close
టాలీవుడ్‌
విజయోస్తు

రచన: చైతన్యప్రసాద్‌
గానం: వందేమాతరం శ్రీనివాస్‌
పల్లవి: ఏనాడూ ఎరుగనిదిది - కలనైనా కనరానిది
జగమంతా భయ భీకర - జడత్వాన మునిగినాది
కనిపించని శత్రువుతో సాగుతోంది యుద్ధం
ప్రతి మనిషీ సైనికుడై ఈ యుద్ధం గెలుద్దాం

చరణం 1:

సంఘ జీవి ఏకాకై - భంగపడిన సమయం ఇది
భవితవ్యం గతి తెలియక - బెంగపడ్డ తరుణం ఇది
పుడమి పైన ఎదురులేని - పెత్తనాన్ని సాగించిన
బుద్ధిజీవి మానవుడే - వ్యర్థుడైన వైనం ఇది
విశ్వంలో వీధులన్ని వెలవెలబోయాయి నేడు
భయం వల్ల మనిషి స్వయం బందీ అయ్యాడు చూడు

చరణం 2:
కూలినాలి బతుకులన్ని - కుప్పకూలి పోయినాయి
ఆకలితో పేగులన్ని - అలమటించి పోయినాయి
వలస జనం దిక్కు లేని - పక్షుల్లా మారినారు
సొంతూళ్లకు వెళ్లేందుకు - వేల మైళ్లు నడిచినారు
చుట్టూతా రోగం కలి పొట్ట లోన పెను ఆకలి
ఏ క్షణాన ఏమౌనో ఎవ్వరికీ తెలియదు మరి

చరణం 3:
ఆపదలో ముందుకొచ్చి - ఆదుకునే హస్తాలకు
ప్రాణాలను పణం పెట్టి - పెనగు వైద్య బృందాలకు  
మనకోసం రోడ్ల మీద - మాడే రక్షక భటులకు
పారిశుద్ధ్య క్రతువు లోన - సాగే సేవా వ్రతులకు
అత్యవసర విధుల్లోన  నిత్య జీవ పథం లోన
శ్రమియించే అందరికీ  శత సహస్ర వందనాలు
ఈ యుద్ధం వైరస్‌ పై !  మనుషుల నిర్లక్ష్యంపై !  
పుకార్లతో సకిలించే  -పలు మాయల ఫకీర్లపై !
సంక్షోభం త్వరలోనే - పుడమి విడిచి పోవాలి
మనిషి కూడ ఇకనైనా - మనిషి లాగ మారాలి
‘‘ఇంతకుముందు ప్రపంచం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. ఎన్నెన్నో వైపరీత్యాలను అధిగమించింది. కానీ ఇలాంటి ఉత్పాతాన్ని ఎప్పుడూ కనీవినీ ఎరుగం. సమస్త ప్రపంచ మానవాళి ఏకకాలంలో కరోనా మహమ్మారి అనే కనిపించని ఉమ్మడి శత్రువుతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రపంచ వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మనుషులు తమను తామే ఇళ్లలో నిర్బంధించుకోక తప్పలేదు. రెక్కాడితే గాని   డొక్కాడని జనాలు, పొట్ట చేత పట్టుకుని ఊరు కాని ఊరు వలస వచ్చిన జనాలు, చదువుల కోసం వచ్చి తిరిగి ఇళ్లకు వెళ్లే దారిలేని విద్యార్థులు, వేరే ఊళ్ల నుంచి వచ్చి ఆసుపత్రుల్లో చిక్కుకుపోయిన రోగులు, వారి బంధువులు.... ఇలా ఎందరెందరో ఈ అకాల అనూహ్య అనివార్యమైన కర్ఫ్యూతో నానా అగచాట్లు పడుతున్నారు. ఈ మధ్యలో కాలక్షేపం లేదని బాధ పడుతున్న కడుపు నిండిన వాళ్లూ ఉన్నారు. నానా పుకార్లను సృష్టించి ప్రపంచం మీదకు వదిలి వినోదిస్తున్న ద్రోహ బుద్ధులూ, అనాలోచితంగా వాటికి ప్రచారం కల్పిస్తున్న మందమతులూ ఉన్నారు. ఈ అవాంఛనీయ పరిణామాలు కవిగా నన్ను కలవరపెట్టాయి. ఈ పరిస్థితుల్లో కూడా ప్రాణాలను పణంగా పెట్టి మనందరి కోసం రేయింబవళ్లు పనిచేస్తున్న వైద్య బృందాలు, రక్షక భటులు పారిశుద్ధ్యకార్మికులు, ఇతర నిత్యావసర విభాగాల సేవా నిరతి విస్మయం కలిగించింది. ఈ నేపథ్యంలో నా స్పందనే ఈ గేయంగా పలికింది. మానవ జాతి ఎన్నో ఉపద్రవాలకు ఎదురు నిలిచి గెలిచింది. ఇప్పుడు కూడా గెలుస్తుంది. విజయోస్తు’’.

- చైతన్య ప్రసాద్‌, సినీ గీత రచయిత


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.