలన. వంద దేశాలను పరిపాలించాలంటే వాళ్లెంత క్రమశిక్షణగా ఉన్నారో ఆలోచించాలి. బ్రిటిష్‌ పాలన అంటే సంస్థలాంటిది. అందుకే  వాళ్ల దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. కేవలం 50వేల మంది ప్రపంచాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. ఇండియా స్వాతంత్ర్యం సమయానికి పెళ్లాం, పిల్లలు కలిపి మొత్తం 10వేల మంది ఆంగ్లేయులు మిగిలారు. అందులో 2వేల మంది లండన్‌ వెళ్లి ఉంటారు. మిగిలినవాళ్లు ఇక్కడే స్థిరపడ్డారు. ఇప్పుడు వాళ్ల జనాభా లక్ష పాతికవేలు. వాళ్లే ఆంగ్లో ఇండియన్స్‌’ అని బ్రిటిష్‌ వాళ్లపై తన విశ్లేషణను పూరి ముగించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని