కరోనా మరణ మృదంగం@ 25లక్షలు - worldwide coronavirus deaths crossed twenty five lakh mark
close
Updated : 26/02/2021 15:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా మరణ మృదంగం@ 25లక్షలు

దిల్లీ: కరోనా వైరస్ వెలుగుచూసి ఇప్పటికే ఏడాది పూర్తయినప్పటికీ..అది సృష్టిస్తోన్న విలయం ఇంకా కొనసాగుతోంది. టీకాలు అందరికీ చేరువకాకపోవడంతో..ఇప్పటికీ వైరస్ మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం నాటికి 25 లక్షల పైచిలుకు మరణాలు సంభవించాయని ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ లెక్కగట్టింది. ఇప్పటివరకు 11,26,18,488 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారని, 25,00,172 మంది మృత్యు ఒడికి చేరుకున్నారని తన నివేదికలో పేర్కొంది.

సగానికి పైగా మరణాలు ఆ దేశాల్లోనే..

చైనాలో వెలుగుచూసిన కరోనావైరస్‌ కారణంగా ఐరోపా దేశాలు మొదటి నుంచి ఎక్కువ ఇబ్బందిపడుతున్నాయి. 8,42,894 మరణాలతో ఆ దేశాలు ముందు వరసలో ఉన్నాయి. ఆ తరవాత లాటిన్‌ అమెరికా, కరీబియన్ దేశాల్లో 6,67,972 మంది మృత్యువాతపడ్డారు. ఇక, వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన అగ్రదేశం అమెరికా, దాని పొరుగునే ఉన్న కెనడాలో 5,28,039 మందిని వైరస్ బలితీసుకుంది. సగానికి పైగా మరణాలు కేవలం ఐదు దేశాల్లోనే వెలుగుచూశాయని ఆ నివేదిక వెల్లడిచేసింది. ఐదు లక్షల పైచిలుకు మరణాలతో ఆ జాబితాలో అమెరికా ముందుండగా..బ్రెజిల్, మెక్సికో, భారత్‌, బ్రిటన్‌ తరవాతి స్థానాల్లో ఉన్నాయి. ఆయా దేశాల్లోని ఆరోగ్య శాఖలు వెల్లడించిన రోజూవారీ వివరాల ఆధారంగా ఈ నివేదిక తయారైంది.

మరో పది లక్షలకు నాలుగు నెలలే..

కరోనా పుట్టిల్లుగా భావిస్తోన్న చైనాలో జనవరి 2020లో మొదటి వైరస్ మరణం నమోదైంది. అదే ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 10లక్షల మార్కును దాటేసింది. కేవలం తొమ్మిది నెలల్లోనే ఈ స్థాయి మరణాలు సంభవించాయి. అక్కడి నుంచి నాలుగు నెలల్లోనే..అంటే జనవరి 15 నాటికి మరో పది లక్షల మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. ఆరోగ్య సంస్థ, ప్రపంచ దేశాలు నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ.. తాజాగా మొత్తం మృతుల సంఖ్య 25లక్షలు పైబడింది. అయితే జనవరి చివరినాటికి రోజూవారీ మరణాలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. జనవరి 20 నుంచి 26 మధ్యలో 1,01,400 మంది మృత్యుఒడికి చేరుకోగా..తరవాతి వారంలో ఆ వేగం(సుమారు 66,800) మందగించింది.  ప్రస్తుతం నవంబర్ ఆరంభంలో మాదిరిగా మరణాల సంఖ్య ఉంటుందని ఆ నివేదిక పేర్కొంది. కరోనా మరణాలతో ఉక్కిరిబిక్కిరి అయిన దేశాల్లో..ఇప్పుడు కాస్త తగ్గుదల కనిపిస్తోందని వెల్లడించింది.

జనాభా పరంగా చూసుకుంటే..
జనాభా ప్రాతిపదికన చూసుకుంటే బెల్జియంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ప్రతి 10లక్షల మందికి సగటున 1,900 వైరస్ మరణాలు సంభవించాయి. చెక్‌రిపబ్లిక్‌(1,850), స్లోవేనియా(1,830), బ్రిటన్‌(1,790), ఇటలీ(1,600) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

కాగా, భారత్‌లో మరోసారి కరోనా తన ప్రతాపాన్ని చూపుతోంది. వరసగా రెండో రోజు కూడా పాజిటివ్ కేసులు 16వేలకు పైగా నమోదయ్యాయి. తాజాగా 16,577 కొత్త కేసులు వెలుగుచూడగా..120 మరణాలు సంభవించాయి. మొత్తం కేసులు 1.10 కోట్లు దాటగా.. 1,56,825 మరణాలు సంభవించాయని కేంద్రం వెల్లడించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని