ఆ సంబరాల అర్థం చెప్పిన రాహుల్‌ - when players let it out kl rahuls shut out the noise gesture joins unique list of celebrations
close
Published : 27/03/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ సంబరాల అర్థం చెప్పిన రాహుల్‌

పుణె: అంతర్జాతీయ క్రికెట్లో శతకాలు చేసినప్పుడు ఒక్కో ఆటగాడు ఒక్కోలా సంబరాలు చేసుకుంటాడు. చాలామంది బ్యాటును పైకిలేపి వందనం చేస్తారు. కొందరు పైకి ఎగిరి పంచ్‌ ఇస్తారు. టీమ్‌ఇండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ వీరందరికీ భిన్నంగా వేడుకలు చేసుకుంటాడు. హెల్మెట్‌ తీసి బ్యాటు కిందపెట్టి రెండు చేతులతో చెవులను మూసుకుంటాడు. ఎందుకలా చేస్తాడో రాహుల్‌ శుక్రవారం వివరించాడు.

ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో రాహుల్‌ శతకం బాదేశాడు. 114 బంతుల్లో 108 పరుగులు సాధించాడు. ప్రత్యర్థికి 337 పరుగుల లక్ష్యం నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా తన స్ట్రోక్‌ప్లేతో అలరించాడు. సొగసైన బౌండరీలు, కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు. శతకం కాగానే తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ ముగిశాక ఆ సంబరాల వెనుక అర్థమేంటని క్రికెట్‌ వ్యాఖ్యాత మురళీ కార్తీక్‌ ప్రశ్నించాడు.

‘బయటి రణగొణ ధ్వనులను ఆపేసేందుకే ఈ సంబరాలు. ఎవరినీ అవమానించేందుకు మాత్రం కాదు. మనల్ని వెనక్కి లాగే చాలామంది బయట ఉంటారు. అన్నిసార్లూ వారిని పట్టించుకోకూడదు. నా సంబరాల సందేశం అదే’ అని రాహుల్‌ అన్నాడు. ‘టీ20 సిరీస్‌ తర్వాత నేను నిరాశపడ్డాను. కానీ, ఆట అలాగే సాగుతుంది. కొన్ని నాణ్యమైన షాట్లు నా ఆందోళనను తొలగించాయి. విరాట్‌, రిషభ్‌తో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పినందుకు సంతోషంగా ఉంది’ అని తెలిపాడు.

‘నేను, విరాట్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు 300 పరుగులు చేయాలనుకున్నాం. అయితే భారీ స్కోరు చేయడం సంతోషాన్నిచ్చింది. ఈ రోజు వాతావరణం చాలా వేడిగా ఉంది. కానీ మేం భాగస్వామ్యాలు నిర్మించడం ముఖ్యం. అందుకే ఈ స్కోరు నాకు ఆనందం కలిగిస్తోంది. పరుగులు చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం చేయాల్సిందీ అదే’ అని రాహుల్‌ వివరించాడు.

విమర్శలు ఎదురైనప్పుడు ఆటగాళ్లు సరికొత్తగా సంబరాలు చేసుకొనే సంగతి తెలిసిందే. 2018లో అడిలైడ్‌లో శతకం చేయనప్పుడు విరాట్‌పై విమర్శల వర్షం కురిసింది. దాంతో పెర్త్‌లో శతకం బాదగానే అతడు బ్యాటు ‘స్వీట్‌ స్పాట్‌’లో పంచ్‌ ఇచ్చి తన బ్యాటే మాట్లాడుతుందని సంజ్ఞలు చేశాడు. 2001, ఆస్ట్రేలియా సిరీస్‌ సందర్భంగానూ రాహుల్‌ ద్రవిడ్‌ ఇలాగే చేశాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అతడు ఈడెన్‌ గార్డెన్‌ ప్రెస్‌బాక్స్‌ వైపు తన హెల్మెట్‌ను ఆవేశంతో చూపించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని