close
టాలీవుడ్‌
కూర్గ్‌లో సందడి చేసిన నేను.. శైలజ

బాల గోవింద్‌... అమెరికా లక్ష్యంగా పరుగులు తీసే హైటెక్‌ కుర్రాడు. మైండ్‌ని తప్ప మనసుని, ప్రేమని, ముఖ్యంగా అమ్మాయిల్ని అసలే నమ్మడు. తన కుటుంబం తరవాతే ఏదైనా అనుకునే స్వచ్ఛమైన స్వార్థపరుడు.
శైలజ... అందం, తెలివితేటలు... అంతకు మించి ఆత్మాభిమానం ఉన్న తెలుగింటి అమ్మాయి. మనిషికి మానవత్వం, బంధాలు, విలువలున్న వ్యక్తిత్వమే సంపద అని నమ్ముతుంది. కుటుంబానికి విలువ ఇస్తుంది.
ఇలా భిన్న మనస్తత్వాలున్న బాలు, శైలజ ఒకే ఆఫీస్‌లో కలిసి పనిచేస్తూ మాటల యుద్ధాలతో ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటారు. కానీ విధివశాత్తూ అనుకోని పరిస్థితుల్లో వీళ్ల వివాహం జరిగిపోతుంది. ఇష్టం లేని బంధంతో ముడిపడినా విడిపడాలనుకొద్దీ విడదీయలేనంత దగ్గరవుతుంటారు. ఈ ఇద్దరిలో మనిషికి, మనసుకీ మధ్య జరిగిన సంఘర్షణలో ఇద్దరూ ఒక్కటవుతారో, లేదంటే విడిపోతారో అనే అనూహ్య మలుపుల కథాగమనంలో సాగే ధారావాహిక ‘నేను శైలజ’. ఈటీవీ ప్లస్‌  ఛానల్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతి రోజూ రాత్రి గం 7.30 ని.లకు ప్రసారం అవుతోంది ‘నేను శైలజ’. ఈ ధారావాహికలో రోజీగా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు నవ్య. పలు విజయవంతమైన సీరియల్స్‌తో బుల్లి తెర వీక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు నవ్య. ‘నేను శైలజ’కి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాల్ని ఇటీవల కూర్గ్‌లోని అందమైన ప్రదేశాల్లో  తెరకెక్కించారు. ఆ కూర్గ్‌ సంగతుల్నీ, ‘నేను శైలజ’ విశేషాల్నీ ‘ఈనాడు సినిమా’తో పంచుకున్నారు నవ్య.

సాధారణంగా ధారావాహికల్ని ఇండోర్‌లోనే పూర్తి చేస్తుంటారు. ‘నేను శైలజ’ కోసం మాత్రం కూర్గ్‌ వరకూ వెళ్లొచ్చారు. ఆ అనుభవాలేంటి?
నిజమే. ధారావాహిక అనగానే ఇండోర్‌లోనే షూటింగ్‌ అయిపోతుంది. ఇంట్లోనే తొంభై శాతం సన్నివేశాల్ని నడిపించేస్తుంటారు. ధారావాహిక కోసం అవుట్‌డోర్‌ వెళ్లడం, అదీ కూర్గ్‌లాంటి అందమైన ప్రదేశాన్ని ఎంచుకోవడం ఆశ్చర్యంతో పాటు ఆనందాన్నీ  కలిగించింది. నేను బెంగళూరు అమ్మాయిని. కూర్గ్‌ నాకు తెలియని ప్రదేశం కాదు. ఎన్నిసార్లు వెళ్లినా, ప్రతిసారీ కొత్తగానే కనిపిస్తుంది. ‘నేను శైలజ’ కోసం ఎంచుకున్న లొకేషన్లు చాలా అందంగా, అద్భుతంగా ఉన్నాయి. బుల్లితెర వీక్షకులకు ఇదో కొత్త అనుభవం.
కూర్గ్‌లో షూటింగ్‌ ఎలా సాగింది?
షూటింగ్‌ కోసం కాకుండా, విహారయాత్రకు వెళ్లినంత ఆనందం  కలిగింది. ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ పనిచేశాను. ఇలాంటి చోట  ధారావాహికని తెరకెక్కించాలన్న ఆలోచనకు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. ఖర్చు ఎక్కువ అయిపోతుందేమో? అని అస్సలు ఆలోచించలేదు. రెండు మూడు నిమిషాల సన్నివేశం కోసం కూడా గంటల ప్రయాణం చేసి కొత్త లొకేషన్లకు చేరుకునేవాళ్లం. మేం కూడా ‘బ్రేక్‌’ టైమ్‌ గురించి అస్సలు ఆలోచించకుండా పనిచేశాం. పొలాచ్చీలోనూ కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. అవన్నీ ‘నేను శైలజ’కు కొత్త అందాన్ని తీసుకొస్తాయి.
ఈ ధారావాహికలో మీ పాత్ర ఎలాంటిది?
ఇప్పటి వరకూ ‘ఆహ్వానం’, ‘కంటే కూతుర్నే కను’, ‘మీనా’ లాంటి  ధారావాహికల్లో నటించాను. వాటితో పోలిస్తే ‘నేను శైలజ’లో నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. ఇందులో రోజీగా కనిపిస్తాను. నా పాత్ర పేరు ‘రోజీ’ అని చెప్పగానే నచ్చేసింది. సరదాగా ఉండే ఓ పాజిటివ్‌ పాత్ర ఇది. గెటప్‌ చాలా బాగుంది. రోజీగా నా గెటప్‌, కాస్ట్యూమ్స్‌ చూసి ఇంట్లోవాళ్లు సైతం మెచ్చుకున్నారు. ధారావాహిక మొదలై కొన్ని రోజులే అయ్యింది. ఈలోగానే ఈ పాత్రకి బాగా కనెక్ట్‌ అయిపోయాను. సాధారణంగా తెలుగులో ధారావాహికలంటే నెగిటివ్‌గా ఉంటాయి, ఏడుపులు ఎక్కువ అనుకుంటుంటారు. కానీ ‘నేను శైలజ’ను అందుకు భిన్నంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రేమ, అనుబంధంతో పాటు అన్నిరకాల భావోద్వేగాలూ ఈ ధారావాహికలో కనిపిస్తాయి. మేం చూపిస్తున్న  విషయాలు, ప్రతి ఒక్కరి జీవితంతోనూ ముడిపడే ఉంటాయి.
ధారావాహికలకు వెబ్‌ సిరీస్‌ల నుంచి పోటీ వస్తోంది కదా? దాన్ని తట్టుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది?
వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులు వేరు, సీరియల్‌ చూసే ప్రేక్షకులు వేరు. వెబ్‌ సిరీస్‌లో వినూత్నమైన కథలొస్తున్నాయి. అయితే వాళ్లు అనుకున్నది అనుకున్నట్టుగా చూపించేస్తుంటారు. ఎందుకంటే వెబ్‌ సిరీస్‌ వరకూ సెన్సార్‌ లేదు. ధారావాహికలు అలా కాదు. కుటుంబ ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించాల్సి వస్తుంది. వాటికంటూ కొన్ని  పరిమితులుంటాయి. కాకపోతే.. ధారావాహికల్లోనూ ఎంత సేపూ అత్తా కోడళ్ల విభేదాలో, ఏడుపులో చూపిస్తే కుదరదు. అక్కడ కూడా ఏదో ఓ కొత్త అంశాన్ని పట్టుకోవాల్సిందే. సున్నితమైన భావోద్వేగాలు పండించాలి. ‘నేను.. శైలజ’ అలాంటిదే.
సినిమా అవకాశాలు వస్తున్నాయా?
ఇది వరకు కొన్ని సినిమాల్లో నటించా. ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే ధారావాహికల్లో నటిస్తూ, సినిమాల వైపు దృష్టి పెట్టడం చాలా కష్టం. రెండింటికీ సమయం సరిపోదు. మంచి పాత్రలొస్తే మాత్రం తప్పకుండా వెండితెరపైనా కనిపిస్తా.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.