WTC Final: 5 వికెట్లు తీయనందుకు బాధేం లేదు - we would like to bat and have enough back-up runs shami hints at safe approach
close
Published : 23/06/2021 12:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

WTC Final: 5 వికెట్లు తీయనందుకు బాధేం లేదు

కోహ్లీసేనది ‘భద్రతే ముందు’ విధానమన్న షమి

సౌథాంప్టన్‌: తగినన్ని పరుగులు చేశాకే న్యూజిలాండ్‌కు లక్ష్యం నిర్దేశిస్తామని టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ షమి అన్నాడు. ‘భద్రతే ముందు’ అన్న విధానాన్ని జట్టు అనుసరిస్తుందని తెలిపాడు. భారత్‌కు ఆడటమే గొప్ప విషయమని, ఐదు వికెట్ల ఘనత చేజారినందుకు బాధపడనని స్పష్టం చేశాడు. ఐదో రోజు ఆట ముగిశాక అతడు మీడియాతో మాట్లాడాడు.

ఆరో రోజైన బుధవారం టీమ్‌ఇండియా ప్రణాళికలను షమి వివరించాడు. ‘వర్షం వల్ల మేం చాలా విలువైన సమయం కోల్పోయాం. అందుకే మేం స్కోర్ల గురించి ఆలోచించడం లేదు. మేమిప్పుడే రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించాం. మొదట మేం పరుగులు చేయాలి. వీలైనన్ని పరుగులు చేశాక సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇంగ్లాండ్‌ వంటి పరిస్థితుల్లో ఏదైనా జరగొచ్చు. ఇన్ని ఓవర్లలో వారిని ఔట్‌ చేయాలంటూ మాకేమీ ముందస్తు ప్రణాళికలు లేవు. త్వరగా 10 వికెట్లు తీయాలంటే పక్కా ప్రణాళికలు అవసరం. కానీ, అంతకన్నా ముందు మేం చాలినన్ని పరుగులు చేయాలి’ అని అతడు అన్నాడు.

ఐదో రోజు తన ప్రణాళికలు చక్కగా అమలైనందుకు షమి ఆనందం వ్యక్తం చేశాడు. ‘టెస్టు క్రికెట్‌ ఆడుతున్నప్పుడు ఐదు రోజులూ ఒకే ప్రణాళికతో ఉండొద్దు. పిచ్‌ను బట్టి వాటిని మారుస్తుండాలి. న్యూజిలాండ్‌ను తక్కువ పరుగులకే పరిమితం చేయాలంటే మేం కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు విసరాలి. ఒత్తిడిని సృష్టిస్తే మూమెంటమ్‌ వస్తుంది. దాంతో వికెట్లు లభిస్తాయి’ అని తెలిపాడు.

ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎప్పుడైనా తనకిచ్చిన బాధ్యతను మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తానని షమి తెలిపాడు. కెప్టెన్‌ ఏం కోరుకుంటాడో తనకు  తెలుసని, అతడి ఆదేశాలు అనుసరిస్తానని వెల్లడించాడు. తానెప్పుడూ దూకుడుగా బంతులేసి వికెట్లు తీసే బౌలరేనని పేర్కొన్నాడు. ఐదు వికెట్లు తీయనందుకు తనకేమీ బాధలేదన్నాడు. టీమ్‌ఇండియాకు ఆడుతున్నప్పుడు అలాంటివేమీ ఉండవని, వ్యక్తిగత మైలురాళ్ల గురించి పట్టించుకోకూడదని వెల్లడించాడు. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లు విసిరిన షమి 76 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని