Vaccination: అమెరికా జనాభాలో 50 శాతం మందికి పూర్తిస్థాయి టీకా! - white house says 50pc of americans fully vaccinated
close
Published : 07/08/2021 10:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccination: అమెరికా జనాభాలో 50 శాతం మందికి పూర్తిస్థాయి టీకా!

వెల్లడించిన శ్వేతసౌధం

వాషింగ్టన్‌: అమెరికా మొత్తం జనాభాలో సగం మందికి పూర్తిస్థాయి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందిందని శ్వేతసౌధం ప్రకటించింది. కరోనా డెల్టా రకం అగ్రదేశాన్ని మరోసారి కలవరపెడుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను ఇటీవల వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తాజా మైలురాయిని చేరుకున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌధంలో వ్యాక్సినేషన్‌ సమాచార విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సైరస్‌ షాపర్‌ ప్రకటించారు. 

అర్హుల్లో 58.5 శాతం మందికి..

అమెరికాలో ఇప్పటి వరకు 165 మిలియన్ల మందికి రెండు డోసుల మోడెర్నా లేదా ఫైజర్‌ టీకాగానీ లేదా ఏక డోసు జాన్సన్‌ టీకా గానీ అందింది. నిజానికి అమెరికా మొత్తం జనాభాలో సగం మందికి అంటే.. టీకా అందుబాటులోకి రాని 0-11 ఏళ్ల పిల్లలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఒకవేళ టీకా తీసుకోవడానికి అర్హత గల వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే 58.5 శాతం మందికి వ్యాక్సిన్‌ అందినట్లు సీడీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఇక మొత్తం జనాభాలో 58.4 శాతం అంటే 193 మిలియన్ల మందికి కనీసం ఒక డోసు టీకా అందింది. 

మధ్యలో నెమ్మదించిన వ్యాక్సినేషన్‌..

అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్దేశించిన 70 శాతం మంది యువజనులకు కనీసం ఒక డోసు అందించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక నెల ఆలస్యమైంది. జులై 4 నాటికి ఈ మైలురాయిని చేరుకోవాలని బైడెన్‌ ఆదేశించారు. కానీ, మధ్యలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కాస్త నెమ్మదించడంతో లక్ష్య ఛేదనలో జాప్యం జరిగింది. ఏప్రిల్‌ మధ్యలో సగటున రోజుకు 3.3 మిలియన్ల డోసులు పంపిణీ చేశారు. అది ఓ దశలో 50 వేలకు పడిపోయింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 100 రోజుల్లో 100 మిలియన్ డోసుల పంపిణీ లక్ష్యాన్ని బైడెన్‌ యంత్రాంగం సునాయాసంగా చేరుకున్న విషయం తెలిసిందే. అమెరికాలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం 2020, డిసెంబరు 14న ప్రారంభమైంది. సగం మందికి టీకా ఇవ్వడానికి దాదాపు 33 వారాలు పట్టింది.  

పెరుగుతున్న కేసులు..

అత్యధిక కేసులు, మరణాలతో వణికిపోయిన అమెరికా.. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా మరోసారి రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్‌ విజృంభిస్తుండడంతో న్యూయార్క్‌, లాస్‌ఏంజిల్స్‌ సహా కొన్ని కీలక ప్రాంతాల్లో మరోసారి ఆంక్షలు విధించారు. గతవారం సగటున రోజుకు 90 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. అంతకు క్రితం వారంతో పోలిస్తే కొత్త కేసులు ఏకంగా 43 శాతం ఎగబాకాయి. దీంతో ఆసుపత్రులకు తాకిడి పెరిగింది. 

మరింత వేగవంతంగా వ్యాక్సినేషన్‌..

దీన్ని తీవ్రంగా పరిగణించిన సీడీసీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. గత ఏడు రోజుల సగటు వ్యాక్సినేషన్‌ క్రితం వారంతో పోలిస్తే 11 శాతం.. గత రెండు వారాలతో పోలిస్తే 44 శాతం పెరిగినట్లు షాపర్‌ వెల్లడించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని