మాస్కుతో 14వేల మంది ప్రాణాలు కాపాడవచ్చు! - wearing masks could save at least 14000 lives
close
Published : 12/04/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్కుతో 14వేల మంది ప్రాణాలు కాపాడవచ్చు!

ఆగస్టు నాటికి పరిస్థితి అంచనా వేసిన అమెరికా శాస్త్రవేత్తలు

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేయడంలో మాస్కులు ధరించడమే అత్యంత కీలకమని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, నిపుణులు సూచిస్తూనే ఉన్నారు. ఇలా చేయడం వల్ల కొవిడ్‌ మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో మాస్కులు ధరించడం వల్ల వచ్చే ఆగస్టు నాటికే అమెరికాలో దాదాపు 14వేల మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని తాజాగా జరిపిన అధ్యయనంలో అమెరికా శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ మాస్కు ధరించడమే ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో మాస్కు ధరించడం వల్ల ఎంతమంది ప్రాణాలు కాపాడుకోవచ్చనే అంశంపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌, ఎవాల్యుయేషన్‌(ఐహెచ్‌ఎంఈ) ఓ అంచనా వేసింది. దీని ప్రకారం, 2021 ఆగస్టు నాటికి అమెరికాలో కొవిడ్‌ మరణాలు 6,18,523కు చేరుకోవచ్చని లెక్కగట్టింది. ఒకవేళ అమెరికాలో 95శాతం జనాభా మాస్కు ధరిస్తే మాత్రం.. ఇందులో కనీసం 14వేల మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని అంచనా వేసింది. తద్వారా కొవిడ్‌ మరణాల సంఖ్యను 6,04,413కు తగ్గించవచ్చని ఐహెచ్‌ఎంఈ పేర్కొంది.

ఇక ఆగస్టు నాటికి అమెరికా జనాభాలో ఎక్కువ మంది వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ.. కొవిడ్‌ కంటే ముందున్న పరిస్థితులు ఏర్పడడం వల్ల ఈ మరణాల సంఖ్య 6,97,573కు పెరగవచ్చని ఐహెచ్‌ఎంఈ అంచనా వేసింది. విస్తృత వేగంతో వ్యాప్తి చెందే కరోనా వైరస్‌లో కొత్త రకాలు వెలుగుచూడడం కరోనా మరణాల సంఖ్య పెరుగుదలకు కారణమని తెలిపింది. ముఖ్యంగా బ్రిటన్‌, బ్రెజిల్‌ రకానికి చెందిన వైరస్‌పై వ్యాక్సిన్‌ల పనితీరు ఇంకా పూర్తిస్థాయిలో తెలియలేదని.. అందువల్ల వైరస్‌ ఉద్ధృతి తగ్గే అవకాశం కనిపించడం లేదని పేర్కొంది. ఇలాంటి సమయంలో ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకున్నా.. మరింత అప్రమత్తంగా ఉండాలని ఐహెచ్‌ఎంఈ సూచించింది.

ఇదిలాఉంటే, అమెరికాలో ఇప్పటివరకు 3కోట్ల 11లక్షల మందిలో కరోనా వైరస్‌ బయటపడగా.. వీరిలో ఇప్పటివరకు 5లక్షల 61వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వైరస్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ.. మాస్కులు ధరించడం వంటి కీలక జాగ్రత్తలపై నిర్లక్ష్యం చేయవద్దని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ హెచ్చరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని