close
టాలీవుడ్‌
ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాదు

‘దర్బార్‌’ వేడుకలో రజనీకాంత్‌

‘‘నా విజయానికి కృషి, పట్టుదల మాత్రమే కాదు.. దర్శకనిర్మాతలు కూడా ప్రధాన కారణం. జీవితంలో విజయం సాధించాలంటే సమయం, పరిస్థితులు అనుకూలించాలి’’ అన్నారు రజనీకాంత్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దర్బార్‌’. మురుగదాస్‌ దర్శకుడు. నయనతార కథానాయిక. నివేదా థామస్‌ కీలక పాత్రధారి. సునీల్‌ శెట్టి ప్రతినాయకుడిగా నటించారు. సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ స్వరాలు అందించారు. శనివారం రాత్రి చెన్నైలో పాటలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా రజనీకాంత్‌ మాట్లాడుతూ ‘‘ఎస్సెసెల్సీ చదివేటప్పుడు ఇంట్లోవాళ్లు పరీక్షల ఫీజు కోసం రూ.150 ఇచ్చారు. అయితే పరీక్ష ఫెయిల్‌ అవుతానని నాకు తెలుసు. అందుకే మద్రాస్‌ రైలెక్కాను. టికెట్‌ ఎక్కడో పడిపోయింది. టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఆ విషయం చెప్పినా జరిమానా కట్టాల్సిందే అంటూ అందరి ముందు అరిచారు. అప్పుడు ఐదుగురు కూలీలు నాకు డబ్బు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ‘నేను డబ్బు లేక టికెట్‌ తీసుకోలేదనుకుంటున్నారేమో. కానీ నేను టికెట్ తీసుకున్నానన్నది నిజం. ఆవిషయాన్ని టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌కు చెబుతున్నా నమ్మడం లేదు’ అన్నాను. అప్పుడు ఇన్‌స్పెక్టర్‌ నన్ను నమ్మారు. అదే తొలిసారి ఓ తెలియని వ్యక్తి నన్ను నమ్మడం. ఆ తర్వాత మద్రాస్‌కు వచ్చాక కె.బాలచందర్‌ నన్ను నమ్మారు. ఆయన నమ్మకాన్ని గెలిపించాను. ఇప్పుడు ప్రజలు నామీద నమ్మకం పెట్టుకున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము కాదు. ఇప్పుడు ప్రతికూల ధోరణితో ఆలోచించడం ఎక్కువైంది. మీడియా కూడా దాన్నే అనుసరిస్తోంది. సానుకూల దృక్పథాన్నే అలవర్చుకోవాలి. నా జీవితంలో ఓ బాధాకర ఘటన జరిగింది. ‘16 వయదినిలే’ చిత్రం తర్వాత ఓ నిర్మాత నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానన్నారు. కానీ సెట్‌కు వెళ్లేవరకూ అడ్వాన్స్‌ ఇవ్వలేదు. అడ్వాన్స్‌ ఇస్తేనే నటిస్తానని తెగేసి చెప్పాను. అప్పుడాయన ‘ఏరా నీకంత పొగరా. నీకు వేషం లేదు. ఇంటికి వెళ్లిపో’ అని అరిచారు. నాకు చాలా బాధేసింది. ఆ కసితోనే ఎదగాలనుకున్నాను. ఆ తర్వాత రెండున్నరేళ్లలో ఫారిన్‌ కారు కొన్నాను’’ అని చెప్పారు. ‘దర్బార్‌’ గురించి చెబుతూ ‘‘శివాజీ’ టైమ్‌లోనే మురుగదాస్‌ ఈ కథ చెప్పారు. నేను అనుకున్నదానికన్నా బాగా తెరకెక్కించారు. ‘దళపతి’ తర్వాత 29 ఏళ్ల అనంతరం మళ్లీ సంతోష్‌ శివన్‌ నా సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. అనిరుధ్‌ నా ఇంటి బిడ్డ’’ అన్నారు. మురుగదాస్‌ మాట్లాడుతూ ‘‘నేను ఏ సన్నివేశం రాసుకున్నా రజనీకాంత్‌ను ఊహించుకునే రాసుకుంటా. అలాంటిది ఆయన చిత్రానికే దర్శకత్వం వహించడం చంద్రమండలానికి వెళ్లినంత ఆనందంగా ఉంది. ఆయనకు అందరికన్నా నేనే పెద్ద అభిమానిని’’ అన్నారు. దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ ‘‘రజనీకాంత్‌తో కలసి పనిచేసి ఒకటిన్నర సంవత్సరం అవుతోంది. కానీ ఇప్పటికీ సెట్‌కి వెళ్లినప్పుడల్లా ఆయనే గుర్తొస్తుంటారు. సమయం విలువ తెలిసిన నటుడు రజనీకాంత్‌. ఆయన్ను పోలీస్‌ గెటప్‌లో చూసి చాలా రోజులైంది’’ అన్నారు. నివేదా థామస్‌ మాట్లాడుతూ ‘‘రజనీ సర్‌ చిత్రంలో నటిస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. ఆయనతో కలసి నటించినందుకు సంతోషంగా ఉంది. ఆ భగవంతుడు ఎల్లప్పుడూ రజనీ సర్‌ పక్కనే ఉంటూ కాపాడుతున్నాడ’’ని చెప్పింది. అనిరుధ్‌ మాట్లాడుతూ ‘‘రజనీకాంత్‌గారి చిత్రానికి సంగీతం అందించడం నా కల. అది ఈ చిత్రంతో రెండోసారి నెరవేరింది. నాపై నమ్మకముంచిన మురుగదాస్‌కి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ఈ సినిమాను బాగా తీర్చిదిద్దిన చిత్రబృందానికి, ఈ సినిమాకు అండగా నిలబడిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు సుభాస్కరన్‌. ఈ కార్యక్రమంలో రజనీకాంత్‌ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్యలతో పాటు అరుణ్‌ విజయ్‌, సంతోష్‌ శివన్‌ తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, కోడంబాక్కం

 


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.