close
టాలీవుడ్‌
అమ్మైనా నాన్నైనా నువ్వేలే... వెంకీ మామా!

మేనమామని చూస్తే అమ్మని చూసినట్టే. ఆ బంధం అంత బలమైంది. బాధ్యత ఉన్నది. అతని వేలు పట్టుకుని నడుస్తుంటే ఓ భరోసా. అమ్మ లేని లోటునీ తీర్చగలడు. నాన్నలా ధైర్యమూ ఇవ్వగలడు. ఓ అన్నలా, నేస్తంలా, సమస్తంలా మారిపోగలడు. ఆ బంధాన్ని ఆవిష్కరించగలిగే పాటొకటి ‘వెంకీ మామ’లో రచయిత రామజోగయ్య శాస్త్రికి దక్కింది. వెంకటేష్‌, నాగచైతన్య కథానాయకులుగా నటించారు. వారిద్దరూ వరుసకు మామా - అల్లుళ్లే. అందుకే ఊహాలోకాల్లో విహరించే అవసరం రాకుండా, వాళ్లిద్దరి అనుబంధానికే అక్షర రూపం ఇచ్చేశారు. బాబి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ పాట గురించి రామజోగయ్యశాస్త్రి చెప్పిన మాటలు.
 

‘‘దర్శకుడు బాబి నన్నూ తమన్‌నీ దగ్గర కూర్చోబెట్టుకుని ఈ సన్నివేశం వివరించారు. సినిమా ప్రారంభంలోనే వచ్చే గీతం ఇది. సందర్భం చెప్పినప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. తెరపై సినిమా చూస్తున్న ప్రేక్షకులకూ ఇదే అనుభూతి కలుగుతుంది. సందర్భం చెప్పారో లేదో.. వెంటనే తమన్‌ ట్యూన్‌ అందుకున్నారు. నా పదాలు వరుస కట్టాయి. సాకీతో పాట మొదలెడితే ఆసక్తికరంగా ఉంటుందనిపించింది. అందుకే ‘ద్రాక్షారం జంగమయ్య భీమలింగయ’ అంటూ శ్రీకారం చుట్టాం.

‘నే పలికిన తొలి పదమా.. నాకే దొరికిన వరమా.. నాకై నిలిచిన బలమా’ అంటూ పల్లవి మొదలవుతుంది. పాటలోని ప్రతి వాక్యానికీ కథతో సంబంధం ఉండేలా జాగ్రత్తపడ్డాను. సినిమా చూస్తున్నప్పుడు ఆ సంగతి అర్థం అవుతుంది. ‘అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామా’ అనేది హుక్‌లైన్‌గా వాడాం. వెంకటేష్‌, నాగచైతన్య ఇద్దరూ మామా అల్లుళ్లే. కాబట్టి ఈ పాట వాళ్లకోసమే పుట్టిందా అనిపించేలా సాగుతుంది.

‘నీ భుజమెక్కి చూసిన లోకం.. నాకెంతో అందమైనది
నీ జతనడిచి గడిపిన కాలం గెలిపించే పాఠమైనది
నీ రక్తం పంచుకున్న జన్మహక్కుతో నాలో ప్రతి గుణమూ
నీ పోలికైనది’ అనే మంచి లైన్లు రాసే అవకాశం దక్కింది.

మధ్యమధ్యలో డ్యాన్స్‌ మూమెంట్స్‌కి తగిన బీట్‌, అందులో పదాలూ సరిగ్గా పడ్డాయి. దాంతో అటు మాస్‌కీ, ఇటు కుటుంబ ప్రేక్షకులకూ,  మరీ ముఖ్యంగా వెంకటేష్‌, నాగచైతన్య అభిమానులకూ నచ్చేలా పాట తయారైంది.

టైటిల్‌ గీతం అంటే వీరోచితంగా ఉండాలి, కథానాయకుల్ని పొగడాలి, ప్రతి పదానికీ భూమి బద్దలైపోతున్న అనుభవాన్నీ, అనుభూతినీ జోడించాలి అనే లెక్కలు ఇప్పుడు మారిపోతున్నాయి. శ్రోతల అభిరుచి మారుతోంది. మెలోడీ పాటల్ని రెండు చేతులూ చాచి ఆహ్వానిస్తున్నారు. సినిమాలోనే కాదు, పాటలోనూ కంటెంట్‌ని వెతుక్కుంటున్నారు. అలాంటి పాటలకే ఆదరణ దక్కుతోంది. తమన్‌ ఈమధ్య మరింత ఎక్కువగా విజృంభిస్తున్నారు. తన పాటలు మార్మోగిపోతున్నాయి. ట్రెండ్‌కి తగిన పాటల్ని అందిస్తున్నారు. తన సంగీత సారథ్యంలో పాట రాయడం ఎప్పుడూ సరికొత్తగానే అనిపిస్తుంటుంది. మా ఇద్దరి కలయికలో వచ్చిన ఈ పాట కూడా జనంలోకి వెళ్లడం మరింత ఆనందాన్ని ఇచ్చింది’’.

చిత్రం: వెంకీ మామ
సంగీతం: తమన్‌
గానం: శ్రీకృష్ణ
రచన: రామజోగయ్య శాస్త్రి

సాకీ: ద్రాక్షారం జంగమయ్య భీమలింగయ..
బిడ్డల కాచుకోవయా బిడ్డల కాచుకోవయా
మనసున్న మహిమున్న మణికాంబిక
చల్లని తల్లి తోడుగ నువ్వు పంచవే దయా
మచ్చెరుగని మేనమామ మేలుజాతి రత్నం
ఆ మామకి అల్లుడంటే అంతులేని ప్రాణం
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తీయవమ్మ సిరి గోదారి
ఏ పాడుకళ్లు పడకుండా వీళ్లిద్దరు కలిసుండాలి..

పల్లవి: మామా మామా మామా.. 
నే పలికిన తొలి పదమా
నాకే దొరికిన వరమా.. నాకై నిలిచిన బలమా
నీ కాలి అడుగుల్లో ఉంది నా గుడి.. 
నీ నోటి పలుకుల్లో ఉంది నా బడి
పుడుతూనే నీ ఒడిలో పాపనై పడి.. 
నీ పేరై మోగింది గుండె సవ్వడి
అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామ
నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ మామ 

చరణం 1
నీ భుజమెక్కి చూసిన లోకం.. నాకెంతో అందమైనది
నీ జతనడిచి గడిపిన కాలం.. గెలిపించే పాఠమైనది
నా పాదం ఏ పుణ్యం చేసుకున్నదో.. 
నీ వెచ్చని గుండెలపై ఆడుకున్నది
నీరక్తం పంచుకున్న జన్మ హక్కుతో.. 
నాలో ప్రతి గుణమూ నీ పోలికైనది
అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామ
నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ మామ 

చరణం 2
ఓ సీతక్క గీతక్క మాలచ్చక్క మంగక్క..
చూడండే ఈ పక్క ఎవరొచ్చారో ఎంచక్కా..
హే ఉల్లాసం ఉత్సాహం జోడీ కట్టి బండెక్క.
మామా అల్లుళ్లు వచ్చారే జాతర గాలే వేడెక్క
ఇట్టా కలిసి వస్తే పక్క పక్కా నడిచి వస్తే
రెప్పలేయడమింకా రెండు కళ్లూ మరచిపోవాలే..
వీళ్లేచోటున్నా ఇంతే రచ్చ రచ్చో రంగుల సంతే..
పంచె ఎగ్గట్టేసి దిగారంటే సంబరాల గాలే
అద్దిరబన్నా ఇద్దరికిద్దరు హేమాహేమీ బుల్లోళ్లే..
ఊరూవాడా హోరెత్తించే సరదాగాళ్ల చిన్నోళ్లే
వరసకేమో ఓరయ్యో వీళ్లు మామా అల్లుళ్లే
వయసే తేడా తీసేస్తే పక్కా అల్లరి పిల్లోళ్లే.. హే..

 


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.