close
టాలీవుడ్‌
ఆ హద్దులు చెరిగిపోయాయి

‘‘సినిమాని ఆరాధించే తెలుగు ప్రేక్షకుల ముంగిట బెంగాలీ సినిమా ప్రదర్శితమవుతుండడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు రితూపర్ణసేన్‌ గుప్త. బెంగాలీలో అగ్ర కథా నాయికగా కొనసాగుతున్న నటి ఈమె. హిందీతో పాటు దక్షిణాదిలోనూ నటించారు. నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేశారు. ఆమె హైదరాబాద్‌లో జరుగుతున్న బెంగాలీ చిత్రోత్సవాలకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె నటిస్తూ నిర్మించిన ‘ఆహారే’ చిత్ర ప్రదర్శన అనంతరం ‘ఈనాడు సినిమా’తో మాట్లాడారు. ఆమె చెప్పిన విషయాలివీ...
హైదరాబాద్‌ బెంగాలీ చిత్రోత్సవాల్లో సినీ  ప్రియుల సందడి చూశాక ఏమనిపించింది?
ఆరేళ్లుగా ఈ చిత్రోత్సవాలు జరుగుతున్నాయి. గతేడాది నేను నటించిన రెండు సినిమాలు ఇక్కడ ప్రదర్శితమయ్యాయి. ఈసారి నేను నటిస్తూ, నిర్మించిన ‘ఆహారే’ చిత్రం ప్రదర్శితమైంది. ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా సినిమాని  ఆస్వాదించడం చూసినప్పుడు మంచి అనుభూతి  కలిగింది. పశ్చిమ బెంగాల్‌లోనే కాకుండా మిగతా ప్రాంతాల్లోనూ విరివిగా బెంగాలీ సినిమా ప్రదర్శితం కావాలనేది మా లక్ష్యం. ఇలాంటి చిత్రోత్సవాలతో బెంగాలీ సినిమాని మరింత మందికి చేరువ చేయొచ్చు.
ప్రాంతీయ చిత్రాలపై మీ అభిప్రాయమేంటి?
ఒకప్పుడు ప్రాంతీయ చిత్రాలు. ఇప్పుడు ఆ హద్దులు చెరిగిపోయాయి. మంచి సినిమా అన్ని ప్రాంతాలకీ వెళుతోంది. అయితే ప్రాంతీయ చిత్రాలు స్థానిక సంస్కృతికీ, వారసత్వ  సంపదకి ప్రతీకగా నిలుస్తుంటాయి. సాహిత్య వైభవం ఎలాంటిదో వాటిలో కనిపిస్తుంటుంది. ప్రాంతీయ చిత్రాలు అన్ని ప్రాంతాలకీ  వెళ్లినప్పుడు సంస్కృతి మార్పిడి జరుగుతుంది.
మార్కెట్‌ని విస్తరించుకోవడమే ఇలాంటి చిత్రోత్సవాల లక్ష్యమా?
ఇతర భాషల్లోకి కూడా మన సినిమా వెళ్లాలనీ, అక్కడి ప్రేక్షకులోనూ మన సినిమాపై అవగాహన పెంపొందించి మార్కెట్‌ని విస్తరించుకోవాలన్నది ఓ కారణం కావొచ్చు. అయితే సంస్కృతి, సంప్రదాయాల్ని సినిమా మాధ్యమం ద్వారా పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడమే ప్రధాన లక్ష్యం.
బెంగాలీ, తెలుగు సినిమాలకి మధ్య మీరు గమనించిన సారూప్యతలు?
రెండూ స్థానిక సంస్కృతికీ, కళలకీ అద్దం పడుతుంటాయి. నేను తెలుగు సినిమాలు చూస్తుంటా. ఇదివరకు ‘ఘటోత్కచుడు’లో కూడా నటించా. సినిమా అంటే కళ, వాణిజ్యాల మేళవింపు అని ఇటీవల రెండు భాషల చిత్రాలు చాటి  చెబుతున్నాయి. బెంగాలీ సినిమా అంటే ఇదివరకు ఆర్ట్‌ సినిమా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. ఇప్పుడు అక్కడ కళాత్మకమైన వాణిజ్య చిత్రాలు రూపొందుతున్నాయి.
మీ సినిమా ‘ఆహారే’ ప్రదర్శితమైంది కదా. ఆహారే అంటే అర్థమేంటి?
బాగా నచ్చితే ఆహా అంటుంటాం కదా. అలా ఆహారే అనే వాడుక మాటతో పాటు ఆహారం అని కూడా అర్థం వచ్చేలా ఈ పేరు పెట్టాం. నా మనసుకు బాగా దగ్గరైన చిత్రమిది.
‘ఘటోత్కచుడు’ తర్వాత తెలుగులో నటించలేదేంటి?
బెంగాలీ, హిందీ సినిమాలతో బిజీ అయిపోయా. మంచి అవకాశం వస్తే నటించాలనుకొన్నా కుదర్లేదు.
భవిష్యత్తులో దర్శకత్వం కూడా చేస్తారా?
అలాంటి ఆలోచనలేవీ లేవు. నటన, నిర్మాణం పరంగా అయితే డ్యాన్స్‌తో సంబంధమున్న మరిన్ని  సినిమాలు చేయాలనే కోరికైతే ఉంది.

చిన్నప్పటి మాటలు గుర్తుకొచ్చాయి

‘‘మెయిన్‌స్ట్రీమ్‌ చిత్రాల్లో సమస్యల్ని కూడా కామెడీగా తీస్తుంటారు. అది వాణిజ్యం కోసమే. కానీ ఇండిపెండెంట్‌ సినిమాల్లో సమస్యని ప్రస్తావించినా, దానికి పరిష్కారం చెప్పినా అది అర్థవంతంగా ఉంటుంది. అలాంటి సినిమాలు ఎక్కువగా చిత్రోత్సవాల్లోనే ప్రదర్శితమవుతుంటాయి. ఒక సమస్యని తెరపై ఎలా చూపించవచ్చో ఇలాంటి సినిమాలు చూస్తే మంచి అవగాహన ఏర్పడుతుంది. ఒక సినిమాని బయట చూడటం వేరు, చిత్రోత్సవాల్లో చూడటం  వేరు. ఇక్కడ దర్శక నిర్మాతలు సినిమా ప్రదర్శన తర్వాత  ప్రేక్షకులతో సినిమా వెనక ఆలోచనల్ని పంచుకుంటారు. అవి భావి సినీరూపకర్తలకి మేలు చేస్తాయి. హైదరాబాద్‌ బెంగాలీ చిత్రోత్సవాల్ని నిర్వహణ తీరు చాలా బాగుంది. చిన్నప్పుడు నేను బెంగాలీ మాట్లాడేదాన్ని. ఈ చిత్రోత్సవాలతో చిన్నప్పటి మాటలు గుర్తొచ్చాయి’’

- అమల అక్కినేని

 

 


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.