కోహ్లీసేన నాగాస్త్రం.. నాగ్వాస్‌వాలా! - who is arzan nagwaswalla team india new entry
close
Published : 08/05/2021 12:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీసేన నాగాస్త్రం.. నాగ్వాస్‌వాలా!

బంతి స్వింగ్‌ చేస్తే వికెట్లు పడాల్సిందే..

అర్జాన్‌ నాగ్వాస్‌వాలా.. టీమ్‌ఇండియా కొత్త ఆటగాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ సహా ఇంగ్లాండ్‌ పర్యటనకు స్టాండ్‌బైగా ఎంపికైన క్రికెటర్‌. భువనేశ్వర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య వంటి ఆటగాళ్లను కాదని సెలక్టర్లు అర్జాన్‌ను ఎందుకు ఎంపిక చేశారు? అతడి ఎంపిక వెనక తర్కం ఏంటి? అతడి ప్రత్యేకత ఏంటి?


దేశవాళీ సంచలనం

గుజరాత్‌కు చెందిన అర్జాన్‌ దేశవాళీ క్రికెట్లో ఓ సంచలనం. ఈ ఎడమచేతి వాటం పేసర్‌ రంజీల్లో ప్రకంపనలు సృష్టించాడు.  23 ఏళ్ల వయసున్న అతడు 2018లో గుజరాత్‌ తరఫున రాజస్థాన్‌పై లిస్ట్‌-ఏ మ్యాచులో అరంగేట్రం చేశాడు. ఫస్ట్‌క్లాస్‌లో 16 మ్యాచుల్లో 22.53 సగటు, 3.02 ఎకానమీతో ఏకంగా 62 వికెట్లు తీశాడు. ఇక 20 లిస్ట్‌-ఏ మ్యాచుల్లో 21.76 సగటుతో 39, 15 టీ20ల్లో 16.38 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు.


అందుకే.. ఎంపిక

అర్జాన్‌ టీమ్‌ఇండియాకు ఎంపికైయ్యేందుకు ప్రధాన కారణం అతడు ఎడమచేతి వాటం పేసర్‌ కావడమే. అంతేకాకుండా అతడి గణాంకాలు సైతం ఎంతో బాగున్నాయి. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేయడం.. ఊరించే లైన్‌ అండ్‌ లెంగ్తుల్లో బంతులు వేసి వికెట్లు తీయడం అతడి ప్రత్యేకత. పరుగులు నియంత్రించడంలోనూ మేటి. శస్త్రచికిత్స చేయించుకొన్న నటరాజన్‌ విశ్రాంతి తీసుకోవడం, ఇంగ్లాండ్‌ జట్టులో ఎడమచేతి వాటంతో బంతిని  స్వింగ్‌ చేసే బౌలర్లు ఎక్కువగా ఉండటంతో సెలక్టర్లు అర్జాన్‌ను స్టాండ్‌బైగా ప్రకటించారు. అక్కడి పరిస్థితులకు భారత బ్యాట్స్‌మెన్‌ అలవాటు పడేందుకు అతడి బౌలింగ్‌ ఎంతగానో ఉపయోగపడనుంది.


తొలి సీజన్లోనే మాయ

రంజీల్లో బరోడాపై అరంగేట్రం చేసిన నాగ్వాస్‌ ఆ పోరులో తీసింది ఒకే ఒక్క వికెట్టు. కానీ ఆ సీజన్‌ పూర్తయ్యే సరికి అతడిలోని ప్రతిభ, సామర్థ్యం అందరికీ తెలిసిపోయాయి. 8 మ్యాచులాడి 21 వికెట్లు తీశాడు. 5/90 అత్యుత్తమం. ముంబయి మ్యాచులో నమోదు చేశాడు. సూర్యకుమార్‌, అర్మన్‌ జాఫర్‌, సిద్దేశ్‌ లాడ్‌, ఆదిత్య తారె వంటి సీనియర్ ఆటగాళ్లను పెవిలియన్‌ పంపి గుజరాత్‌కు 9 వికెట్ల తేడాతో విజయం అందించాడు.

ఇక ఆ తర్వాతి సీజన్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. వికెట్ల వరద పారించాడు. బౌలింగ్‌ పరంగా మరింత అనుభవం, ఆత్మవిశ్వాసం సాధించాడు. కేవలం 8 మ్యాచుల్లో 18.36 సగటుతో ఏకంగా 41 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. కొన్నాళ్ల క్రితం ముగిసిన విజయ్‌ హజారేలో 7 మ్యాచుల్లో 4.32 సగటుతో 19 వికెట్లు తీశాడు. సయ్యద్‌ ముస్తాక్‌లో 5 మ్యాచుల్లో 9 వికెట్లు పడగొట్టి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.


అన్నను చూసి..

ఈ యువ ఆటగాడి పూర్తి పేరు అర్జాన్‌ రోహింగ్టన్‌ నాగ్వాస్‌వాలా. 1997, అక్టోబర్‌17న జన్మించాడు. గుజరాత్‌  సరిహద్దు పట్టణమైన అంబర్‌గావ్‌ సమీపంలోని నర్గల్‌ అతడి స్వస్థలం. ఎడమచేతి వాటంతో బౌలింగ్‌ చేసే అతడు కుడిచేత్తో బ్యాటింగ్ చేస్తాడు. గుజరాత్‌ తరఫున అండర్‌-16, అండర్‌-19 ఆడాడు. ఇక 1995 తర్వాత రంజీ ట్రోఫీ ఆడిన తొలి పార్సీ క్రికెటర్‌ సైతం అర్జానే. తన సోదరుడు విస్పీ క్రికెట్‌ ఆడటం చూసి ఆటపై మక్కువ పెంచుకోవడం గమనార్హం.

- ఇంటర్నెట్‌ డెస్క్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని